
పవన్ కళ్యాణ్ కాలికి ఎలాస్టిక్ కేప్ బ్యాండేజ్ వేస్తున్న డాక్టర్ యిర్రింకి నరేష్
పశ్చిమగోదావరి, భీమవరం: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వివిధ వర్గాల ప్రజలతో మమేకమవుతూ మంగళవారం బిజీగా గడిపారు. భీమవరం శివారు పెద అమిరంలోని నిర్మలాదేవి ఫంక్షన్ హాలులో బస చేసిన పవన్ రోజంతా సమీక్షలు, నాయకులను కలవడానికే పరిమితమయ్యారు. పవన్‌ను చూడడానికి పెద్ద ఎత్తున అభిమానులు జిల్లా నలుమూలల నుంచి తరలి వచ్చిన ఫంక్షన్ హాలులోకి ఎవరిని అనుమతించకుండా ఆయనే బయటకు వచ్చి కొద్దిసేపు మాట్లాడి లోపలకి వెళ్లిపోయారు. మధ్యాహ్నం సమయంలో డాక్టర్స్‌తోను, కొంతమంది మహిళలు, ఆక్వా రంగ నిపుణులతో సమావేశమైన పవన్ జిల్లాలోని ప్రధాన సమస్యలు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్లు సమాచారం.
ఐఎంఏ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ సుంకర మహేష్, డాక్టర్ మాదిరెడ్డి స్వరాజ్యలక్ష్మి తదితరులు వైద్యుల సమస్యలతో పాటు పట్టణంలోని డంపింగ్‌యార్డు, డ్రెయిన్లు వంటి సమస్యలను పవన్ దృష్టికి తీసుకువెళ్లారు. అలాగే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ యర్రా నారాయణస్వామిని ఏఎస్‌ఆర్ నగర్‌లోని ఆయన నివాసంలో కలిసి ఏకాంతంగా వివిధ అంశాలపై చర్చించారు. నారాయణస్వామి కుమారుడు, కాపుకార్పొరేషన్ మాజీ డైరెక్టర్ యర్రా నవీన్ తెలుగుదేశంపార్టీకి రాజీనామాచేసి జనసేన పార్టీలో చేరుతున్న తరుణంలో నారాయణస్వామితో భేటీ ప్రత్యేకతను సంతరించుకుంది. అయితే బుధవారం కూడా కేవలం ఫంక్షన్ హాలుకే పరిమితమై వివిధ వర్గాలతో మాట్లాడతారని ఆయన అనుచరులు చెబుతున్నారు. పవన్ చేపట్టే కార్యకలాపాలు ఇంతవరకు ఖరారు కాలేదని చెబుతున్నారు.
మడమనొప్పితో బాధపడుతున్న పవన్
నిర్మలాదేవి ఫంక్షన్‌హాలులో బసచేసిన పవన్‌కల్యాణ్ ఎక్కువ సమయం అందులోనే గడుపుతున్నారు. ఆయన అభిమానులను కలవడానికి బయటకు వచ్చిన సమయంలో హాలు ఆవరణలోని డ్రెయిన్‌లో కాలు వేయడంతో కుడి కాలు బెణికి మడమనొప్పితో బాధపడుతున్నట్లు చెబుతున్నారు. నొప్పి ఎక్కువ కావడంతో నడవలేకపోతున్నారని డాక్టర్స్‌తో సమావేశమైన సమయంలో పట్టణ డాక్టర్ యిర్రింకి నరేష్ పవన్ కాలును పరీక్షించి జాగ్రత్తలు చెప్పి ఎలస్టిక్ కేప్ బ్యాండేజ్ వేసినట్లు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment