సుందరయ్యనగర్‌లో జననేత జగన్ వెంట నడుస్తున్న ప్రజలు
ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా తమ ముంగిటకు వచ్చిన జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజలు ఘన స్వాగతం పలికారు. మహిళలు అడుగడుగునా పూల వర్షం కురిపిస్తూ, మంగళహారతులు పట్టారు. ముఖ్యమంత్రి కావాలంటూ దీవెనలందించారు. చిన్నా పెద్దా తేడా లేకుండా జననేతతో కరచాలనం చేసేందుకు పోటీపడ్డారు. అభిమాన నేతతో సెల్ఫీలు దిగి సంబరపడ్డారు. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలుకరిస్తూ, వారి సమస్యలను ఓపికగా ఆలకిస్తూ.. తాను అండగా ఉంటానని ధైర్యం చెబుతూ వైఎస్ జగన్ ముందుకు సాగారు.
సాక్షి, అమరావతి బ్యూరో: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 135వ రోజు మంగళగిరి నియోజకవర్గంలో కొనసాగింది. జననేతను చూసేందుకు గురువారం ఉదయం నుంచే ఆయన బస చేసిన శిబిరం వద్దకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. శిబిరం నుంచి వైఎస్ జగన్‌బయటకు రాగానే తమ అభిమాన నేతను చూసిన ఆనందంలో ప్రజలు నినాదాలతో హోరెత్తించారు. సీఎం.. సీఎం.. జై జగన్ అంటూ నినదించారు. జననేతతో కరచాలనం చేసేందుకు పోటీపడ్డారు. ఆయనతో సెల్ఫీలు తీసుకుని సంబరపడ్డారు. పదే పదే వాటిని చూసుకుని మురిసి పోయారు.
మంగళహారతులు
ప్రజా సంకల్ప యాత్రకు గురువారం మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ఆధ్వర్యంలో యువత అడుగడుగునా డప్పు వాయిద్యాలతో ఘనస్వాగతం పలికింది. దారిపొడవునా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జననేత వైఎస్ జగన్‌పై పూల వర్షం కురిపిం చారు. మంగళహారతులు పట్టి సీఎం కావాలంటూ దీవెనలు అందించారు. ప్రతి ఒక్కరితో ఓపిగ్గా మాట్లాడుతూ.. వారి కష్టాలు వింటూ.. తానున్నానని భరోసా ఇస్తూ వైఎస్ జగన్ ముందుకు సాగారు. ఉదయాన్నే వైఎస్ జగన్‌ను చిన్న జీయర్ స్వామి ప్రతినిధులుకలిసి పూజలుచేసి తమ ఆశీస్సులను అందజేశారు.
మహానేత వైఎస్ విగ్రహావిష్కరణ
బస ప్రాంతం నుంచి ఉదయం 7.30 గంటలకు ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభమైంది. పట్టాభిరామయ్య కాలనీ, మహానాడు, సుందరయ్యనగర్, మణిపాల్ హాస్పిటల్ వరకు 3.3 కిలోమీటర్ల మేర సాగింది. సుందరయ్యనగర్‌లో దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి, వంగవీటి రంగా విగ్రహాలను జననేత వైఎస్ జగన్ ఆవిష్కరించారు.
సమస్యల వెల్లువ
ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా తమ ప్రాంతానికి వచ్చిన జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజలు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. దారిపొడవునా ప్రజలు ఎక్కువగా అనారోగ్య సమస్యలను విన్నవించారు. తన భర్త మరణించారని, ఆధార్ కార్డు లేదంటూ మునిసిపల్ అధికారులు మరణ ధృవీకరణ పత్రం మంజూరు చేయడం లేదని జననేత ఎదుట కె.ఉమ వాపోయారు. స్వర్ణకారులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని స్వర్ణకారుల సంఘం ప్రతినిధి టి.అశోక్‌కుమార్ జననేతకు వినతి పత్రం అందజేశారు. ప్రజా సంకల్ప యాత్రలో ఆరోగ్యశ్రీ ద్వారా సాయం అందడం లేదని, పింఛన్లు రావడం లేదని, బస్సు సౌకర్యం, కనీస వసతులు లేవంటూ పలువురు తమ సమస్యలను విన్నవించారు. మహానాడు ప్రాంతంలో ఇళ్ల స్థలాలు క్రమబద్ధీకరించాలని ఎస్‌కె.రహంతుల్లా వైఎస్ జగన్‌ను కోరారు. తమ ప్రాంతంలో ఇళ్ల స్థలాలకు రిజిస్ట్రేషన్లు లేవని, పిల్లల చదువులకు, ఆడపిల్లల వివాహాలు చేసేందుకు, ఆపద సమయంలో అమ్ముకునేందుకు కూడా ఇబ్బందిగా ఉందని వివరించారు. ఇళ్ల స్థలాలు రిజిస్ట్రేషన్ జరిగేలా చూడాలని జననేతను కోరారు. కృష్ణానది ఒడ్డునే ఉంటున్నా క్యాను రూ.20 చొప్పున తాగునీరు కొంటున్నామని మహానాడుకు చెందిన మహిళలు లక్ష్మి, కృష్ణవేణి, రమాదేవి, శ్రీదేవిలు వైఎస్ జగన్‌ను కలసి సమస్యలు వివరించారు.
పాదయాత్రలో పాల్గొన్న నాయకులు
గుంటూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు రావి వెంకటరమణ, మచిలీపట్నం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, గుంటూరు, బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గాల సమన్వయకర్తలు లావు శ్రీకృష్ణదేవరాయలు, నందిగం సురేష్‌బాబు, చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు చిల్లపల్లి మోహన్‌రావు, పంచాయతీరాజ్ సంస్థల సంఘం అధ్యక్షుడు దొంతిరెడ్డి వేమారెడ్డి, తాడేపల్లి ఎంపీపీ పచ్చల రత్నకుమారి, పెదకూరపాడు నియోజకవర్గ సమన్వయకర్త కావటి మనోహర్‌నాయుడు, నాయకులు మందపాటి శేషగిరిరావు, మండేపూడి పురుషోత్తం, తాడేపల్లి మున్సిపల్ చైర్‌పర్సన్ కొయ్యగూర మహాలక్ష్మి, తాడేపల్లి పట్టణ కన్వీనర్ బుర్రముక్కల వేణుగోపాలస్వామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment