నేడు వారణాసికి ప్రధాని మోదీ | PM Narendra Modi To Visit Varanasi Today | Sakshi
Sakshi News home page

నేడు వారణాసికి ప్రధాని మోదీ

Published Mon, May 27 2019 8:36 AM | Last Updated on Mon, May 27 2019 10:57 AM

PM Narendra Modi To Visit Varanasi Today - Sakshi

వారణాసి: లోక్‌సభ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన అనంతరం మొదటిసారి ప్రధాని నరేంద్ర మోదీ ఆయన పార్లమెంటు నియోజకవర్గం అయిన వారణాసిలో సోమవారం (నేడు) పర్యటించనున్నారు. ఈ సందర్భంగా తనపై నమ్మకం ఉంచి భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలుపనున్నారు. అలాగే ప్రముఖ పుణ్యక్షేత్రం కాశీ విశ్వనాథున్ని దర్శించుకుని పూజలు చేయనున్నారు. వారణాసికి చేరుకున్న అనంతరం మోదీ.. పోలీస్‌ లైన్స్‌ నుంచి బన్స్‌ఫటక్‌ వరకు రోడ్డు మార్గం ద్వారా వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు నగరంలోని వివిధ మార్గాల ద్వారా మోటార్‌ సైకిళ్ల ర్యాలీలు నిర్వహిస్తారు.

సోమవారం ఉదయం కాశీ విశ్వనాథుని సన్నిధిలో పూజలు నిర్వహించిన అనంతరం ఆయన బీజేపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ‘మా అమ్మ ఆశీర్వాదం తీసుకోడానికి ఆదివారం నేను గుజరాత్‌కు వెళ్తున్నాను. మరుసటి రోజు కాశీ విశ్వనాథున్ని దర్శించుకుంటాను. అలాగే నాపై నమ్మకం ఉంచి నన్ను గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు చెబుతాను’ అని మోదీ ట్వీట్‌ చేశారు. కాగా, ప్రధాని రాక నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాటు చేశామని జిల్లా మెజిస్ట్రేట్‌ సురేంద్ర సింగ్‌ చెప్పారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో మోదీ వారణాసి నుంచి 4.79 లక్షల ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందిన సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement