కోల్‌కతా : బెంగాల్‌లో సార్వత్రిక ఎన్నికల ప్రచార ముగింపు సభలో ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మథురాపూర్ నియోజకవర్గం, డమ్ డమ్‌లో గురువారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నికల సంఘాన్ని తప్పుబడుతున్న మమత తీరు సరైందని కాదని విమర్శించారు. ‘ సీపీఐ(ఎమ్) మీకు చేసిన దాని గురించి ఎందుకు మరచిపోతున్నారు. ఈరోజు దీదీ ఎన్నికల సంఘాన్ని, కేంద్ర బలగాలను అకారణంగా దూషిస్తున్నారు. మరి బెంగాల్‌లో వామపక్ష పార్టీ నుంచి అధికారాన్ని చేజిక్కుంచుకున్నపుడు కూడా ఈసీ, బలగాలు ఇదే విధంగా పనిచేశాయి కదా. అంటే గతంలో వాళ్లు మీకు సహకరించారా. ఇలాంటివి చేశారు కాబట్టే.. ప్రస్తుతం ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారా’ అంటూ ప్రశ్నలు సంధించారు. ఇక మోదీ హటావో అంటూ పెద్ద ఎత్తున నినాదాలు ఇస్తున్న ప్రతిపక్షాలు గత ఆరు నెలలుగా కనీసం ప్రధాని అభ్యర్థిని కూడా నిర్ణయించలేక చతికిల పడ్డాయని ఎద్దేవా చేశారు. వారు ఓటమిని అంగీకరించారని.. అందుకే అర్థంపర్థంలేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
కాగా పశ్చిమ బెంగాల్‌లో హింసాత్మక ఘటనల నేపథ్యంలో తొలిసారి ఆర్టికల్ 324ను ఉపయోగించిన కేంద్ర ఎన్నికల సంఘం ఒక రోజు ముందే అక్కడ ప్రచారం ముగించాలని ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో నేటి సాయంత్రమే అక్కడ ప్రచారం ముగిసింది. ఇక ఈ నెల 19న బెంగాల్‌లో తొమ్మిది లోక్‌సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగనుంది. కాగా మంగళవారం బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా రోడ్‌షోపై రాళ్లదాడి జరిగిన సంగతి తెలిసిందే. తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలే ఈ దాడి చేశారని బీజేపీ ఆరోపించింది. బీజేపీ ఎన్నికల ప్రచారంపై రాళ్లదాడి ఘటనపై ఈసీ జోక్యం చేసుకోవాలని అమిత్ షా విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ఈసీ ఈ అనూహ్య నిర్ణయం తీసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment