కారులో కయ్యం | polepalli srinivas reddy fired on speaker and his son | Sakshi
Sakshi News home page

కారులో కయ్యం

Published Mon, Oct 16 2017 12:48 PM | Last Updated on Mon, Oct 16 2017 12:48 PM

polepalli srinivas reddy fired on speaker and his son

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న పోలేపల్లి శ్రీనివాస్‌రెడ్డి

వరంగల్‌, పరకాల: అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలో ముసలం మొదలైంది. ప్రజాప్రతినిధులకు, క్యాడర్‌కు మధ్య ఇన్నాళ్లు లోలోపల ఉన్న అసంతృప్తి భగ్గుమంటోంది. శాసనసభ స్పీకర్‌ మధుసూదనాచారి, ఆయన కుమారులే లక్ష్యంగా పరకాల వ్యవసాయ మార్కెట్‌ చైర్మన్‌ పోలేపల్లి శ్రీనివాస్‌రెడ్డి విమర్శలు సంధించారు. ఉద్యమం చేసిన కార్యకర్తల శ్రేయస్సు కన్నా స్పీకర్‌కు కన్న కొడుకుల ప్రయోజనాలే ముఖ్యంగా మారాయని ఆరోపించారు. స్పీకర్‌కు సన్నిహితంగా ఉండే పోలేపల్లి శ్రీనివాస్‌రెడ్డి.. ఆయన కుటుంబ సభ్యుల తీరుతో భూపాలపల్లి నియోజకవర్గంలో పార్టీకి, కార్యకర్తలకు జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తూ సీఎంకు పంపిన వీడియో బయటికి రావడం కలకలం రేపింది. సొంత పార్టీ కార్యకర్తల పనులని చూడకుండా కమీషన్లకు కక్కుర్తి పడుతూ కొడుకులతో బెదిరింపులకు గురిచేస్తున్నందు వల్లే స్పీకర్‌కు దూరం కావాల్సి వచ్చిందని చెప్పారు. వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో ఆదివారం మీడియా ముందుకు వచ్చిన మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ శ్రీనివాస్‌రెడ్డి స్పీకర్‌ మధుసూదనా చారి, కొడుకుల ప్రవర్తనపై మరోసారి అనేక ఆరోపణ లు చేశారు. 2001లో టీఆర్‌ఎస్‌లో చేరానని, మధుసూదనాచారి గెలుపు కోసం ఎంతగానో శ్రమించాన న్నారు. తనకు ఉన్న 9 ఎకరాల భూమిని అమ్మి ఎన్ని కల ఖర్చు కోసం రూ.34 లక్షలతోపాటు మధుసూదనాచారికి వసతి, భోజన సౌకర్యాలు కల్పించానని చెప్పారు.

ఇప్పుడు తనను చిన్నచూపు చూడడం, తాను చేసిన సహాయాన్ని మరిచిపోయి స్పీకర్, ఆయ న కొడుకులు ప్రవర్తించిన తీరు మనస్తాపానికి గురిచేసిందన్నారు. రూ.30లక్షలతో జోగంపల్లి సమ్మక్క, సారలమ్మ జాతర వద్ద చేపట్టిన పనుల్లో రూ.3.28 లక్షల పర్సంటేజీ తీసుకున్నారని ఆరోపించారు. కార్యకర్తలకు అప్పగించిన ప్రతి సీసీ రోడ్డు పనిలో రూ.10 వేలు కమీషన్‌ కావాలని కోరడం తనను విస్మయానికి గురిచేసిందన్నారు. పార్టీ అభివృద్ధి కన్నా కొడుకుల ప్రయోజనాలే స్పీకర్‌కు ముఖ్యంగా మారాయని, దీంతో కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందన్నారు. ఈ విషయాలను పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లానని, స్పీకర్‌ అవినీతి, అక్రమాలపై 24 వీడియోలు బయటపెడతానని చెప్పారు. ఆధారాలతోనే మీడియా ముందుకు వస్తున్నాని వెల్లడించారు. రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ భాస్కర్‌కు ఓఎస్‌డీగా ఉద్యోగం ఇచ్చి ప్రతినెలా ఇస్తున్న రూ.1.50లక్షల వేతనం దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. ఒక్కో ట్రాక్టర్‌ కు లక్ష రూపాయల చొప్పున వసూలు చేసి సబ్సిడీ ట్రాక్టర్ల ను అనర్హులకు అందజేశారన్నారు. భూపాలపల్లి నియోజకవర్గంలో స్పీకర్‌ ముగ్గురు కొడుకుల నుంచి పార్టీని కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే ఆయనకు దూరం కావాల్సి వచ్చింద ని శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.

హైదరాబాద్‌లో స్పీకర్‌ రెండో కుమారుడు సిరికొండ ప్రశాంత్‌ తనపై దాడిచేసే విధంగా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. స్పీకర్‌ కుమారుల అవినీతి, అక్రమాలపై, తన ఫిర్యాదులపై పార్టీ నాయకత్వం వెంటనే దృష్టి సారించి తక్షణమే చర్య తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. భూపాలపల్లి నియోజకవర్గంలో భవిష్యత్‌లో ఎలాంటి నాయకత్వం వచ్చినా సంతోషంగా పనిచేసి కారు గుర్తును గెలిపించుకుంటామన్నారు. జెడ్పీటీసీ మాజీ సభ్యుడు చల్లా చక్రపాణి, మార్కెట్‌ కమిటీ మాజీ వైస్‌ చైర్మన్‌ రేణుకుంట్ల సదయ్య, పత్తిపాక మాజీ సర్పంచ్‌ దుబాసి కృష్ణమూర్తి, టేకుమట్ల మండల నాయకులు శ్రీనివాసరావు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement