సాక్షి, అమరావతి : కర్నూలు జిల్లా టికెట్ల పంచాయితీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్దకు చేరింది. కర్నూలు అసెంబ్లీ టికెట్‌పై కొంతకాలంగా ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి... టీడీపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ తనయుడు టీజీ భరత్ మధ్య పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎస్వీ మోహన్ రెడ్డి గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి వచ్చారు. ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి నారా లోకేష్ కర్నూలులో పోటీ చేయాలని తాను చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నానన్నారు. ఎవరి మీద ఫిర్యాదు చేయడానికి తాను అమరావతి రాలేదని ఆయన స్పష్టం చేశారు. ఇవాళ జరిగే కర‍్నూలు పార్లమెంట్ సమీక్షలో అసెంబ్లీ సీటుపై స‍్పష్టత వస్తుందని ఎస్వీ మోహన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
కాగా గత కొంతకాలంగా నివురుగప్పిన నిప్పులా ఉన్న కర్నూలు అసెంబ్లీ టికెట్ రాజకీయం తెరమీదకు వచ్చింది. అసెంబ్లీ టికెట్ కోసం ప్రస్తుత ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి, మరోవైపు టీజీ భరత్ పోటీ పడుతున్నారు. అయితే జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి నారా లోకేష్... కర్నూలు టికెట్ ఎస్వీ మోహన్ రెడ్డికేనని ప్రకటించడం అసమ్మతి భగ్గుమంది. లోకేష్ ఏ హోదాతో టికెట్ కేటాయింపుపై ప్రకటన చేస్తారంటూ ఎంపీ టీజీ వెంకటేష్ అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
మరోవైపు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కుటుంబసభ్యులు ఈ నెల 28న టీడీపీ కండువా కప్పుకోనున్నారు. ఇక కోట్ల కుటుంబానికి కర్నూలు ఎంపీతో పాటు కర్నూలు అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని కేఈ సోదరులు టీడీపీ అధిష్టానం ముందు కొత్త ప్రతిపాదన చేయడంతో ఎస్వీ మోహన్ రెడ్డి ముందుగానే అప్రమత్తం అయ్యారు. తన టికెట్‌కు ఎసరు వస్తుందనే భయంతో ఆయన తాజాగా నారా లోకేష్ పేరు తెరమీదకు తీసుకువచ్చారు. లోకేష్ కర్నూలులో పోటీ చేస్తే తన స్వచ్ఛందంగా తప్పుకుంటానని వ్యాఖ్యలు చేశారు. కర్నూలు అసెంబ్లీ సీటు విషయంలో ఉన్న గందరగోళం నేపథ్యంలో ఎస్వీ మోహన్ రెడ్డి...ముఖ్యమంత్రితో భేటీ అయ్యేందుకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment