దినకరన్ మద్దతుదారులను అరెస్టు చేస్తున్న పోలీసులు
టీ.నగర్: ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించేందుకు వచ్చిన టీటీవీ దినకరన్‌కు ప్రజలు తీవ్ర వ్యతిరేకత తెలిపారు. ఆ సమయంలో అతని మద్దతుదారులకు దేహశుద్ధి జరిగింది. చెన్నై తండయార్‌పేట–ఎన్నూరు హైరోడ్డులో ఉన్న ప్రైవేటు పాఠశాల నుంచి గత 23వ తేదీ మహారాష్ట్ర రాష్ట్రం పుణెకు విహార యాత్రగా వెళ్లిన విద్యార్థులు ముగ్గురు మృతిచెందిన విషయం తెలిసిందే. మృతిచెందిన విద్యార్థులు ఆర్కేనగర్ నియోజకవర్గానికి చెందినందున ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే టీటీవీ దినకరన్ మంగళవారం ఉదయం అక్కడికి వెళ్లారు.
ఇందిరానగర్‌కు చెందిన విద్యార్థి రజాక్, నేతాజి నగర్‌కు చెందిన శరవణకుమార్, నావలర్ ప్రాంతానికి చెందిన సంతోష్ కుటుంబాలకు తలా లక్ష రూపాయలను అందజేశారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజలతో దినకరన్ మాట్లాడారు. ఇలావుండగా టీటీవీ దినకరన్ వస్తున్నట్లు తెలియగానే ఎన్నికల్లో గెలిస్తే నగదు అందిస్తానని తెలిపి అందజేసిన 20 రూపాయల నోట్లను చేతిలో ఉంచుకుని ప్రజలు నిరసన తెలిపారు. అక్కడ భద్రతకు ఉన్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఆ సమయంలో టీటీవీ అనుచరులు అసభ్యంగా మాట్లాడడంతో ప్రజలు వారికి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులు టీటీవీ అనుచరులను అరెస్టు చేసి వ్యానులో తీసుకెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment