‘పట్నం’కే పట్టం | Patnam Mahender Reddy Win In MLC Elections | Sakshi
Sakshi News home page

‘పట్నం’కే పట్టం

Published Tue, Jun 4 2019 8:04 AM | Last Updated on Tue, Jun 4 2019 8:04 AM

Patnam Mahender Reddy Win In MLC Elections - Sakshi

పట్నం నరేందర్‌రెడ్డి

గతేడాది డిసెంబర్‌లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో పట్నం మహేందర్‌రెడ్డి ఓటమిపాలైన విషయం తెలిసిందే. తాండూరు సెగ్మెంట్‌ నుంచి పోటీచేసిన ఆయన.. కాంగ్రెస్‌ అభ్యర్థి పైలెట్‌ రోహిత్‌రెడ్డి చేతిలో పరాజయం పొందారు. ఇదే సమయంలో మహేందర్‌రెడ్డి సోదరుడు  పట్నం నరేందర్‌రెడ్డి కొడంగల్‌ నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా నెగ్గారు. ఈ నే పథ్యంలో అప్పటికే ఎమ్మెల్సీగా కొనసాగుతున్న నరేందర్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. దీంతో స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఉపఎ న్నిక అనివార్యమైంది. ఈ స్థానం నుంచి పోటీచేసిన మహేందర్‌రెడ్డిని విజయం వరించడం విశేషం. 

సాక్షి, రంగారెడ్డి జిల్లా: స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాన్ని టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. ఆ పార్టీ అభ్యర్థి పట్నం మహేందర్‌రెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డిపై 244 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. పోలైన 797 ఓట్లలో మహేందర్‌రెడ్డికి 510 ఓట్లు దక్కగా.. ప్రతాప్‌రెడ్డికి 266 ఓట్లు లభించాయి. ఓట్ల లెక్కింపు రాజేంద్రనగర్‌లోని వెటర్నరీ కళాశాలలో సోమవారం  జరిగింది. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభమైన గంటన్నరలోనే దాదాపుగా మహేందర్‌రెడ్డి గెలుపు ఖాయమైంది. అభ్యర్థి వారీగా బ్యాలెట్‌ పేపర్లు బిండల్‌గా కడుతున్న సమయంలోనే కాంగ్రెస్‌ అభ్యర్థి ఓటమి సంకేతాలు కనిపించాయి. ఉదయం 11 గంటలకు మహేం దర్‌రెడ్డి విజయాన్ని యంత్రాంగం అధికారికంగా ప్రకటించింది. తొలిప్రాధాన్యత ఓటుతోనే ఆయనకు విజయం దక్కింది. దాదాపు సగం ఓట్ల తేడాతో గెలుపొందడంతో గులాబీ శిబిరంలో ఆనందోత్సాహాలు మిన్నంటాయి. సిట్టింగ్‌ స్థానాన్ని టీఆర్‌ఎస్‌ తిరిగి కైవసం చేసుకోవడం విశేషం.

క్రాస్‌ ఓటింగ్‌ 
ఆరు వందలకుపైగా ఓట్లు లభిస్తాయని టీఆర్‌ఎస్‌ మొదటి నుంచి ధీమాతో ఉంది. ఈ పార్టీ నిర్వహించిన శిబిరాల్లో 630 మంది సభ్యులకు ఆతిథ్యం కల్పించినట్లు సమాచారం. ఈ ఓట్లన్నీ తమకు దక్కుతాయని ఆశించారు. కానీ, పరిస్థితి కొంత మారింది. టీఆర్‌ఎస్‌ శిబిరంలోని కొందరు సభ్యులు కాంగ్రెస్‌ అభ్యర్థికి ఓటేసినట్లు తెలుస్తోంది. ఇలా వందకుపైగా ఓట్లు చేజారినట్లు టీఆర్‌ఎస్‌ నేతలు చర్చించుకుంటున్నారు. ఇవి కూడా తమ ఖాతాల్లోకి వస్తే భారీ విజయం దక్కేదని భావిస్తున్నారు. మేడ్చల్‌ ప్రాంతంలోని సభ్యులు ప్రత్యర్థి శిబిరానికి ఆకర్షితులైనట్లు చర్చ జరుగుతోంది. ఒకరిద్దరు మినహా జీహెచ్‌ఎంసీ పరిధిలోని కార్పొరేటర్లు అంతా టీఆర్‌ఎస్‌కే ఓటేసినట్లు సమాచారం. మున్సిపాలిటీల్లోని కౌన్సిలర్లలో ఎక్కువ మంది అధికార పార్టీకే ఓటేశారు. గ్రామీణ ప్రాంతంలోని ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కాంగ్రెస్‌ వైపు మొగ్గుచూపినట్లు సమాచారం.

‘స్థానికత’ను సానుకూలంగా మలుచుకున్న టీఆర్‌ఎస్‌ 
జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి సీనియర్‌ నేతలు ఉన్నా స్థానికేతరుడికి కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఈ పరిణామాన్ని అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ సానుకూంగా మలుచుకోవడంలో విజయవంతమైంది. జిల్లా నేతను కాదని స్థానికేతరునికి ఓటు ఎలా వేస్తారని సభ్యులు ఆలోచించేలా టీఆర్‌ఎస్‌ చేసిన ప్రయత్నం సత్ఫలితాన్నిచ్చింది. ‘సీనియర్‌ నేతగా ఎప్పుడి నుంచో మీకు అందుబాటులో ఉన్నాను.. నన్ను కాదని ఎలా పోతారు’ అని శిబిరాల్లో ఉన్న సభ్యులను మహేందర్‌రెడ్డి అడిగినట్లు తెలిసింది. స్థానిక అభ్యర్థిని బరిలోకి దించితే టీఆర్‌ఎస్‌కు గట్టి పోటీ ఇచ్చేవాళ్లమని కొందరు కాంగ్రెస్‌ నేతలు అంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement