
సాక్షి, న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ కురువృద్ధుడు, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి(93) మృతి పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతికి సంతాపం ప్రకటించారు. అటల్‌జీ లేకపోవడం శూన్యంలా అనిపిస్తోందని, నిశ్శబ్దంలా గోచరిస్తోందని, వాజ్‌పేయి లేరనేది ఒక యుగాంతంలా అనిపిస్తోందని ప్రధాని మోదీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. భారత రాజకీయా రంగానికి వాజ్‌పేయి మరణం తీరని లోటు అన్నారు. బీజేపీ ఒక గొప్ప నాయకున్ని కోల్పొయిందని పేర్కొన్నారు. ‘నాకు మాటలు రావడం లేదు. అటల్‌జీ మరణం వ్యక్తిగతంగా నాకు తీరని లోటు. ఆయన ప్రతి నిమిషం దేశం కోసం పనిచేశారు. ప్రియమైన నేత అటల్ బిహారీ వాజ్‌పేయి దివంగతులుకావడంతో భారతదేశం శోక సముద్రంలో మునిగిపోయింది’ అని ట్వీట్ చేశారు. ఆయన దివంగతులు కావడంతో ఓ శకం ముగిసిందని పేర్కొన్నారు. ఆయన దశాబ్దాలుగా దేశం కోసం జీవించారని, అత్యంత శ్రద్ధాసక్తులతో దేశానికి సేవ చేశారని పేర్కొన్నారు.
అటల్‌జీ మృతి పట్ల కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సంతాపం ప్రకటించారు. దేశం ఓ మహోన్నత నేతను కొల్పొయిందన్నారు. ఆయన మరణం దేశానికి తీరని లోటు అని పేర్కొన్నారు. భరత మాత ఓ గొప్ప బిడ్డని కోల్పొయిందన్నారు.
ఆయన అసలు సిసలు భారతీయుడు : వెంకయ్య నాయుడు
అటల్ బిహారీ వాజ్‌పేయి దేశానికి లభించిన గొప్పనాయకుడని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. అటల్‌జీ మృతిపట్ల భారతీయులకు తీరని లోటని పేర్కొన్నారు. దేశానికి ప్రత్యామ్నాయ మార్గాన్ని అందించిన గొప్ప సంస్కర్త అని అన్నారు. ఆయన అసలు సిసలైన భారతీయుడని పేర్కొన్నారు. ‘ విద్యార్థి దశ నుంచి ఆయన్ను అభిమానించేవాణ్ని. యువతరం గుండెల్లో నిలిచిన గొప్ప నేత ఆయన. నాకు మార్గదర్శనం చేసేవారు. అప్యాయతంగా పలకరించేవాడు. నాపైనే కాదు దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మందిపై అదే అప్యాయత చూపిన మహానాయకుడు అటల్ బిహారీ వాజ్‌పేయి’ అని వెంకయ్యనాయుడు ట్వీట్ చేశారు.
గొప్ప ప్రధాన మంత్రిని కోల్పోయాం : మన్మోహన్ సింగ్
వాజ్‌పేయి మరణ వార్త వినాల్సిరావడం బాధాకరమని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. గొప్ప వక్త, కవి, ప్రజానాయకుడు, ఉత్తమ పార్లమెంటేరియన్, గొప్ప ప్రధాన మంత్రిని దేశం కోల్పోయిందన్నారు. ఆయన తన యావత్తు జీవితాన్ని దేశానికి సేవ చేయడానికి అంకితం చేశారన్నారు. ఆయన దేశానికి చేసిన సేవలను ప్రజలు మరవబోరన్నారు. అటల్ మృతిపట్ల బీజేపీ చీఫ్ అమిత్ షా, రాష్ర్ట పతి రామ్‌నాద్ కోవింద్, హోం మంత్రి రాజ్‌నాద్ సింగ్‌తో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment