
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకి ధన్యవాదాలు తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. సాయాన్ని ఈఏపీ రూపంలో ఇవ్వాలంటూ ప్రతిపాదనలు పంపారని, తీరా ఏడాదిన్నర తరువాత మాటమార్చి.. నాబార్డు ద్వారా రుణంగా ఇవ్వాలని కోరినట్టు కేంద్ర ఆర్థికమంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. 2014–15 ఆర్థిక సంత్సరానికి చెందిన రెవెన్యూ లోటులో రైతు రుణమాఫీ ఖర్చుతోపాటు.. విద్యుత్ రాయితీని, రూ.200 నుంచి రూ.1000కి పెంచిన పెన్షన్ స్కీమ్‌ను చేర్చారని.. ఇలా ఎలా చేస్తారని ఆయన విమర్శించారు.
ఏపీ విభజన చట్టంలోని హామీల అమలుపై రాజ్యసభలో మంగళవారం జరిగిన స్వల్పకాలిక చర్చలో ఆయన మధ్యలో జోక్యం చేసుకుని మాట్లాడారు. ‘ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని పూర్తిగా అమలుచేసేందుకు కట్టుబడి ఉన్నాం. 14వ ఆర్థిక సంఘం రెండు ఫార్ములాలు ఉపయోగించింది. మొదటిది కేంద్ర పన్నుల్లో వాటాను రాష్ట్రాలకు 42 శాతం పంచింది. ఆంధ్రప్రదేశ్‌కు కూడా వర్తింపజేసింది. రెండోది రెవెన్యూ లోటు ఉండే రాష్ట్రాలకు రెవెన్యూ లోటు అంచనా వేసి అదనపు గ్రాంట్లు ఇచ్చింది.
ఈశాన్య, పర్వత రాష్ట్రాలు కాకుండా ఈ గ్రాంటు అందుకున్న ఇతర రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒక్కటే ఉంది. కేంద్ర సాయం విషయంలో స్పెషల్ పర్పస్ వెహికిల్ ఏర్పాటుచేయాలని కోరితే ఏపీ ఇప్పటివరకూ స్పందించలేదు. అయినా.. ఇచ్చిన హామీలన్నింటినీ తూచా తప్పకుండా నెరవేరుస్తాం..’ అని పీయుష్ గోయెల్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment