సాక్షి, చెన్నై: ప్రాంతీయ పార్టీలను ఏకం చేయడానికి తగ్గ కసరత్తులపై శ్రీకారం చుట్టిన తెలంగాణ సీఎం కేసీఆర్, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ మధ్య భేటీ తమిళనాట చర్చకు దారి తీసింది. ఇది కేవలం మర్యాదే అని స్టాలిన్ ప్రకటించినా, తెర వెనుక రాజకీయం సాగుతోందన్న ఆరోపణలు, విమర్శలు గుప్పుమంటున్నాయి. కాంగ్రెస్‌ను ఇప్పటినుంచే బెదిరించి తన గుప్పెట్లో పెట్టుకునేందుకు స్టాలిన్ సిద్ధం అయ్యారంటూ అన్నాడీఎంకే విమర్శలు ఎక్కుబెట్టింది. ఇక, దేశంలో మూడో లేదా ఫెడరల్ ఫ్రంట్‌కో ఆస్కారం లేదని కాంగ్రెస్ అధ్యక్షుడు కేఎస్.అళగిరి వ్యాఖ్యానించారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ గత ఏడాది ఏప్రిల్‌లో చెన్నైకు వచ్చిన విషయం తెలిసిందే. ఫెడరల్ ఫ్రంట్ నినాదంతో ఇక్కడకు వచ్చిన ఆయనకు ఘనంగానే ఆహ్వానం లభించింది. గోపాలపురంలో డీఎంకే అధ్యక్షుడు ఎం.కరుణానిధితో కేసీఆర్ భేటీ అయ్యారు. ఆ తదుపరి అప్పట్లో డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న స్టాలిన్‌తో కేసీఆర్ సమావేశం అయ్యారు. బీజేపీ, కాంగ్రెస్సేతర పార్టీలతో కూటమి ఏర్పాటు దిశగా కేసీఆర్ ప్రయత్నాల్లో ఉన్నట్టుగా, ఇందుకు డీఎంకే మద్దతు కోరినట్టుగా అప్పట్లో సంకేతాలు వెలువడ్డాయి. కరుణానిధి మరణం తదుపరి డీఎంకే అధ్యక్షుడిగా స్టాలిన్ పగ్గాలు చేపట్టినానంతరం రాజకీయ పరిణామాలు అనేక మలుపులు తిరిగాయి. గత నెల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి డీఎంకే ఎదుర్కొంది. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన స్టాలిన్, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు సిద్ధం అయ్యారు. అలాగే, తమిళనాట అన్నాడీఎంకే సర్కారును కూలదోసి తమ గుప్పెట్లోకి పాలనను తీసుకోవడమా? లేదా, ఎన్నికలకు వెళ్లడమా? అనే దిశగా వ్యూహాలకు పదును పెట్టి ఉన్నారు. ఈ సమయంలో కేసీఆర్ మళ్లీ తనతో భేటికి సిద్ధం కావడంతో తొలుత స్టాలిన్ వెనుకడుగు వేసినట్టు సంకేతాలు వెలువడ్డాయి.
భేటీతో చర్చ
ఈనెల 23న వెలువడే ఫలితాల అనంతరం కేంద్రంలో ఏర్పడబోయే ప్రభుత్వంలో ప్రాంతీయ పార్టీలు కీలక పాత్ర పోషించేందుకు తగ్గట్టుగా కేసీఆర్ వ్యూహాలకు పదును పెట్టి ఉండటంతో ఈ భేటీకి తొలుత స్టాలిన్ వెనక్క తగ్గాల్సి వచ్చింది. ఇందుకు కారణం, తమిళనాట అన్నాడీఎంకే సర్కారును కూలదోయాలన్నా, అవకాశం వస్తే తాము ప్రభుత్వాన్ని చేజిక్కించుకోవాలన్న కాంగ్రెస్ మద్దతు తప్పనిసరి కావడమే. దీంతో భేటీ విషయంగా ఆలోచించి చివరకు మర్యాదపూర్వకం అన్నట్టుగా ముందుకు సాగినట్టు డీఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి.
గంటపాటూ రాజకీయం
ఆళ్వార్‌పేటలోని తన నివాసానికి చేరుకున్న కేసీర్‌కు స్టాలిన్ పుష్పగుచ్ఛం అందించి ఆహ్వానం పలికారు. గంట పాటుగా స్టాలిన్ నివాసంలో కేసీఆర్ ఉన్నారు. అక్కడ జాతీయ, రాష్ట్ర రాజకీయాల మీద చర్చ సాగినట్టు తెలిసింది. ప్రాంతీయ పార్టీల ఏకం ప్రస్తావనను ఈ సందర్భంగా స్టాలిన్ ముందు కేసీఆర్ ఉంచినట్టు తెలిసింది. అయితే, ప్రస్తుతానికి జాతీయ రాజకీయాల కన్నా, తమిళనాట అన్నాడీఎంకే సర్కారును కూలదోయడం, అందుకు తగ్గట్టుగా స్పీకర్ మీద తాము జారీ చేసి ఉన్న అవిశ్వాస తీర్మానికి తగ్గ నోటీసు ప్రస్తావనను స్టాలిన్ తీసుకొచ్చినట్టు తెలిసింది. 22 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా వచ్చే అవకాశాలు ఉన్నాయన్న అంశాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. అలాగే, కాంగ్రెస్‌తో కలసి తమిళనాట తాము ఎన్నికల్ని ఎదుర్కొన్న దృష్ట్యా, తమిళనాట ఆ పార్టీ ఎమ్మెల్యేల అవసరం తమకు ఉందని, ప్రస్తుతానికి జాతీయ ప్రస్తావన వద్దన్నట్టు స్టాలిన్ సున్నితంగా తిరస్కరించినట్టు తెలిసింది. చివరకు లోక్‌సభ ఎన్నికల ఫలితాల మేరకు తదుపరి చర్చించుకుందామన్నట్టుగా ఇద్దరు నేతలు సంకేతాల్ని ఇచ్చుకున్నట్టుగా డీఎంకే నేత ఒకరు పేర్కొన్నారు. ఈ సమావేశానంతరం కేసీఆర్, స్టాలిన్‌లు మీడియా ముందుకు వస్తారన్న ప్రచారం సాగింది. దీంతో ఆళ్వార్ పేట నివాసం వద్ద మీడియా హడావుడి పెరిగింది. అయితే, కేసీఆర్ మీడియాతో మాట్లాడకుండానే వెళ్లి పోయారు. స్టాలిన్ సైతం మీడియా ముందుకు రానప్పటికీ కాసేపటి తర్వాత తమ మధ్య సంప్రదింపులు, సమాలోచన కేవలం మర్యాద పూర్వకం మాత్రమేనని స్పష్టం చేస్తూ ప్రకటన విడుదల చేశారు.
విమర్శలు.. ఆరోపణల జోరు
కేసీఆర్–స్టాలిన్‌ల మధ్య భేటీ సమయంలో మీడియాలో విమర్శలు, ఆరోపణలు జోరుగానే సాగాయి. అన్నాడీఎంకే తరఫున మంత్రి జయకుమార్ పేర్కొంటూ, కాంగ్రెస్‌ను బెదిరించి దారిలోకి తెచ్చుకోవడమే కాదు. ఇప్పట్లోనే తన గుప్పెట్లోకి తీసుకునే వ్యూహంతో స్టాలిన్ ఉన్నట్టు ఆరోపించారు. అలాగే, కేసీఆర్ ద్వారా బీజేపీతో సంప్రదింపుల్లో ఉన్నట్టుగా తమకు సమాచారాలు ఉన్నాయని పేర్కొన్నారు. కేంద్రంలో బీజేపీకి మద్దతు ఇస్తే తమకు ఐదు కేబినెట్ సీట్లు ఇవ్వాలన్న డిమాండ్‌ను కేసీఆర్ ద్వారా ఢిల్లీకి చేరవేయడానికి వ్యూహరచన చేసి ఉన్నట్టు వ్యాఖ్యానించారు. బీజేపీ అధ్యక్షుడు తమిళిసై సౌందరరాజన్ పేర్కొంటూ, కేంద్రంలో బీజేపీ సర్కారు మళ్లీ అధికారంలోకి రావడం ఖాయం అని, ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా, అవన్నీ వృథా ప్రయత్నాలేనని వ్యాఖ్యానించారు.
ఇక, తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు కేఎస్ అళగిరి పేర్కొంటూ, మూడో ఫ్రంట్టో, ఫెడరల్ ఫ్రెంటుకో దేశంలో ఆస్కారం లేదన్నారు. డీఎంకే తన స్పష్టతను ఎప్పుడో తెలియజేసి ఉన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తెరగాలన్నారు. కేసీఆర్ ఓ రాష్ట్రానికి సీఎం అని, ఆయన తనతో భేటీకి వస్తున్నారని చెప్పగానే, తిరస్కరించే మనస్తత్వం స్టాలిన్‌కు లేదన్నారు. ఎవరు వచ్చినా ఆహ్వానించి, గౌరవించడం తమిళనాడు సంప్రదాయం అని అదే స్టాలిన్ చేశారన్నారు. స్టాలిన్‌ను ప్రాంతీయ పార్టీల ఏకం విషయంగా కేసీఆర్ ఆహ్వానించి ఉన్న పక్షంలో, అందుకు తగ్గ సమాధానాన్ని స్టాలిన్ ఇచ్చి ఉంటారన్నారు. రాహుల్‌ను ప్రధాని చేయడానికి తమతో కలిసి రావాలన్న ఆహ్వానాన్ని కేసీఆర్‌కు పలికినా పలికి ఉండవచ్చని చమత్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment