
సాక్షి, హైదరాబాద్ : సత్తుపల్లి, అశ్వారావుపేటలను కలిపి ఒక జిల్లా ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గవర్నర్ నరసింహన్ చేసిన ప్రసంగంలో అర్ధ సత్యాలే ఉన్నాయన్నారు. మిషన్ భగీరథ ప్రాజెక్టు కోసం తవ్విన గుంతలను ఇప్పటికీ పూడ్చలేదని పేర్కొన్నారు. వర్షాభావ పరిస్థితుల వల్ల 18 జిల్లాలో రైతుల పరిస్థితి బాగాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా పెంచిన పెన్షన్ ఎప్పటి నుంచి ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. అమాయక ప్రజలను మోసం చేసి అధిక వడ్డీలు వసూలు చేస్తున్న వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విఙ్ఞప్తి చేశారు. మంచి రేవులలో ఉన్న వాటర్ బాడీని కాపాడాలని కేసీఆర్‌ను కోరగా ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు.