పిఠాపురం బహిరంగ సభలో మాట్లాడుతున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్
పిఠాపురం/సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నాన్ని జనసేన నేతలే చేశారంటూ టీడీపీ ఆరోపణలు చేయడం సిగ్గుచేటని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం ఉప్పాడ సెంటర్లో మంగళవారం రాత్రి నిర్వహించిన బహిరంగ సభలో టీడీపీ నేతల అవినీతిపై తీవ్రంగా మండిపడ్డారు. వైఎస్ జగన్‌పై కత్తి దాడి చేసిన దోషి ఎవరో పిఠాపురం శ్రీపాద వల్లభుడికే తెలియాలన్నారు. ఎమ్మెల్యే చింతమనేని తహసీల్దారు వనజాక్షిని హింసిస్తే ఇక్కడ గొల్లప్రోలులో ఒక మహిళా ఉద్యోగిని ఇబ్బంది పెట్టారని, అధికారాన్ని అడ్డుపెట్టుకుని మహిళలను హింసిస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు.
అభివృద్ధి చేస్తారని ఓట్లు వేస్తే పేకాట క్లబ్‌లు నిర్వహిస్తారా అంటూ స్థానిక ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్ వర్మను విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదు కానీ, సర్పంచిగా కూడా గెలవని లోకేశ్‌కు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఉద్యోగం వచ్చిందని ఎద్దేవా చేశారు. మత్స్యకారుల కోసం హార్బర్ నిర్మాణానికి కృషి చేస్తానన్నారు. విలువలున్న నాయకులు మాజీ ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, వైఎస్సార్ అని, ఇప్పుడున్న నేతలు అవినీతి అలవాటుపడ్డారన్నారు. రానున్న రోజుల్లో టీడీపీకి ఓట్లు రావు, సీట్లు రావంటూ జోస్యం చెప్పారు. పిఠాపురం ప్రత్యేకత శ్రీపాద శ్రీవల్లభుడేనని ఆయన ఆశీస్సులుంటే ఇక్కడి నుంచే పోటీ చేస్తానేమోనని అన్నారు. సభకు ముందు కొత్తపల్లి మండలం ఉప్పాడలో మత్స్యకారులతో మాట్లాడారు.
మీడియాలో ఏం రావాలో బాబే చెప్తారు
తెలుగు టీవీ చానళ్లలో అత్యధిక భాగం ముఖ్యమంత్రి చంద్రబాబు గుప్పెట్లో ఉన్నాయని.. వాటిలో ఏ కథనాలు ప్రసారం చేయాలన్నది ఆయనే నియంత్రిస్తున్నారని జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ విమర్శించారు. మంగళవారం ట్విట్టర్‌లో స్పందిస్తూ.. తిత్లీ తుపాను సహాయం కోరుతూ తాను గత నెల 26వ తేదీన లేఖ రాసినట్టు పేర్కొంటూ, ఆ లేఖ ప్రతులను పోస్టు చేశారు. ‘‘రాష్ట్రంలో అతి పెద్ద సమస్య ఏమిటంటే.. ఎలక్ట్రానిక్ మీడియాలో అత్యధిక భాగం చానల్స్ మీవై ఉండడమే. దీంతో జనసేన పార్టీకి సంబంధించిన వార్తలు ప్రసారం చేయాలా.. వద్దా అన్నది కూడా మీరు నియంత్రిస్తున్నారు. దీంతో సహజంగానే మేం చేసిన కార్యక్రమాలు మీకు తెలియకపోవడంతో ప్రజల మధ్య మమ్మల్ని దూషిస్తున్నారు. మీరు తిత్లీ తుపాను సహయం కోరుతూ పవన్ కేంద్రానికి ఒక్కసారి కూడా లేఖ రాయలేదని విమర్శించారు. జనసేన పార్టీ రాసిన లేఖ ఇదిగో’’ అంటూ ట్విట్టర్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment