
పాడేరు: తాను వద్దనుకుని వదిలేసిన.. రాజ్యసభ ఎంపీ పదవిని పొందిన టీజీ వెంకటేష్ అడ్డగోలుగా మాట్లాడితే సహించేది లేదని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ హెచ్చరించారు. విశాఖ జిల్లా పాడేరులో బుధవారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. జనసేన గురించి అదుపుతప్పి పనికిమాలిన మాటలు చెబితే ఊరుకోబోమన్నారు. పద్ధతి మార్చుకోవాలని.. లేకుంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని టీజీ వెంకటేష్‌ను హెచ్చరించారు. తన ఫ్యాక్టరీల నుంచి విడుదల అవుతున్న పారిశ్రామిక వ్యర్థాలను అడ్డగోలుగా నదుల్లోకి వదిలి పరిసరాలను, భూగర్భజలాలను కలుషితం చేస్తున్నాడని పవన్ ధ్వజమెత్తారు.
టీడీపీ ప్రభుత్వానికి దోచుకోవడంలోనే చిత్తశుద్ధి ఉందని, ప్రజల సంక్షేమాన్ని, అభివృద్ధిని విస్మరించి అడ్డగోలుగా అవినీతికి పాల్పడుతున్నారని పవన్‌కల్యాణ్ ధ్వజమెత్తారు. ప్రజలకేదో మంచి చేస్తారనుకుని తాను టీడీపీ పార్టీకి గత ఎన్నికల్లో మద్దతు ఇస్తే.. ప్రజల కోసం పనిచేయాలనే చిత్తశుద్ధి వారిలో లేకుండా పోయిందని దుయ్యబట్టారు. చంద్రబాబు తన పాత పద్ధతిని ఇంకా మార్చుకోలేదన్నారు. మన్యంలో కొండల్ని తొలిచేద్దాం బాక్సైట్‌ను దోచేద్దామనే ప్రభుత్వ పెద్దలు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
మన్యం ఖనిజ సంపదను కొల్లగొట్టకుండా అడ్డుకోవడానికి జనసేన పోరాడుతుందన్నారు. ఖనిజాల జోలికొస్తే తాటతీస్తామని పవన్ హెచ్చరించారు. ఖనిజాల జోలికి పోకుండా ఉంటే ఇటీవల అధికారపార్టీ నేతల ప్రాణాలు కూడా పోయేవి కాదని.. దీనికి చంద్రబాబే బాధ్యత వహించాలన్నారు. నాదెండ్ల మనోహర్, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment