సాక్షి, మచిలీపట్నం: బీసీలు టీడీపీకి పట్టుగొమ్మ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు వారికి చేసిందేమీ లేదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పెరిగిన జనాభాకు అనుగుణంగా స్థానిక సంస్థల్లో బీసీలకు తగిన న్యాయం చేయాలన్న ఆలోచనతో 59.85 శాతం రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జీవో తీసుకొచ్చారన్నారు. ఈ తరుణంలో తన మనుషులతో హైకోర్టులో పిటిషన్ వేయించి చంద్రబాబు మోకాలొడ్డారని ధ్వజమెత్తారు. సోమవారం పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ అధ్యక్షతన జరిగిన మల్లేశ్వరం మార్కెట్ కమిటీ పాలక వర్గం ప్రమాణ స్వీకారోత్సవ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన చంద్రబాబు ద్వంద్వ నీతిపై మండిపడ్డారు. నామినేటెడ్ పదవులు, పనుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించడమే కాకుండా, మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం తీసుకొచ్చిన ఘనత వైఎస్ జగన్‌దే అన్నారు.
చంద్రబాబుకు గుణపాఠం నేర్పాలి: బాబు నిర్వాకం వల్ల రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని సోమవారం హైకోర్టు తీర్పు నివ్వడంతో ఆ మేరకు బీసీల రిజర్వేషన్లు తగ్గించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఈ నెలలోనే 50 శాతం రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళతామని చెప్పారు. వరుసగా నెల రోజుల్లో çపరిషత్, పంచాయతీ, మున్సిపాల్టీ, కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. బీసీలకు అన్యాయం చేసిన చంద్రబాబుకు ఈ ఎన్నికల్లోనూ గుణపాఠం నేర్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ మార్కెట్ కమిటీలు గత పభుత్వ హయాంలో ఉత్సవ విగ్రహాలుగా ఉండేవన్నారు.
Comments
Please login to add a commentAdd a comment