
సాక్షి, తిరుపతి : ఎన్నికలలో ఇచ్చిన హామీల్లో ఎనభై శాతం పూర్తి చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిది అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. ఇచ్చిన మాట తప్పకుండా హామీలను అమలు చేస్తున్న ప్రభుత్వం తమదని పేర్కొన్నారు. ఉగాది రోజు 25 లక్షల ఇళ్ళ పట్టాలను అందిస్తామని వెల్లడించారు. బుధవారమిక్కడ ఆయన మాట్లాడుతూ... మూడు రాజధానుల ఆలోచన మంచిదని.. అమరావతిలో రియల్ ఎస్టేటు వ్యాపారం చేసేవాళ్లే దీనిని వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు. రాజధాని అంశంపై కమిటీలు అందించిన నివేదిక గురించి అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.
హైదరాబాదునే అభివృద్ధి చేశారు..
‘రాయలసీమ నుంచి వచ్చిన ముఖ్యమంత్రులు అందరూ హైదరాబాదునే అభివృద్ధి చేశారు. నిజానికి రాజధానితో పదిశాతం ప్రజలకు మాత్రమే పని ఉంటుంది. కోర్టులతో కూడా పదిశాతం ప్రజలకు మాత్రమే పని. మూడు రాజధానుల ఆలోచన ఎంతో మంచిది. రాయలసీమ వాసులంతా ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలపాలి. రాజధాని అంశంలో ఇకనైనా కార్మికుల పోరాటాలు, ధర్నాలు పక్కన పెట్టాలి’అని మంత్రి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment