
టీజీ భరత్,ఎస్వీ మోహన్ రెడ్డి
సాక్షి ప్రతినిధి, కర్నూలు: అధికార పార్టీ నేతల్లో అప్పుడే సర్వే గుబులు మొదలయ్యింది. కర్నూలు ఎమ్మెల్యే టికెట్ తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరికిస్తే బాగుంటుందో తెలపాలని ఐవీఆర్‌ఎస్ (ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్) ద్వారా ఓటర్ల నుంచి తెలుసుకుంటుండడం చర్చనీయాంశమైంది. గురు, శుక్రవారాల్లో కర్నూలు నగరంలోని ఓటర్లకు హైదరాబాద్‌లోని 9140–38119985 నంబరు నుంచి ఫోన్లు వచ్చాయి. టీడీపీ నుంచి ఎమ్మెల్యే టికెట్ టీజీ భరత్‌కు ఇవ్వాలనుకుంటే ఒకటి నొక్కండి... ఎస్వీ మోహన్ రెడ్డికి అయితే రెండు నొక్కండంటూ ఫోన్లు రావడం గమనార్హం. రిలయన్స్‌కు చెందిన ఈ ల్యాండ్‌లైన్ నంబరు అడ్రెస్ మాత్రం ‘ట్రూ కాలర్’లో అపోలో క్లినిక్‌కు చెందినదిగా చూపిస్తుండడం గమనార్హం. మొత్తమ్మీద సమయం, సందర్భం లేకుండా ఈ సర్వే చేపట్టడం చర్చనీయాంశమైంది.
సీటు నాదంటే..నాదే!
కర్నూలు ఎమ్మెల్యే సీటు విషయంలో అధికార పార్టీలో అప్పుడే గొడవ మొదలయ్యింది. సీటు నాదంటే నాదే అంటూ అటు ఎస్వీ మోహన్ రెడ్డి, ఇటు టీజీ భరత్ చెప్పుకుంటున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా తనకే వస్తుందని ఎస్వీ మోహన్‌రెడ్డి.. తాను లోకల్ కావున అవకాశం దక్కుతుందని భరత్ అంటున్నారు. అంతేకాకుండా సర్వేలో ఎవరు గెలుస్తారని తేలితే వారికే టికెట్ దక్కుతుందని భరత్ ముక్తాయించారు. మరోవైపు ఎస్వీ మోహన్‌రెడ్డి తాను మాత్రం టీడీపీ నుంచే పోటీ చేస్తానని, భరత్ ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో తనకు తెలియదని పేర్కొనడంతో చర్చ మరింత ఆసక్తికరంగా మారింది. ఇదే నేపథ్యంలో తాజాగా సర్వే జరగడంతో మరోసారి సీటు విషయం చర్చనీయాంశమయ్యింది. ఇదిలావుండగా.. సర్వేలో టీజీ భరత్‌కు అయితే ఒకటి నొక్కండి... ఎస్వీ మోహన్ రెడ్డికి అయితే రెండో నంబరు నొక్కండని పేర్కొనడంపై ఎస్వీ వర్గీయులు మండిపడుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఆప్షన్‌కు రెండో నంబరు ఇవ్వడం ఏంటని వాపోతున్నారు.
సర్వే చేస్తోంది ఎవరు?
ఇప్పటికిప్పుడే అసెంబ్లీ ఎన్నికలు లేవు. ఏడాదికిపైగా సమయం ఉంది. అయినప్పటికీ ఇప్పుడే సర్వే నిర్వహించడంపై అధికార పార్టీలోనే అనేకానేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకూ అపోలో క్లినిక్‌కు చెందిన ఈ నంబరు నుంచి సర్వే చేయడం ఏమిటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా సర్వే ద్వారానే ఎవరు పోటీ చేస్తారనే అంశాన్ని అధిష్టానం నిర్ణయిస్తుందన్న టీజీ భరత్ వ్యాఖ్యల నేపథ్యంలో ఈ సర్వే జరగడం మరింత చర్చనీయాంశమవుతోంది. ఇప్పటికే కర్నూలు నియోజకవర్గంలోని పార్టీ పదవులన్నీ ఎస్వీ మోహన్‌రెడ్డి వర్గానికే దక్కాయి. ఈ పరిస్థితుల్లో ఈ సర్వే జరగడం కూడా మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఏదిఏమైనా సర్వే నేపథ్యంలో ఎవరి బలమేమిటో తెలిసిపోనుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment