
ఆచంట/పెనుమంట్ర: బీసీలకు, మహిళలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని, ఈ మేరకు మేనిఫెస్టోలో పెడతామని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ప్రకటించారు. ప్రజా పోరాటయాత్రలో భాగంగా శనివారం పశ్చిమగోదావరి జిల్లా మార్టేరు నాలుగు రోడ్ల కూడలిలో ఆయన ప్రసంగించారు. జగన్, చంద్రబాబు కులాల మధ్య గొడవలు పెట్టి విచ్ఛిన్నం చేస్తున్నారన్నారు. నేను కాపు కులస్థుడిని కాబట్టి.. కాపు రిజర్వేషన్ల గురించి మాట్లాడకుండా తప్పించుకోలేనని తెలిపారు. చంద్రబాబు అయినా జగన్ అయినా ఓట్ల కోసమే తప్ప రిజర్వేషన్లు అమలు చేయాలన్న చిత్తశుద్ధి వారికి లేదని అన్నారు.
చంద్రబాబు చిత్తశుద్ధి లేకుండా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిన కాపు రిజర్వేషన్ బిల్లు చెత్తబుట్టలోకి చేరిందన్నారు. కాపులను 9వ షెడ్యూల్‌లో చేర్చి రిజర్వేషన్లు కల్పించడానికి పోరాటం చేస్తామన్నారు. అగ్రవర్ణాల్లోని పేదలకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. చంద్రబాబు తనపై కులం ముద్ర వేయడానికి ప్రత్నిస్తున్నారని, అన్ని కులాలు అదరించకపోతే ఇంత పెద్ద నటుడిని అయ్యేవాడినా అంటూ ప్రశ్నించారు. ముస్లిం సోదరులు కోరుకున్నట్లు సచార్ కమిటీ నివేదికను జనసేన అమలు చేస్తుందన్నారు. ఎస్సీ వర్గీకరణ చేస్తానని చంద్రబాబు మాల,మాదిగల మధ్య తగవు పెట్టారన్నారు.
ఒక్కో ఓటు మూడు నాలుగు వేలకు, ఒక్కో సీటు రూ.25 కోట్లకు కొనేస్తారని, ఈ సొమ్మంతా ఆయన హెరిటేజ్ కంపెనీల నుంచి సంపాదించినదేనా అని ప్రశ్నించారు. చంద్రబాబు మాట్లాడితే రియల్ టైమ్ గవర్నెన్స్ అంటారని..కానీ ఇసుక దోపిడీలు, భూ కబ్జాలు జరుగుతుంటే తెలిసి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబుకు, లోకేష్‌కు తెలిసే ఇవ్వన్నీ జరుగుతున్నాయని ఆరోపించారు. వైఎస్సార్ సీపీ గెలవాల్సిన ఎన్నికల్లో టీడీపీ ఎలా గెలిచిందో ఒకసారి మంత్రులు, ఎమ్మెల్యేలు సీఎంని అడిగి తెలుసుకోవాలన్నారు. లోకేష్‌కు ఉద్యోగం కల్పిస్తే రాష్ట్రంలోని యువత మొత్తానికీ ఉద్యోగాలు కల్పించినట్లు కాదని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment