
సాక్షి, వైఎస్సార్ జిల్లా: నిన్న మొన్న వరకూ తెలుగుదేశం తరపున చక్రం తిప్పిన వ్యక్తి ఆయన. రాష్ట్రానికి సీఎం చంద్రబాబు అయితే జిల్లాకు సీఎం నేను అనే తీరుగా ఉండేది ఆయన వ్యవహారం. గ్రూపు రాజకీయాలు చేయాలన్నా, మనుషులతో బెదిరించాలన్నా జిల్లాలో ఆయన తరువాతే ఎవరైనా. 2014లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక చెలరేగి పోయాడు. సీనియర్లను సైతం ఏమాత్రం పట్టించుకోకుండా గ్రూపు రాజకీయాలు నడిపాడు. కానీ ఇప్పుడు ఆనేత వాడి వేడి తగ్గిపోయింది. అధినేత అండతో చక్రం తిప్పిన నేత నేడు అపాయింట్‌మెంట్ కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నాడు.
సీఎం రమేష్ వైఎస్సార్ జిల్లాలో తెలుగుదేశానికి చెందిన ఎంపీ. గతంలో చంద్రబాబుకు సీఎం రమేష్‌కు మంచి అనుబంధమే ఉండేది. అయితే ఇప్పడు అది తగ్గిపోయింది. పార్టీలో ఆయన ప్రాభల్యం కోల్పోయారు. ఇన్నాళ్లు పార్టీకి అన్నీ చేసిన ఆయన్ను పార్టీ పక్కన పెట్టేసింది. ఏరు దాటాక తెప్ప తగలేసిన విధంగా సీఎం రమేష్‌కు తెలుగుదేశం పార్టీ చెక్ పెట్టింది. ఫిరాయింపు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడం ద్వారా రమేష్ ప్రాభల్యాన్ని తగ్గించింది.
రానున్న ఎన్నికల్లో సీఎం రమేష్, ఎంపీ పదవికి రాజీనామా చేసి ప్రొద్దుటూరు నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యే బరిలో దిగాలని చూస్తున్నారు. అందులో భాగంగానే ముఖ్యమంత్రికి సైతం చెప్పకుండా కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజును ప్రొద్దుటూరుకు పిలిపించి రంజాన్ మాసంలో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇప్పించాడు. అయితే ఇప్పటికే అక్కడ మాజీ కాంగ్రెస్ నేత, ప్రస్తుతం తెలుగుదేశంలో కొనసాగుతున్న వరదరాజుల రెడ్డి ఎన్నో రోజులుగా ఆస్థానం కోసం ఎదురుచూస్తున్నారు. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర ఉద్రిక్తలు నెలకొన్నాయి. అంతేకాదు ప్రొద్దుటూరు మున్సిపల్ ఎన్నికల సమయంలో ఇరు వర్గాలు గొడవలకు దిగాయి.
అంతే కాదు గతంలో రమేష్, పార్టీలోని ఇతర నాయకులకు ప్రాజెక్టులు దక్కకుండా అణతొక్కారు. దీంతో బెంబేలెత్తిన నాయకులు, వరదరాజల రెడ్డి ముఖ్యమంత్రిని కలిసి విషయాన్ని పూసగుచ్చినట్లు వివరించారు. అయతే గత కొంత కాలంగా సీఎం రమేష్‌కు చెక్ పెట్టాలని పార్టీ అధినేత భావిస్తూ వచ్చారు. దానిలో భాగంగానే ఆదినారాయణ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చి ప్రోత్సహించారు. అక్కడ నుంచి రమేష్ పతనం మొదలైంది. పార్టీ అధినేతను కలవాలన్నా అపాయింట్‌మెంట్ దొరకని పరిస్థతి. అంతేకాదు జిల్లా పార్టీ పగ్గాలను సైతం మంత్రి ఆదికే అప్పగించారు. జిల్లాలో ఏం జరగాలన్నా వయా మంత్రిగారి ద్వారానే జరగాలని ఆదేశించారు. దీనిపై సీఎం రమేష్ కూడా పైకి సరే అన్నా,, సన్నిహితులు దగ్గర మాత్రం తన పరిస్థతి ఏమాత్రం బాగాలేదని, ముఖ్యమంత్రి పట్టించుకోవడం మానేశారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పార్టీ అధినేత సూచనతో నాయకులు ఎవరూ సీఎం రమేష్‌ను ఎవరూ పట్టించుకోవట్లేదన్నది బహిరంగ రహస్యం. అంతకు ముందు వరకూ జిల్లాలో ఏకాంట్రాక్టులు జరిగినా రమేష్ చేయి పడాల్సిందే. ఇప్పడు మాత్రం ఏం కావాలన్నా మంత్రి ఆది దగ్గరకే తెలుగుతమ్ముళ్లు క్యూ కడుతున్నారు. సీఎం రమేష్‌ను పట్టించుకోవడం మానేశారు. దీనిపై సీఎం రమేష్ అసంతృప్తితో ఉన్నారు. పార్టీకి ఎంతో చేసిన తనను కాదని ఆదినారాయణ రెడ్డికి ప్రాధాన్యం ఇస్తుండంతో పార్టీ అధినేతతో పాటు, మంత్రి ఆదినారాయణపై సీఎం రమేష్ రగిలిపోతున్నట్లు సన్నిహితుల సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment