న్యూఢిల్లీ: దేశంలో కీలకమైన పెద్ద రాష్ట్రం పశ్చిమబెంగాల్‌లో అధికార పీఠంపై బీజేపీ కన్నేసింది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న దృష్ట్యా సోమవారం ప్రధాని మోదీ స్వయంగా ఆ రాష్ట్ర ఎంపీలతో సమావేశమయ్యారు. అక్కడి ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్టీ పరంగా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో స్పందనను వారిని అడిగి తెలుసుకున్నారు. ‘రాష్ట్రానికి చెందిన మా పార్టీ ఎంపీలను వ్యక్తిగతంగా కలవాలని ప్రధాని మోదీ నిర్ణయించారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, అభివృద్ధి పనులపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ పరిణామం రానున్న ఎన్నికల సమరంలో పాల్గొనేలా వారిలో స్థైర్యాన్ని, ఉత్సాహాన్ని నింపుతుంది’అని బీజేపీ బెంగాల్ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ తెలిపారు.
‘ఎన్నికల్లో పార్టీ గెలవాలంటే ఏం చేయాల్సిన అవసరం ఉంటుంది? కేంద్ర ప్రభుత్వం గురించి, పథకాల గురించి ప్రజలేమనుకుంటున్నారు? అనే విషయాలను ప్రధాని అడిగి తెలుసుకున్నారు’మరో ఎంపీ లాకెట్ ఛటర్జీ వెల్లడించారు. 2016 ఎన్నికల్లో అసెంబ్లీలోని 295 స్థానాలకు గాను టీఎంసీ 211 సీట్లు, కాంగ్రెస్, సీపీఎం కలిపి 70 సీట్లు గెలుచుకోగా బీజేపీకి కేవలం మూడు సీట్లే దక్కాయి. టీఎంసీకి 45 శాతం ఓట్లు దక్కగా, బీజేపీకి 10శాతం మాత్రమే పడ్డాయి. కానీ, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలోని 42 లోక్‌సభ స్థానాలకు గాను బీజేపీ 18 సీట్లు కైవసం చేసుకుంది. ఓటింగ్ శాతం పరంగా చూస్తే టీఎంసీకి 44 శాతం, బీజేపీకి 40 శాతం ఓట్లు పడ్డాయి. ఈ అనూహ్య ఫలితాలు టీఎంసీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీని షాక్‌కు గురిచేశాయి.
Comments
Please login to add a commentAdd a comment