అభిమానులు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతున్న పవన్ కల్యాణ్
సాగర్‌నగర్ (విశాఖ తూర్పు): అమెరికాలో ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంస్థ ప్రధాన కార్యాలయం ఐదెకరాల్లో ఉంటే.. సీఎం చంద్రబాబు ఎంతో ఉదారంగా ఆ కంపెనీ బ్రాంచ్ ఆఫీసుకు విశాఖలో 25 ఎకరాలు కేటాయించారని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఎద్దేవా చేశారు. పోరాట యాత్రలో భాగంగా శుక్రవారం ఆయన విశాఖలోని ఐటీ సెజ్‌లను సందర్శించారు. ఐటీ హిల్‌లోని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, ఇన్నోవా సొల్యూషన్ కంపెనీల్లో కలియతిరిగారు. పవన్ మాట్లాడుతూ.. ఐటీ సెక్టార్‌లో లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని ప్రభుత్వం గొప్పలు చెప్పి.. కనీసం రెండు, మూడు వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని విమర్శించారు. ఐటీ సెజ్‌ల పేరుతో విశాఖ అభివృద్ధి ఒక వర్గానికే పరిమితమైందని విమర్శించారు.
పాలకుల నిర్లక్ష్యంతోనే ప్రాంతీయ ఉద్యమాలు
తెలంగాణ ప్రజలు ఆంధ్ర ప్రజలతో సర్దుకుపోదాం అనుకున్నప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నిధులు, నియామకాల్లో పక్షపాతం చూపడం, నీళ్ల పంపిణీలో అన్యాయం జరిగిందని పవన్ ఆరోపించారు. దీని వల్లే తెలంగాణ ఉద్యమం వచ్చిందనే విషయం మర్చిపోకూడదన్నారు. పాలకుల స్వార్థం, స్వప్రయోజనాలు చూసుకొని పాలన చేస్తే ఇలాంటి ఉద్యమాలే వస్తాయన్నారు. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, ఇన్నోవా సొల్యూషన్ కంపెనీలకు రూ.450 కోట్ల విలువైన 40 ఎకరాలను ఎకరా రూ. 25 లక్షలకు కట్టబెట్టిన ప్రభుత్వం.. ఉత్తరాంధ్ర పారిశ్రామికవేత్తలు కంపెనీలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నామంటూ భూములు అడిగితే రెండు మూడు కోట్ల రూపాయలు చెప్పడం ఏంటని నిలదీశారు.
పాలకుల నిర్లక్ష్యం వల్ల కేప్‌టౌన్‌ను తలపించే విశాఖలో కాలుష్యం బారిన పడి 4 నుంచి 5 లక్షల మంది దీర్ఘకాలిక అనారోగ్యాలకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక సమస్యలు పరిష్కారం కాకపోతే వేర్పాటువాద ఉద్యమానికి బీజం పడుతుందని హెచ్చరించారు. అనంతరం పవన్ విశాఖ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (విమ్స్)ను సందర్శించారు. అక్కడ అందుతున్న సేవల గురించి డైరెక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. కాగా, మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య పవన్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు.
Comments
Please login to add a commentAdd a comment