సౌండ్‌ పార్టీలు | Political Parties Cost Hikes in Election Campaign | Sakshi
Sakshi News home page

సౌండ్‌ పార్టీలు

Published Sat, Mar 30 2019 10:22 AM | Last Updated on Sat, Mar 30 2019 10:22 AM

Political Parties Cost Hikes in Election Campaign - Sakshi

ఇది ఓట్లు కొనే కాలం.. నోట్లకు ఓట్లు విసిరే గాలం.. మద్యం ఏరులై పారే సీజన్‌.. కానుకలు వరదై పోటెత్తే టైమ్‌.. అదే ఎన్నికల కాలం.. రాజకీయాలంటే డబ్బుదే అసలు ‘పవర్‌’. ధనబలం, కండబలం ఇవే ఎన్నికల్ని శాసించేవి. ఉత్తరాదిన కండబలానిదే మొదటి స్థానమైతే, దక్షిణాది రాష్ట్రాల్లో డబ్బున్నవాడిదే రాజ్యం. మొత్తమ్మీద దేశవ్యాప్తంగా అభ్యర్థుల చేతుల్లో కాసులు గలగలమంటేనే ఓట్లు జలజల రాలతాయి. కేవలం నోట్ల కట్టలే కాదు, మద్యం, బిర్యానీతో పాటు నిత్య జీవితంలో ఉపయోగపడే వస్తువులు కావేవీ కానుకకి అనర్హం. ఓటర్లను ప్రలోభ పెట్టడానికి రాజకీయ పార్టీలు, అభ్యర్థులు డబ్బుని వెదజల్లుతున్నారు. కానుకల్ని పంచుతున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని పరిమితులు విధించినా పట్టించుకునే వారే లేరు. హెలికాప్టర్‌ ప్రయాణాలు, కార్ల కాన్వాయ్‌లు, ప్రచార ఆర్భాటాలు.. ఇలా ఈసారి మన ఎన్నికల ఖర్చు తడిసి మోపెడు కానుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల వ్యయాన్ని తలదన్నేలా ఈసారి ఎన్నికల వ్యయం రూ.50 వేల కోట్లు దాటిపోతుందని న్యూఢిల్లీకి చెందిన సెంటర్‌ ఫర్‌ మీడియా స్టడీస్‌ అంచనా వేసింది.

ఖర్చు చూస్తే గుండె గుభేల్‌
ప్రచారం, వాణిజ్య ప్రకటనలు, ప్రయాణాలు.. ఎన్నికల్లో వీటికే అత్యంత ప్రాధాన్యం. ఎన్నికలకయ్యే మొత్తం వ్యయంలో అత్యధికంగా ఖర్చు పెట్టేది ప్రచారానికే. మొత్తం ఖర్చులో 59 శాతం ప్రచారానికే అవుతోంటే, ప్రయాణాలకి 21 శాతం ఖర్చు చేస్తున్నట్టు ఎన్నికల సంస్కరణ కోసం కృషి చేస్తున్న ఏడీఆర్‌ నివేదిక వెల్లడించింది.

సోషల్‌ మీడియా అందుబాటులోకి వచ్చాక రాజకీయ ప్రకటనలకయ్యే ఖర్చు తడిసి మోపెడవుతున్నట్టుగా సెంటర్‌ ఫర్‌ మీడియా స్టడీస్‌ చైర్మన్‌ ఎన్‌.భాస్కర్‌రావు వెల్లడించారు. 2014లో సోషల్‌ మీడియాలో వివిధ రాజకీయ పార్టీలు పెట్టిన ఖర్చు రూ.250 కోట్లయితే, ఈసారి అది రూ.5 వేల కోట్లు దాటిపోతుందని అంచనా.

 పేపర్‌ తెరిస్తే చాలు ఫలానా అభ్యర్థికి ఓటు వెయ్యండి అన్న అభ్యర్థనలే. టీవీ చానల్‌ తిప్పినా.. రాజకీయ పార్టీల ప్రకటనలే. దీనికయ్యే ఖర్చు ఈసారి చుక్కల్ని తాకనుంది. పార్టీల ఎన్నికల ఖర్చులో ఈ మొత్తమే అత్యధికం కానుంది. జెనిత్‌ ఇండియా అనే అడ్వర్టయిజింగ్‌ ఏజెన్సీ లెక్కల ప్రకారం ఈ ఖర్చు ఈసారి రూ.2,600 కోట్ల పై మాటేనని అంచనా.

ఫిబ్రవరిలో కేవలం ఫేస్‌బుక్‌ ప్రచారానికే రాజకీయ పార్టీలు రూ.4 కోట్లు ఖర్చు చేశాయి.

ఎన్నికల్లో ఫలితాల్ని తారుమారు చేయడానికి, ఓటర్లను గందరగోళ పరచడానికి ప్రత్యర్థి పార్టీలు అభ్యర్థి పేరుతో డమ్మీ అభ్యర్థుల్ని బరిలోకి దింపే దిగజారుడు రాజకీయాలు కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువైపోతున్నాయి. ఇండియా టుడే మ్యాగజైన్‌ అంచనాల ప్రకారం డమ్మీ అభ్యర్థుల్ని బరిలోకి దింపడానికి రూ.12 కోట్లు ఖర్చుచేస్తున్నాయట పార్టీలు.

ఎన్నికల ప్రచారంలో కానుకలే ఎక్కువ మంది ఓటర్లను ఆకర్షిస్తున్నాయని కాలిఫోర్ని యా యూనివర్సిటీ సర్వేలో వెల్లడైంది. కానుకలు పంచితే ఓటు కచ్చితంగా తమకే పడుతుందని 90 శాతం మంది రాజకీయ నాయకులు బలంగా నమ్ముతున్నట్టు ఆ సర్వే తెలిపింది. ఒకప్పుడు గొర్రెలు, బర్రెలు కూడా పంచేవారు. ఆ తర్వాత మిక్సీలు,

సైకిళ్లు ఇస్తామని హామీలు ఇస్తే, ఇప్పుడు కానుకలు కూడా హైటెక్కుగా మారాయి. ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు.. ఇలా ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకోవడానికి రాజకీయ పార్టీలు ఏమివ్వడానికైనా సిద్ధమైపోతున్నాయి.

కేవలం రాజకీయ పార్టీలు, అభ్యర్థులు మాత్రమే కాదు ఈసారి ఎన్నికల సంఘం చేస్తున్న ఖర్చు కూడా భారీగానే ఉంటోంది. ఉత్తరాన  హిమాచల్‌ప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో సముద్ర మట్టానికి 15 వేల అడుగులఎత్తులోనూ, పశ్చిమాన దట్టమైన అడవుల్లోని ఏజెన్సీ వాసుల కోసం, ఈశాన్య రాష్ట్రాల్లో నదులు, కొండలు, గుట్టలు దాటి పోలింగ్‌ బూత్‌లు ఏర్పాటు చేయడం ఎన్నికల సంఘానికి శక్తికి మించిన పనైపోతోంది. ఈసారి ఎన్నికల కోసం బడ్జెట్‌లోనే రూ.262 కోట్లు కేటాయించింది.

పరి‘మితి’ అంతంతే..
లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు ప్రచారం కోసం పెట్టే ఖర్చుపై కొన్ని పరిమితులున్నాయి. అభ్యర్థుల ఎన్నికల ఖర్చుపై నిఘా కోసం ఎన్నికల సంఘం అనేక చర్యలు తీసుకుంటోంది. కానీ ఏ అభ్యర్థి పరిమితికి లోబడి ఖర్చు చేస్తున్న దాఖలాలు ఎక్కడా లేవు.

తొలిసారి ఎన్నికల వ్యయ పర్యవేక్షకుల నియామకం
రాజకీయ పార్టీలు, అభ్యర్థులు విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్న 120 నియోజకవర్గాలను కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించింది. ఆయా నియోజకవర్గాలను పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా ఎన్నికల వ్యయ పరిశీలకులను నియమించే పనిలో పడింది. ఇప్పటికే మహారాష్ట్ర, తమిళనాడులో కొన్ని నియోజకవర్గాల్లో డబ్బుల్ని వెదజల్లుతూ ఉండడంతో ఆదాయ పన్ను శాఖకు చెందిన ఇద్దరు రిటైర్డ్‌ అధికారుల్ని ఎన్నికల వ్యయపరిశీలకులుగా ఆ రాష్ట్రాలకు పంపింది. ఇలా ఎన్నికల ఖర్చుని పర్యవేక్షించడానికి ఏకంగా పరిశీలకుల్ని నియమించడం ఎన్నికల చరిత్రలో ఇదే మొదటిసారి. అక్రమ మార్గాల్లో ఓటర్లపై మనీ, మద్యం, కానుకలు ఇచ్చేవారిపై ఓ కన్నేసి ఉంచడానికి 800 బృందాలను ఏర్పాటు చేయనుంది. మన తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్‌ రాష్ట్రాల్లో అత్యధికంగా పార్టీలు ఖర్చు చేస్తున్నాయి.

ఒకరిని మించి మరొకరు..
ఎన్నికలు, రాజకీయ వ్యవస్థలో సంస్కరణల కోసంకృషి చేసే అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రాటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) అంచనాల ప్రకారం ఆయా పార్టీలు చేస్తున్న ఎన్నికల ఖర్చు వివరాలు ఇలా ఉన్నాయి..

2016–17లో బీజేపీ ఎన్నికల ప్రచారానికి రూ.606 కోట్లు ఖర్చు చేస్తే, కాంగ్రెస్‌ పార్టీ రూ.149 కోట్లు ఖర్చు చేసింది.

భారత్‌లో అత్యంత ధనిక పార్టీ బీజేపీయే. గత మూడేళ్లలోనే ఆ పార్టీ ఆదాయం ఏకంగా 81 శాతం పెరిగింది. అదే సమయంలో కాంగ్రెస్‌ పార్టీ ఆదాయం 14 శాతం తగ్గింది.

కార్పొరేట్‌ సంస్థలే ఎన్నికల విరాళాలు ఎక్కువిస్తాయి. ఏడీఆర్‌ నివేదిక ప్రకారం 2017–2018 మధ్య వీటి నుంచి బీజేపీకి రూ.400 కోట్లు, కాంగ్రెస్‌కు రూ.19 కోట్లు వచ్చాయి.

వివిధ పార్టీలకు వ్యక్తిగతంగా వచ్చే విరాళాలే 10 శాతంగా ఉన్నాయి. 2017–18లో 2,772 మంది రూ.47 కోట్లు విరాళంగా ఇచ్చారు.

తడిసిమోపెడు..
రూ.50 వేల కోట్లు్లప్రస్తుత ఎన్నికల వ్యయం (అంచనా)
రూ. 262 కోట్లు్ల ఈసారి ఎన్నికల నిర్వహణకు కేటాయించిన బడ్జెట్‌
రూ.1,200 కోట్లు2014 ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌ వాణిజ్య ప్రకటనలకు చేసిన ఖర్చు
రూ. 2,600 కోట్లుప్రస్తుత ఎన్నికల్లో ప్రధాన పార్టీల వాణిజ్య ప్రకటనల ఖర్చు (అంచనా)
రూ.70 లక్షలుఈసారి ఎన్నికల్లో పెద్ద రాష్ట్రాల్లోపోటీచేసే అభ్యర్థులఖర్చు పరిమితి
రూ.54 లక్షలుచిన్న రాష్ట్రాల్లో అభ్యర్థుల ఖర్చు పరిమితి
రూ.1,034 కోట్లు2016–17 ఆర్థిక సంవత్సరానికిబీజేపీ ఆదాయం
రూ.225 కోట్లు్ల2016–17 ఆర్థిక సంవత్సరంలోకాంగ్రెస్‌ పార్టీ ఆదాయం
120ఈసారి ఎన్నికల్లో ధన ప్రవాహం ఎక్కువగా ఉంటాయని ఈసీ గుర్తించిన నియోజకవర్గాల సంఖ్య

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement