దేశమంతటా ఇదే చర్చ.. | Political Hi Tense At Delhi Amid YSRCP No Confidence Motion | Sakshi
Sakshi News home page

హోదా పోరు ; దేశమంతటా ఇదే చర్చ

Published Fri, Mar 16 2018 1:49 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

Political Hi Tense At Delhi Amid YSRCP No Confidence Motion - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ హక్కు ప్రత్యేక హోదా కోసం పట్టుసడలించకుండా వైఎస్సార్‌సీపీ కొనసాగించిన పోరు సత్ఫలితాలనిస్తోంది. హోదా ఇవ్వని కారణంగా కేంద్రంపై వైఎస్సార్‌సీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గురు, శుక్రవారాల్లో యావత్‌ జాతీయ మీడియా ఇదే అంశాన్ని ప్రధాన శీర్షికల్లో పొందుపర్చింది. టీడీపీ కూడా వైఎస్సార్‌సీపీ బాటనే అనుసరిస్తూ అవిశ్వాసం పెడతాని ప్రకటించడంతో రాబోయే రోజుల్లోనూ ‘ఏపీకి హోదా’ అంశమే హైలైట్‌ కానుంది.

సోమవారం మళ్లీ నోటీసులిస్తాం : శుక్రవారం సభ ఆర్డర్‌లో లేని కారణంగా వైఎస్సార్‌సీపీ ఇచ్చిన అవిశ్వాసం నోటీసులపై చర్చ చేపట్టలేకపోతున్నట్లు లోక్‌సభలో స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ప్రకటించారు. దీంతో సోమవారం తిరిగి నోటీసులు ఇస్తామని వైఎస్సార్‌సీపీ ఎంపీలు చెప్పారు. అవిశ్వాసంపై చర్చ జరగాల్సిందేనని, ఇందుకోసం ఎన్నిసార్లైనా నోటీసులు ఇచ్చేందుకు వెనుకాడబోమని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు.

హోదాకు జై కొట్టిన అన్ని పార్టీలు.. : అవిశ్వాసంపై లోక్‌సభ స్పీకర్‌కు గురువారమే  నోటీసులు ఇచ్చిన వైఎస్సార్‌సీపీ ఎంపీల బృందం.. అదేరోజు దాదాపు అన్ని పక్షాల నేతలను కలిసి మద్దతు కోరింది. కాంగ్రెస్‌, శివసేన, టీఎంసీ, సీపీఎం, సీపీఐ, ఎన్సీపీ, ఏఐఏడీఎంకే, ఆమ్‌ఆద్మీలు, బీజేడీ, టీఆర్‌ఎస్‌ పక్ష నేతలతోపాటు టీడీపీ పార్లమెంటరీ నేత తోట నర్సింహంను కూడా వైఎస్సార్‌సీపీ ఎంపీల బృందం కలిసింది. ఏపీ ఆకాంక్షను సమర్థిస్తామని  మెజారిటీ పక్షాలు ప్రకటించాయి. కానీ అంతలోనే టీడీపీ.. తాము ప్రత్యేకంగా తీర్మానం పెట్టబోతున్నట్లు ప్రకటించింది. వైఎస్సార్‌సీపీ తీర్మానానికి మద్దతిచ్చిన పక్షాల్లో కొన్ని టీడీపీ తీర్మానానికి కూడా మద్దతిస్తామని చెప్పాయి. ఒకవైపు వైఎస్సార్‌సీపీ తీర్మానానికి టీడీపీ మద్దతు ఇవ్వలేదు. అయినాసరే, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా టీడీపీ సహా ఎవరు అవిశ్వాసం పెట్టినా మద్దతు ఇస్తామని వైఎస్సార్‌సీపీ ప్రకటించడం గమనార్హం.

ఇది ప్రజల విజయం : ‘‘రాజకీయంగా వేరే మార్గం లేని పరిస్థితుల్లో, తప్పనిసరి పరిస్థితుల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని టీడీపీ మరోసారి అనుసరిస్తోంది.. ఇది ముమ్మాటికీ ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు, ప్రజాస్వామ్యం సాధించిన విజయం’’ అని తాజా పరిణామాలపై వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు. ‘‘ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అన్న పాలకుల నోటితో... కాదు, హోదా మాత్రమే ఆంధ్రప్రదేశ్‌కు సంజీవని అనిపించేలా చేసిన ఘనత ఒక్క వైఎస్సార్‌సీపీకే దక్కుతుందని, హోదా ఉద్యమాన్ని సజీవంగా నిలపడంలో, లెక్కకుమించిన కార్యక్రమాల ద్వారా ప్రజలను సంఘటితం చేయడంలో విజయం సాధించామని వైఎస్సార్‌సీపీ నేతలు అంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement