సాధారణంగా ఒక నియోజకవర్గంలో పోటీ చేసే వారంతా ఆ నియోజకవర్గానికి సంబంధించిన వారై ఉంటారు. కొందరు ఇతర రాష్ట్రాల్లో పోటీ చేస్తుంటారు. అయితే, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పోటీ చేస్తున్న వారణాసి నియోజక వర్గంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారు పోటీ చేస్తుండటం విశేషం. ఈ నియోజకవర్గంలో మోదీతో పాతిక మంది తలపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, బిహార్, కేరళ, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల నుంచి వచ్చిన ఈ పాతిక మంది ఇక్కడ ఇండిపెండెంట్లుగా ప్రధాని మోదీపై పోటీకి దిగారు. తాము నెగ్గాలన్న కోరిక తో కాకుండా తమ సమస్యలను దేశం దృష్టికి తీసుకెళ్లాలన్న ఆశతోనే వీరు బరిలోకి దిగారు. ఇక్కడ మోదీ గెలుపు ఏకపక్షమేనన్న సంగతి తెలిసిందే. ‘ఈ ఎన్నికల్లో గెలుస్తామని మేమెవరం అనుకో వడం లేదు. అయితే, ప్రధానితో పోటీ చేయడం ద్వారా మా సమస్యను దేశం దృష్టికి తేవాలన్నదే మా ఆశ’ అని వీరు స్పష్టం చేస్తున్నారు. ‘మోదీని ఓడించాలని నేనిక్కడికి రాలేదు.
రైతుల దుస్థితిని ప్రజల దృష్టికి తేవడానికే పోటీ చేస్తున్నాను’ అన్నా రు మహారాష్ట్ర అభ్యర్థి మనోహర్ ఆనంద్ రావ్ పాటిల్. ఈయన గాంధీజీ వేషంలో ఆయన ఫోటో మెడలో వేసుకుని ప్రచారం చేస్తున్నారు. రైతుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో, వారెంత దుర్భర జీవితం అనుభవిస్తున్నారో చెప్పడం కోసమే తాను ఇంత దూరం వచ్చి పోటీ చేస్తున్నానన్నారు ఆంధ్రప్రదేశ్ రైతు మానవ్ విశ్వమానవ్. రాయ్‌పూర్ నుంచి వచ్చిన మనీష్ శ్రీవాత్సవ్ పోటీ చేయడానికి కారణం చెబుతూ... ప్రభుత్వ ఉద్యోగులంతా తమ పిల్లల్ని తప్పకుండా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించేలా, ప్రభుత్వ ఆస్పత్రుల్లో నే చికిత్స చేయించుకునేలా ప్రభుత్వం చట్టం చేయాలని కోరారు. గంగానదికి జాతీయ నది హోదా ఇవ్వాలన్న డిమాండ్‌తో మోదీతో తలపడుతున్నానన్నారు ఉత్తరాఖండ్‌కు చెందిన సునీల్ కుమార్. మోదీ సర్కారు అవలంబిస్తున్న అగ్రవర్ణ వ్యతిరేక వైఖరిని ఎండగట్టడానికే బరిలో దిగానని రాయబరేలికి చెందిన త్రిభువన్ శర్మ స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో ఇక్కడ మోదీపై 41 మంది పోటీ చేశారు. ఈ సారి ఆ సంఖ్య 25కి తగ్గింది.
Comments
Please login to add a commentAdd a comment