సాక్షి, హైదరాబాద్ : వరుస వివాదాస్పద ట్వీట్లతో విమర్శలు ఎదుర్కొంటున్న సినీ నటుడు, జనసేన నేత నాగబాబు తీరుపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. జనసేన నాయకుల వ్యక్తిగత అభిప్రాయాలతో తమ పార్టీకి ఎటువంటి సంబంధంలేదని పవన్ స్పష్టం చేశారు. గత మూడురోజులుగా నాగబాబు చేస్తున్న వివాదాస్పద పోస్టులు కూడా ఆయన వ్యక్తిగతమైనవని, వీటితో జనసేన పార్టీకి సంబంధంలేదని అన్నారు. కరోనా కష్ట కాలంలో ప్రజాసేవ ద్వారా ఎటువంటి అంశాల జోలికి వెళ్లవద్దని పార్టీ కార్యకర్తలకు ఆయన సూచించారు. ఈ మేరకు శనివారం పవన్ కల్యాణ్ ఓ లేఖను విడుదల చేశారు. (గాడ్సే నిజమైన దేశ భక్తుడు: నాగబాబు)
పవన్ కల్యాణ్ లేఖలో స్పందిస్తూ.. ‘జనసేన పార్టీలో లక్షలాదిగా వున్న కార్యకర్తలు, జన సైనికులు, అభిమానులు సామాజిక మాధ్యమాల్లో వ్యక్తం చేసే అభిప్రాయాలు వారి వ్యక్తిగత అభిప్రాయాలే గానీ.. పార్టీకి ఎటువంటి సంబంధంలేదని స్పష్టం చేస్తున్నా. గతంలో కూడా మీడియా ద్వారా ఇదే విషయాన్ని చెప్పాను. ఈ మధ్య కాలంలో కొన్ని సున్నితమైన అంశాలపై పార్టీకి చెందిన కొందరు వ్యక్తం చేస్తున్న భావాలను పార్టీ అభిప్రాయాలుగా ప్రత్యర్థులు వక్రీకరిస్తున్నారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు నాగబాబు సోషల్ మీడియాలో వ్యక్తపరుస్తున్న అభిప్రాయాలు పూర్తిగా ఆయన వ్యక్తిగతమైనవి. పార్టీకి ఎటువంటి సంబంధంలేదు. పార్టీ అభిప్రాయాలను, నిర్ణయాలను పార్టీ అధికారిక పత్రం ద్వారా మాత్రమే వెల్లడిస్తాం. కరోనాతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఈ తరుణంలో మనం ప్రజాసేవ తప్పమరే ఇతర అంశాల జోలికి వెళ్లవద్దని పార్టీ కార్యకర్తలను కోరుతున్నాను. ఎవరూ కూడా క్రమశిక్షను అతిక్రమించవద్ద’ అని లేఖలో పేర్కొన్నారు. (నాగబాబుపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు)
కాగా మహాత్మా గాంధీని హత్య చేసిన నాథూరం గాడ్సే దేశ భక్తుడంటూ నాగబాబు చేసిన ట్వీట్ వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఇది మరువక ముందే శనివారం ఆయన మరో పోస్ట్ చేశారు. ‘భారత కరెన్సీ నోట్ల మీద సుభాష్ చంద్రబోస్, అంబేద్కర్, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, లాల్ బహదూర్, పీవీ నరసింహారావు, అబ్దుల్ కలాం, సావర్కార్, వాజ్‌పేయి లాంటి మహానుభావుల చిత్రాలను కూడా చూడాలని ఉందంటూ కొత్త వివాదానికి తెరలేపారు. వివాదాస్పద ట్వీట్లతో సోషల్ మీడియా వేదికగా అనేక విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో నాగబాబు పోస్టులతో జనసేనకు సంబంధంలేదని పవన్ కల్యాణ్ వివరణ ఇచ్చారు. (కరెన్సీ నోట్లపై వారి ఫోటోలు కూడా)
Comments
Please login to add a commentAdd a comment