కమీషన్ల యావ తప్ప జన ఘోష పట్టలేదు | People says their problems with YS Jagan | Sakshi
Sakshi News home page

కమీషన్ల యావ తప్ప జన ఘోష పట్టలేదు

Published Tue, Aug 28 2018 3:27 AM | Last Updated on Tue, Aug 28 2018 7:22 AM

People says their problems with YS Jagan - Sakshi

చీమలపల్లి సమీపంలో భారీ జనసందోహం మధ్య వైఎస్‌ జగన్‌ పాదయాత్ర

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘నాలుగున్నరేళ్ల చంద్రబాబు పాలన మాకన్నీ కష్టాలే మిగిల్చింది. కమీషన్ల కక్కుర్తి తప్ప బడుగు, బలహీన వర్గాల సమస్యలేవీ ఆయన పట్టించుకోవడం లేదు. రోడ్లు లేవు.. పింఛన్లు ఇవ్వరు.. ఆరోగ్యశ్రీ అమలు చేయరు.. మైనారిటీలను చిన్నచూపు చూస్తున్నారు. సెజ్, ఎన్‌ఏఓబీ నిర్వాసితులను పట్టించుకోవడం లేదు. మీరు అధికారంలోకి రాగానే మా సమస్యలు పరిష్కరించాలయ్యా..’ అంటూ వివిధ వర్గాల ప్రజలు ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌తో మొరపెట్టుకున్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 247వ రోజు సోమవారం వైఎస్‌ జగన్‌.. విశాఖపట్నం జిల్లా యలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం మండలంలో పాదయాత్ర కొనసాగించారు. అడుగు ముందుకు పడనీయని అభిమానం, అక్కచెల్లెమ్మల ఆత్మీయత, అనురాగాల మధ్య రామన్నపాలెం నుంచి ప్రారంభమైన యాత్ర అప్పన్నపాలెం, మదుటూరు జంక్షన్, సాని కాలువ, చీమలాపల్లి, బంగారుపాలెం క్రాస్, కొండకర్ల మీదుగా కొండకర్ల జంక్షన్‌ వరకు సాగింది. దారిపొడవునా వేలాది మంది ఎంతగా ఘన స్వాగతం పలికారో అంతగా తమ సమస్యలనూ విన్నవించారు. జగన్‌ను కలిసిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్యను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. తమరు అధికారంలోకి రాగానే వాటికో పరిష్కారం చూపాలంటూ వేడుకున్నారు. 
 
ఎన్‌ఏఓబీ నిర్వాసితులకిచ్చిన హామీలన్నీ గాలికే 
నేవల్‌ ఆల్టర్నేటివ్‌ ఆపరేషనల్‌ బేస్‌ (ఎన్‌ఏఓబీ) నిర్వాసితులు తాము పడుతున్న ఇక్కట్లను జగన్‌ దృష్టికి తీసుకువచ్చారు. 2011 సెప్టెంబర్‌ 3న అప్పటి జిల్లా కలెక్టర్‌ తమ 13 డిమాండ్లను పరిష్కరిస్తామని రాత పూర్వకంగా హామీ ఇచ్చినా ఇంతవరకు ఏ ఒక్కటీ పరిష్కరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్‌ఏఓబీ కోసం తీసుకున్న భూములకు ఇచ్చే పరిహారంలోనూ తేడా చూపుతున్నట్టు చెప్పారు. ‘ఈ ప్రాజెక్టు వల్ల ప్రత్యక్ష, పరోక్ష నిర్వాసితులకు ఆనాడు ఇచ్చిన హామీ ప్రకారం కేంద్రీయ విద్యాలయం లేదా గురుకుల ఆశ్రమ పాఠశాల, కేంద్రీయ ఆరోగ్య కేంద్రం నిర్మించాలి. మత్య్యకార కుటుంబాలపై ఆధారపడిన ఇతర వర్గాల వారికి నష్టపరిహారం ఇవ్వాలి. ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. గుర్తింపు కార్డులు ఇవ్వాలి. జెట్టి నిర్మాణం చేయాలి. కాంట్రాక్ట్, కార్మిక సంఘం ఏర్పాటుకు అనుమతించాలి. వేతన నష్టపరిహారం చెల్లించాలి. ఈ ప్రాజెక్టు వల్ల నిర్వాసితులతో పాటు కుటుంబాల జాబితా తయారు చేసి న్యాయం చేయాలి. చేపలు అమ్ముకునే మహిళలకు ఆర్థిక సహాయం అందించాలి. సొసైటీ భూములకు నష్టపరిహారం ఇవ్వడంతో పాటు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి. పునరావాస ప్యాకేజీని ఆయా కుటుంబాల్లోని మేజర్‌ అయిన కుమార్తెలు, కుమారులకు కూడా వర్తింపజేయాలి. అయితే వీటిల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదు.

ఈ విషయాన్ని ఎన్నిసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదు’ అని నిర్వాసితుల సంఘం నాయకులు సీహెచ్‌ అప్పారావు, మేరిగి అప్పలరాజు తదితరులు జగన్‌ దృష్టికి తీసుకువచ్చారు. మరోపక్క కొత్త్తపట్నం, వాడనరసాపురం పరిధిలోని మత్స్యకారులు సుదీర్ఘకాలం నుంచి చేపల వేట సాగిస్తున్న ప్రాంతాలను ఎటువంటి గ్రామ సభలు నిర్వహించకుండా ఏకపక్షంగా ప్రభుత్వం తీసుకుంటోందని చెప్పారు. తమకు చెప్పకుండానే సముద్రంలో నాలుగు రాతి వంతెనలు, ఇనుప వంతెనలు నిర్మిస్తున్నారని, ఇవి పూర్తయితే మత్స్యకారులు చేపలు పట్టుకునేందుకు తీవ్ర అంతరాయం కలుగుతుందని వాపోయారు. ఎన్‌ఏఓబీ ప్రాజెక్టు నుంచి సుమారు 5 కిలోమీటర్ల పొడవునా కొత్తపట్నం, యాత కొత్తపట్నం గ్రామాల మీదుగా పైపు లైను సముద్రంలోనికి తీసుకువెళ్లి అక్కడ డ్రెడ్జింగ్‌ నిర్వహిస్తూ ఇసుకను బయటకు తీసుకువస్తున్నారని, దీనివల్ల మత్స్యసంపద అంతరించి పోయే ప్రమాదం ఉందని తెలిపారు. ఈ ప్రాజెక్టు వల్ల పరోక్షంగా ప్రభావితమయ్యే కుటుంబాలకు కూడా నౌకదళం వారు సహాయ పునరావాస ప్యాకేజీ ఇచ్చేలా చూడాలని జగన్‌ను కోరారు. వీరి సమస్య ఓపికగా విన్న జగన్‌.. మనందరి ప్రభుత్వం రాగానే పూర్తిగా పరిశీలించి బాధితులందరికీ న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.   
 
దిబ్బపాలెం పునరావాస కాలనీలో అక్రమాలు... 

అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్‌) నిర్వాసితుల కోసం దిబ్బపాలెం వద్ద ఏర్పాటు చేసిన పునరావాస కాలనీలో ఇళ్ల స్థలాలు, ప్యాకేజీల అమలులో అక్రమాలకు అంతే లేకుండా పోయిందని ఆ కాలనీ వాసులు కె.రమణ, ఎస్‌.బాబూరావు, ఎ.శ్రీనివాసరావులు జగన్‌కు ఫిర్యాదు చేశారు. ఇటీవల స్థానిక ఎమ్మెల్యే ప్రజాదర్బార్‌ నిర్వహించి.. అనర్హులను కూడా అర్హులుగా గుర్తించాలంటూ అధికారులపై ఒత్తిడి తెచ్చారని వివరించారు. ఇదే జరిగితే సుమారు 700 మంది అనర్హులు లబ్ధి పొందుతారని వాపోయారు. సెజ్‌ కోసం భూమిని సేకరించి ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకు న్యాయం జరగలేదని నిర్వాసితుల సంఘం ప్రతినిధులు  జగన్‌ ఎదుట వాపోయారు. సెజ్‌ పునరావాస కాలనీలో ఐటీఐ, పాలిటెక్నిక్‌ కేంద్రాలను ఏర్పాటు చేయాలని, నిర్వాసితులకు స్థానిక కంపెనీలలో ఉద్యోగాలు ఇప్పించేలా చూడాలని కోరారు. యలమంచిలి నియోజకవర్గంలో తమ పట్ల వివక్ష చూపుతున్నారని పలు క్రిస్టియన్‌ సంఘాలు జగన్‌ దృష్టికి తీసుకువచ్చాయి. శ్మశానాలు కూడా లేకుండా చేస్తున్నారని, ఎవరైనా చనిపోతే పూడ్చిపెట్టుకోవడానికి వీలు లేకుండా ఆంక్షలు పెడుతున్నారని ఆర్మీ ఆఫ్‌ ది లార్డ్‌ సంఘానికి చెందిన జాషువారాయ్, అచ్యుతాపురం పాస్టర్‌ సుధీర్‌ తదితరులు ఫిర్యాదు చేశారు. చర్చిలు కట్టుకోవడానికి ఇచ్చే మైనారిటీ ఫండ్‌ కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దపల్లిలో చర్చికి తాళాలు వేసి పాస్టర్లు రాకుండా చేస్తున్నారని వాపోయారు.  
 
నేను బతికున్నానంటే వైఎస్‌ చలువే.. 
వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ వల్లే తానీవేళ బతికున్నానని కొండకర్ల వద్ద అరుణ అనే యువతి జగన్‌ ఎదుట భావోద్వేగానికి లోనయ్యింది. తనకు చిన్నప్పటి నుంచి గుండె జబ్బు ఉండేదని, తన తల్లిదండ్రులు ఎక్కడెక్కడో చూపించి.. ఐదారు లక్షల రూపాయలు ఖర్చు పెట్టే స్థోమత లేక నిశ్చేష్టులై ఉన్న స్థితిలో ఆరోగ్య శ్రీతో బతికి బయటపడ్డానని వివరించింది. ఆ రోజుల్లో వైద్య శిబిరాలు నిర్వహించి రోగులకు పెద్దాస్పత్రుల్లో ఆపరేషన్లు చేయించే వారని 13 ఏళ్ల నాటి సంగతుల్ని గుర్తు చేసుకుంది. అసలు బతుకుతానని అనుకోలేదని, తనకు ఇప్పుడు ఇద్దరు పిల్లలని చెప్పింది. పిల్లల్ని బాగా చదివించాలని, ఆరోగ్య శ్రీకి పూర్వ వైభవం తీసుకువస్తానని జగన్‌ అన్నారు. జగన్‌ ముఖ్యమంత్రి అయితేనే మా ఆరోగ్యాలు బాగుంటాయని ఆరోగ్య శ్రీతో బతికి బట్టకట్టిన కె.అందులాపల్లి గ్రామానికి చెందిన గుబ్బల జ్యోతి అన్నారు. చేతిలో నయాపైసా లేక తనకు చికిత్స ఎలా చేయించాలో తెలియక సతమతం అవుతున్న తన తల్లిదండ్రులకు ఆనాడు వైఎస్‌ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ ఆశాదీపంగా కనిపించిందని, ఫలితంగానే నేనిప్పుడు జగన్‌ను కలిసి కృతజ్ఞతలు చెప్పగలిగానని సంబరపడ్డారు. పేదలకు మేలు జరగాలంటే జగన్‌ రావాలన్నారు. 
 
ఒక్కొక్కరిదీ ఒక్కో సమస్య 
పింఛన్‌ కోసం ఎన్నిమార్లు దరఖాస్తు చేసుకున్నా తమను పట్టించుకోవడం లేదని నాటక రంగ కళాకారుడు శ్రీనివాసరాజు, తమను చంద్రబాబు దారుణంగా మోసం చేశారని నిరుద్యోగులు వాపోయారు. దళిత వర్గాలకు చెందిన ఆడపిల్లల పెళ్లి కానుకను లక్ష రూపాయలకు పెంచాలని మహిళా నాయకురాలు కాశీ ముని కుమారి నాయకత్వంలో పలువురు మహిళలు వైఎస్‌ జగన్‌కు విన్నవించారు. జీవో నెంబర్‌ 550 ద్వారా నష్టపోయిన బీసీ, ఎస్సీ, ఎస్టీ వైద్య విద్యార్థులకు న్యాయం చేయాలని, రాష్ట్రంలోనే ద్వీతీయ మంచినీటి సరస్సుగా గుర్తింపు పొందిన కొండకర్ల ఆవకు పూర్వవైభవం తేవాలని, వలస వెళ్లిన తూర్పు కాపులకు ఇతర ప్రాంతాల్లోనూ బీసీ–డి కులధ్రువీకరణ పత్రాలు ఇప్పించాలని, దివ్యాంగుల కోసం నిర్వహిస్తున్న అనాధ ఆశ్రమానికి రహదారి సౌకర్యం కల్పించాలని, అనాధ పిల్లలకు ఎటువంటి ఆంక్షలు లేకుండా పింఛన్లు ఇవ్వాలని పలువురు జగన్‌ను కోరారు. 
 
విశాఖలో ఎగసిపడుతున్న జనకెరటం  
సాక్షి, విశాఖపట్నం : ఉత్తరాంధ్ర ముఖ ద్వారమైన విశాఖ జిల్లాలో ప్రజాసంకల్ప యాత్రకు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. జిల్లాలో అడుగుపెట్టింది మొదలు రోజురోజుకు జనాదరణ వెల్లువెత్తుతోంది. ప్రజా ప్రస్థానంలో మహానేత అడుగుపెట్టిన నాతవరం మండలం గన్నవరం మెట్ట వద్దే ఆయన తనయుడు, జననేత జగన్‌ అడుగు పెట్టినప్పుడు ప్రజలు ఆత్మీయ స్వాగతం పలికారు. నర్సీపట్నం, కోటఉరట్ల, యలమంచలిలో జరిగిన సభలకు జోరు వర్షంలోనూ జనం పోటీపడ్డారు. మరో వైపు టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీల నుంచి పెద్ద ఎత్తున వైఎస్సార్‌సీపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. దివంగత మాజీ ఎమ్మెల్యే గొట్టేటి దేవుడు కుమార్తె గొట్టేటి మాధవి యలమంచలిలో వైఎస్‌ జగన్‌ సమక్షంలో పార్టీలో చేరారు.

అప్పటి చింతపల్లి నియోజకవర్గం నుంచి సీపీఐ  ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన గొట్టేటి దేవుడుకు విశాఖ ఏజెన్సీలో మంచి పేరు ఉంది. నిజాయితీపరుడిగా, నిష్కలంక రాజకీయ నేతగా పేరొందిన ఆయన్ను అభిమానించే వేలాది మంది గిరిజనులు, సీపీఐ శ్రేణులతో కలిసి మాధవి పార్టీలో చేరడంతో స్థానికంగా వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో మరింత జోష్‌ వచ్చింది. అంతకు ముందు నర్సీపట్నం నియోజకవర్గంలో బీజేపీ జిల్లా నాయకుడు రుత్తల ఎర్రా పాత్రుడితో పాటు నర్సీపట్నం మండల జెడ్పీటీసీ మాజీ సభ్యుడు అధికార బలరామ్మూర్తి, గత ఎన్నికల్లో నర్సీపట్నం అసెంబ్లీ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన పెట్ల రామచంద్రరావు, మాకవరపాలెం మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రుత్తల జమిందారి తదితర నేతలు పార్టీలో చేరారు. డీసీసీ ఉపాధ్యక్షుడు పోలిశెట్టి పెదఈశ్వరరావు, డీసీసీ కార్యదర్శి అద్దేపల్లి నూకి నాయుడు తదితరులు దార్లపూడిలో వైఎస్సార్‌సీపీలో చేరారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన విడదల రజని వందలాది మంది అనుచరులతో రేగుపాలెం జంక్షన్‌లో పార్టీలో చేరారు.   
 
నేదురుమల్లి కుమారుడి చేరిక ఖరారు 
మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి తనయుడు రామ్‌కుమార్‌రెడ్డి వచ్చే నెల 8న విశాఖలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఆ రోజు తనతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నేదురుమల్లి అభిమానులు పార్టీలో చేరతారన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న అరాచకాలకు చరమగీతం పాడి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపే శక్తి వైఎస్‌ జగన్‌కు మాత్రమే ఉందని తాను బలంగా నమ్ముతున్నానని చెప్పారు. ఇందులో భాగంగా సోమవారం ఆయన కొండకర్ల జంక్షన్‌లో వైఎస్‌ జగన్‌ను కలిసి మాట్లాడారు. కాగా, పెందుర్తి, అనకాపల్లి నియోజకవర్గాల నేతలు పలువురు వైఎస్‌ జగన్‌ సమక్షంలో పార్టీలో చేరారు. సబ్బవరం మాజీ ఎంపీపీ సబ్బవరపు ముత్యాలనాయుడు, ఆర్‌ఈసీఎస్‌ మాజీ డైరెక్టర్‌ సబ్బవరపు నారాయణమూర్తి, తవ్వవానిపాలెం సర్పంచ్‌ బోకం అప్పలనాయుడు తదితరులతో పాటు 500 మంది నాయకులు, కార్యకర్తలు చేరారు. అనకాపల్లి నియోజకవర్గం మారేడుపూడి మాజీ సర్పంచ్‌ ఈగల నూకరత్నం, ఈగల కృష్ణమూర్తి, ఆర్‌ఎంపీ వైద్యుడు బి.అప్పలనాయుడు, అచ్యుతాపురం మాజీ ఎంపీపీ వి.నరసింగరావు, వెన్నెలపాలెం కమ్యునిటీ హెల్త్‌ అధికారి వెన్నెల నరసింహరావు, మరో 500 మంది వైఎస్సార్‌సీపీలో చేరారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement