వరుపుల సుబ్బారావు , యనమల రామకృష్ణుడు ,యనమల కృష్ణుడు
సాక్షి ప్రతినిధి, కాకినాడ : జంప్ జిలానీలకు ఝలక్ ఇచ్చే రాజకీయాలు టీడీపీలో ఊపందుకున్నాయి. ముందొచ్చిన చెవులు కన్నా వెనకొచ్చిన కొమ్ములే మిన్న అన్నట్టుగా పార్టీ ఫిరాయించిన నేతలకే అధిష్టానం పెద్దపీట వేయడంతో సీనియర్లు వ్యూహం మార్చుతున్నారు. స్థానికంగా దెబ్బకొడితే దారికొస్తారని ఫిరాయింపు నేతలకు ప్రత్యామ్నాయంగా పావులు కదుపుతున్నారు. ఆధిపత్యానికి భంగం కలిగే పరిణామాలు చోటుచేసుకోవడంతోపాటు అస్థిత్వం కోల్పోయి ప్రమాదంలో ఉన్నామని గ్రహించిన యనమల రామకృష్ణుడు తన రాజకీయ చతురతకు పదునుపెడుతున్నారు. ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావుపై తొలి బాణం వదులుతున్నారు.
ఫిరాయింపు నేతల రాకతో ప్రతికూల పరిస్థితులు
ఫిరాయింపు నేతలొచ్చాక సీనియర్ నేత, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడినే లక్ష్యంగా టీడీపీలో వ్యూహాలు ఊపందుకున్నాయి. అందుకు తగ్గట్టుగానే టీడీపీ యువనేత లోకేష్‌బాబు డైరెక్షన్లో యనమల హవా తగ్గించే యత్నాలు ప్రారంభమయ్యాయి. ఒక్కొక్కటీ కార్యరూపం దాల్చాయి. యనమల అడ్డుకట్ట వేసినప్పటికీ జ్యోతుల నవీన్‌కు జెడ్పీ చైర్మన్ పీఠం కట్టబెట్టారు. అన్నవరం దేవస్థానం ఈఓ నియామకం విషయం ఏమైందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కాకినాడ మేయర్ విషయంలోనూ తన మాట చెల్లుబాటు కాలేదు. చివరకు కాకినాడ డీఎస్పీ పోస్టు నియామకంలో కూడా యనమలకు ప్రాధాన్యతలేకుండా పోయింది. తొండంగి మండలంలో నడుస్తున్న అక్రమ హేచరీల విషయంలో ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి.
మేల్కొన్న యనమల...
ఇప్పుడీ పరిణామాలే యనమలను రెచ్చగొట్టేలా చేస్తున్నాయని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఇలాగే వదిలేస్తే తన అస్థిత్వంకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని భావించిన యనమల ఫిరాయింపు నేతలకు చెక్ పెట్టేందుకు శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది. దానిలో భాగంగానే పక్కనే ఉన్న ప్రత్తిపాడు నియోజకవర్గంపై గురిపెట్టారు. తనను దెబ్బకొట్టే రాజకీయాలు చేస్తున్న వారిలో ఒకరైన వరుపుల సుబ్బారావును లక్ష్యంగా చేసుకున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే యాదవ సామాజిక వర్గ నేతలతో మంతనాలు జరుపుతూ ప్రత్యామ్నాయ రాజకీయాలకు తెరలేపారు.
రంగంలోకి తమ్ముడు –అంతర్గతంగా రగలిపోతున్న వరుపుల
అన్న ఆదేశాలతో తమ్ముడు కృష్ణుడు బరిలోకి దిగారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలోని నాలుగు మండలాల యాదవుల ఐక్యత పేరుతో సభలు, సమావేశాలు పెడుతున్నారు. ఇప్పటికే శంఖవరం మండలం కత్తిపూడి సమీపంలో ఇటీవల యనమల కృష్ణుడి సారథ్యంలో జిల్లా యాదవ మహాసభను నిర్వహించడం, దానికి ఆయన కుటుంబ సభ్యులే ప్రాతినిధ్యం వహించడం పాఠకులకు విదితమే. ఈ సభకు నియోజకవర్గం నలుమూలల్లోని తమ వర్గానికి చెందిన వారందర్నీ రప్పించారు. ఆ తర్వాత రౌతులపూడి మండలంలో యాదవ ప్రాబల్యం ఉన్న ఎస్.అగ్రహారం, గిడజాం, లచ్చిరెడ్డిపాలెం, రౌతులపూడి, శృంగవరం గ్రామాల్లో కృష్ణాష్టమి, దుర్గాష్టమి వేడుకల పేరుతో యనమల కృష్ణుడు విస్తృత పర్యటనలు చేయడం మరింత చర్చనీయాంశమైంది.
అంతేకాకుండా అదే కులానికి చెందిన శంఖవరం మండల టీడీపీ అధ్యక్షుడు బద్ది రామారావును అన్ని రకాలుగా ప్రోత్సహిస్తున్నట్లు సమాచారం. శంఖవరం, రౌతులపూడి మండలాల్లో యనమల రామకృష్ణుడు ఎక్కడ పర్యటించినా తనే వెన్నంటి ఉండి నడిపిస్తున్నారు. ఇంత జరుగుతున్నా వరుపుల ఏమీ అనలేని పరిస్థితి ఏర్పడింది. నియోజకవర్గంలో చోటుచేసుకున్న ప్రత్యామ్నాయ రాజకీయాలతో అంతర్గతంగా రగలిపోతున్నట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment