
సాక్షి, న్యూఢిల్లీ: నోట్ల రద్దు, జీఎస్‌టీపై రాహుల్ గాంధీ విమర్శలను బీజేపీ తోసిపుచ్చింది. ఈ రెండు నిర్ణయాలపై దేశ ప్రజలు మోదీ సర్కార్‌కు బాసటగా నిలిచారని ఆ పార్టీ ప్రతినిధి జీవీఎల్ నరసింహరావు అన్నారు. జీఎస్టీని పార్లమెంట్‌లో సమర్థించిన కాంగ్రెస్ ఇప్పుడు దాని అమలును వ్యతిరేకించడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. జీఎస్టీలో అన్ని రకాలుగా భాగస్వామ్యం కలిగిన కాంగ్రెస్ తన బాధ్యత నుంచి తప్పించుకోలేదని హెచ్చరించారు.
రాహుల్ మేథావిలా వ్యవహరించాలనుకున్న ప్రతిసారీ అది జోక్‌గా నిలిచిపోతున్నదని చురుకలు వేశారు. యూపీ, ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో నోట్ల రద్దును రాజకీయం చేసిన కాంగ్రెస్‌కు ఓటర్లు బుద్ధి చెప్పారని అన్నారు. కాంగ్రెస్ మళ్లీ అలా చేయదలుచుకుంటే ప్రజలు ఆ పార్టీకి దీటుగా బదులిస్తారన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు నల్లధనానికి వ్యతిరేకంగా ఎలాంటి చర్యలూ చేపట్టలేదని మోదీ సర్కార్ బ్లాక్‌మనీకి వ్యతిరేకంగా పోరాడుతుంటే అడ్డుకుంటోందని ఆరోపించారు.
మోదీ ప్రభుత్వం దేశ ప్రయోజనాల కోసం కఠిన నిర్ణయాలు తీసుకుంటోందని, ప్రజలంతా ప్రభుత్వానికి అండగా నిలబడుతున్నారని చెప్పారు. వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు చేపట్టిన ప్రక్రియకు ప్రజలు మద్దతు తెలుపుతున్నారని అన్నారు. నవంబర్ 8న నోట్ల రద్దును వ్యతిరేకిస్తూ విపక్షాలు బ్లాక్‌డేకు పిలుపు ఇవ్వడాన్ని తప్పుపట్టారు.