సాక్షి, విశాఖపట్నం: వచ్చే ఎన్నికల్లో మళ్లీ టీడీపీకి పట్టం కడితే.. అవినీతి ఆనకొండలై భూములన్నీ మింగేస్తారని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్, మంత్రులు, ఆ పార్టీ నేతల భూదోపిడీపై పోరాటం చేస్తానని ప్రకటించారు. శనివారం సాయంత్రం విశాఖ సాగరతీరంలో ఆర్కే బీచ్ నుంచి వైఎంసీఏ వరకు జనసేన పార్టీ కార్యకర్తలు, నేతలు నిరసన కవాతు నిర్వహించారు. అనంతరం వారినుద్దేశించి పవన్ సుదీర్ఘంగా, ఉద్వేగంగా ప్రసంగించారు. 2014 ఎన్నికల్లో తన వల్లే టీడీపీ అధికారంలోకి వచ్చిందని.. ప్రమాణ స్వీకారం చేశాక తాను వారికి గుర్తుకు రాలేదని పేర్కొన్నారు.
‘వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వస్తే భూములు కబ్జా చేస్తారని దుష్ప్రచారం చేశారు.. కానీ చంద్రబాబు సీఎం అయ్యాక భూకబ్జాలు, దోపిడీకి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ఒక్క విశాఖలోనే ఎకరం కోటి రూపాయలు విలువ చేసే లక్ష ఎకరాల భూములను దోచుకున్నారు. నాకు మా అన్నయ్య (చిరంజీవి) గురువు, దైవం. ఆయన్ని కాదని 2014లో టీడీపీకి సపోర్టు చేశాను. కానీ ఇప్పుడు ఆ పార్టీ దోపిడీకి పాల్పడుతోంది. ఇటీవల నా కారు యాక్సిడెంట్ చేసి చంపేస్తామని, బాంబులు పెట్టి పేల్చేస్తామని బెదిరింపులు వస్తున్నాయి. నాకు ప్రాణం మీద, డబ్బుమీద తీపిలేదు. దుర్మార్గులపై తిరగబడతాను. గంగమ్మతల్లి సాక్షిగా చెబుతున్నాను’ అని ప్రకటించారు. అభివృద్ధి, అవినీతి, భూకబ్జాలపై అఖిలపక్షం, మేధావులతో కలిసి కూర్చుని చర్చించడానికి సిద్ధమా? అని సీఎంకు సవాల్ విసిరారు.
జగన్ అంటే బాబుకు భయం..
‘చంద్రబాబుకు ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి అంటే భయం. ఆ విషయం నాతోనే స్వయంగా చెప్పారు.జగన్ అధికారంలోకి వస్తే తానేమైపోతానోనని భయంగా ఉందన్నారు. 2014 ఎన్నికల తర్వాత ఇంటికి భోజనానికి పిలిచి ఒకవేళ తాను ఓడిపోతే అండగా ఉండాలని కోరారు’ అని పవన్ వివరించారు.
నాడు బాక్సైట్‌కు వ్యతిరేకం.. నేడు ప్రోత్సాహం
చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకమని ప్రకటించి, అధికారంలోకి వచ్చాక తవ్వకాలను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై లోకేష్ ఢిల్లీ వెళ్లి సైకిల్ తొక్కి నిరసన తెలపాలని సూచించారు.
మా నలుగురితో రైల్వే జోన్ వస్తుంది..
విశాఖకు రైల్వే జోన్ కోసం ఉద్యమాలు అక్కర్లేదని పవన్‌కల్యాణ్ అన్నారు. సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, తాను కలిసి రైళ్లకు ఎదురెళ్లి రైల్‌రోకో చేస్తే తప్పకుండా రైల్వే జోన్ వస్తుందన్నారు. టీడీపీ ఎంపీలు రైల్వేజోన్‌పై జోనూలేదు.. గీనూ లేదంటూ వెటకారం చేసి.. ఆ తర్వాత దీక్షలకు దిగారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు దొంగ దీక్షలకయ్యే ఖర్చుతో ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయవచ్చన్నారు.
మరోసారి ఓటేస్తే
‘వచ్చే ఎన్నికల్లో మళ్లీ టీడీపీకి ఓటేస్తే మన తల్లులు, అక్కలను కూడా దూషిస్తారన్నారు. సీఎం, లోకేష్ అండతో మంత్రి గంటా విశాఖలో వందల ఎకరాల భూకబ్జాలకు పాల్పడ్డారని ఆరోపించారు. తనకు ప్రధాని మోదీ అంటే గౌరవం ఉన్నా భయం మాత్రం లేదన్నారు.
బాబు దోపిడీపై పోరాటం: పవన్
Published Sun, Jul 8 2018 3:17 AM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment