
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 20 జిల్లా పరిషత్ చైర్మన్ స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ముందుకెళుతున్నామని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు పొన్నం ప్రభాకర్, జెట్టి కుసుమకుమార్ తెలిపారు. స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా తమ పార్టీ సిద్ధంగా ఉందని వెల్లడించారు. బుధవారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ఎవరూ అధైర్యపడవద్దని అన్నారు. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఈ ఎన్నికల్లో కేడర్‌కు తోడుగా ఉంటారని చెప్పారు. పొన్నం మాట్లాడుతూ.. మండల, జిల్లా పరిషత్‌లకు నేరుగా ఎన్నిక జరపాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోం దన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఇదే విధానాన్ని తీసుకువస్తామని వెల్లడించారు.
32 జెడ్పీ పీఠాలు దక్కించుకునే పరిస్థితి టీఆర్‌ఎస్‌కు ఉంటే ఫిరాయింపులను ఎందుకు ప్రోత్సహించాల్సి వస్తోందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ఫిరాయింపులను నివారించేందుకే కాంగ్రెస్ తరఫున పోటీ చేసే అభ్యర్థులు అఫిడవిట్ ఇవ్వాలనే విధానాన్ని తీసుకువస్తున్నామని చెప్పారు. కుసుమకుమార్ మాట్లాడుతూ.. పార్లమెంటు ఎన్నికల తర్వాత ప్రజల నాడి కాంగ్రెస్ వైపు ఉందని టీఆర్‌ఎస్‌కు అర్థమైందని వ్యాఖ్యానించారు. అందుకే లోక్‌సభ ఎన్నికల ఫలితాలు రాకముందే స్థానిక ఎన్నికలను నిర్వహించాలని యత్నిస్తోందన్నారు. ఈ సమావేశంలో టీపీసీసీ అధికార ప్రతినిధి ఇందిరాశోభన్, పెద్దపల్లి డీసీసీ అధ్యక్షుడు ఈర్ల కొమురయ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment