గవర్నర్‌ను కలసిన పవన్ కల్యాణ్, మనోహర్
సాక్షి, అమరావతి: తిత్లీ తుపాను విధ్వంసం దృష్ట్యా సిక్కోలులో ఉన్న పరిస్థితులను ప్రత్యేక దృష్టితో చూడాలని జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ మంగళవారం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆ ప్రాంత ప్రజలకు అందాల్సిన సహాయం, అందుకు సంబంధించిన ప్రతిపాదనలు, డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఆయన అందజేశారు. తుపాను కలిగించిన నష్టం నుంచి శ్రీకాకుళం జిల్లా కోలుకోవాలంటే 15 ఏళ్లకు పైనే పడుతుందని ఆయన తెలిపారు. కిడ్నీ బాధితులు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంత వాసులను ఆదుకోవాలని కోరారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులను వీడియో ద్వారా పవన్ గవర్నర్‌కు చూపించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రైతులకు వంద శాతం రుణ మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఉద్దానం ప్రాంతంలో నష్టం కలిగినా ఆ విషయాన్ని బయట ప్రపంచానికి తెలియజేయడం లేదన్నారు. తిత్లీ తుపాను విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. అక్కడ 10 రోజులుగా విద్యుత్ సరఫరా లేక ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటుంటే ప్రభుత్వం దీన్ని ప్రచారంగా వాడుకుంటోందని పవన్‌కల్యాణ్ విమర్శించారు. వారి బాధలు బయట ప్రపంచానికి తెలియకపోవడంవల్లే బాధితులు స్థానిక ప్రజా ప్రతినిధులను గ్రామాల్లో తిరగనివ్వడంలేదని చెప్పారు. ఈ విషయాలన్నీ కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని గవర్నర్‌ను కోరినట్లు ఆయన తెలిపారు. గవర్నర్‌ను కలిసిన వారిలో పార్టీ నేతలు నాదెండ్ల మనోహర్, మాదాసు గంగాధరం, తోట చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు.
పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలి
కాగా, హైకోర్టు ఆదేశాలను గౌరవించి పంచాయితీ ఎన్నికలను 3 నెలల్లో నిర్వహించాలని పవన్‌కల్యాణ్ డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల అధికారాలను నిలబెట్టేలా హైకోర్టు ఆదేశాలు జారీచేయడం హర్షణీయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి పంచాయతీ ఎన్నికల్లో నిలబడే ధైర్యంలేకే జీఓ నెంబర్ 90ను తీసుకొచ్చి ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేస్తోందని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment