ప్రజాసంకల్పయాత్రజన ప్రభంజనమైంది...కృష్ణమ్మ ఒడి నుంచిగోదారమ్మ వాకిటకాలిడుతున్న జననేతకువీడుకోలంటూ.. వీడలేమంటూ‘జన’ హారతి పట్టింది..విజయుడివై తిరిగి రమ్మంటూఆశీర్వదించింది. !!
సాక్షి, అమరావతిబ్యూరో : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్పయాత్రకు కృష్ణా జిల్లా వాసులు బ్రహ్మరథం పట్టారు. జిల్లాలో ఆయన పాదయాత్ర అంచనాలను మించి విజయవంతం కావడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలెత్తుతోంది. ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన మోసం, హోదా కోసం నాలుగేళ్లుగా అలుపెరుగని పోరాటం చేస్తున్న జననేత జగన్‌కు జిల్లా వాసులు ప్రజాసంకల్పయాత్రలో వెన్నుదన్నుగా నిలిచి భారీ స్వాగతాలతో ఆయన అడుగులో అడుగు వేశారు. ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్సార్ కాంగ్రెస్, విపక్షాలు, ప్రజా సంఘాలు కలిసి చేసిన ధర్నాలు, నిరసనలకు పాదయాత్ర నుంచే సంఘీభావం తెలిపారు. ఒక వైపు సీఎం చంద్రబాబు హోదా విషయంలో ప్రజాగ్రహాన్ని చవిచూసి యూటర్న్ తీసుకోని చేసిన ధర్మపోరాట దీక్షల పేరుతో చేస్తున్న నాటకాలను ప్రజలకు వివరించారు. రాష్ట్రంలో మహిళలు, బాలికలపై దాడులు, అత్యాచారాలను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ చేసి మహిళలకు అండగా తానున్నానంటూ భరోసా కల్పించారు.
పోటెత్తిన జనసంద్రం....
వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్పయాత్రకు జిల్లాలో జననీరాజనాలు పలికారు. గుంటూరు జిల్లా తాడేపల్లి నుంచి ఏప్రిల్ 14న ఆయన కనకదుర్గమ్మ వారధి మీదుగా విజయవాడలో ప్రవేశించారు. రాజన్న బిడ్డ వస్తున్నాడంటూ వేలాదిమంది అడుగులో అడుగు వేయడంతో కనకదుర్గమ్మ వారధి కంపించింది. అక్కడ నుంచి కైకలూరు వరకు జిల్లా అంతటా వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి జననీరాజనాలు పలికారు. దారిపొడవునా అవ్వాతాతాలు, మహిళలు, యువత ఆయన్ని కలిసి తమ కష్టాలు చెప్పుకున్నారు. పేదలు, రైతులు, చిరుద్యోగులు, వ్యాపారులు, వివిధ కుల వృత్తులవారు, ప్రజా సంఘాలు, విద్యార్థులు, యువత...ఇలా అన్నివర్గాల వారు జననేతను కలసి తాము పడే బాధలను వివరించారు. అధికారపార్టీ నేతల కబ్జాలు, ఇసుక దోపిడీ తదితర అంశాలను ఆయన దృష్టికి తెచ్చారు. ఇల్లూ, పింఛన్లు ఇవ్వడం లేదని, ఆరోగ్యశ్రీ వర్తించడం లేదని, ఫీజు రీయింబర్స్‌మెంట్ రావడం లేదని, ఉద్యోగాలు లేవని... తాగు, సాగునీరు అందించడం లేదని సమస్యలు ఏకరువు పెట్టారు. వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అందరి సమస్యలను ఓపిగ్గా వింటూ... వారిని ఆదుకుంటానని ధైర్యం చెప్పారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తే రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తామని, అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తామమని హామీనిచ్చారు. జిల్లాకు ఎన్టీ రామారావు పేరు పెడతామని నిమ్మకూరులో ప్రకటించడంతో రాష్ట్ర వ్యాప్తంగా హార్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.
కృష్ణా జిల్లాలో ప్రజాసంకల్పయాత్ర ఇలా..
వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి కృష్ణా జిల్లాలో 25 రోజులపాటు ప్రజాసంకల్పయాత్ర నిర్వహించారు. ఆయన జిల్లాలో మొత్తం 239 కి.మీ. పాదయాత్ర చేశారు. 12 నియోజకవర్గాల్లో 18 మండలాల్లో పాదయాత్ర సాగింది. ప్రతి నియోజకవర్గంలో ప్రజలు నీరాజనం పలికారు. దారిపొడవునా జననేతతో సెల్ఫీలు దిగేందుకు విద్యార్థులు, యువత ఎగబడ్డారు. ఆయనతో కరచాలం చేసేందుకు పోటీ పడ్డారు. చిన్నారులు నుంచి మహిళలు, యువకులు, వృద్ధులు తమ సమస్యలు వివరిస్తూ ఆయన అడుగులో అడుగులు వేశారు. మండు టెండను లెక్కచేయకుండా తమ కష్టాలు కళ్లారా చూసేందుకు వచ్చారని ఊరూవాడా ఏకమై ఘనస్వాగతాలు పలికారు. వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి కృష్ణా జిల్లాలో 10 బహిరంగసభల్లో ప్రసంగించారు. నాలుగు ఆత్మీయ సమ్మేళనాలు (న్యాయవాదులు, నాయీబ్రాహ్మణులు, ఎస్సీలు, కలంకారి వృత్తిదారులు) నిర్వహించారు. అన్ని వర్గాలకు న్యాయం చేస్తానని భరోసా ఇచ్చారు.
పాదయాత్రలో పాల్గొన్న పార్టీ నేతల పేర్లు
చివరి రోజు సంకల్పయాత్రలో ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, పార్టీ నేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సామినేని ఉధయభాను, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పార్టీ నేతలు , వంగవీటి రాధా, యర్లగడ్డ వెంకట్రావు, కైలే అనిల్‌కుమార్, కైకలూరు పార్టీ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్), ఏలూరు పార్లమెంటు సమన్వయకర్త కోటగిరిశ్రీధర్ ఉన్నారు.
కైకలూరు మండలంలో...
గుక్కెడు నీరు లేక గొంతులు తడుపుకోలేకపోతున్నామన్న మహిళలు, ఉద్యోగాల కోసం ఉన్నవారికి దూరమవుతున్నామన్న యువత, కుటుంబ అవసరాల కోసం దాచుకున్న సొమ్మును దోచుకున్నారన్న ఆడపడచులు.. నెలల కాలం వేతనాలు లేక ఆకలి కేకలు పెడుతున్నామన్న ఉద్యోగులు, చేపల వేటలేక పస్తులుంటున్నామన్న మత్స్యకారులు.. ఇలా ఎందరో తమ సమస్యలను జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముందు ఏకరువు పెట్టారు..వారి సమస్యలు వింటూ జననేత «వారికి దైర్యం చెపుతూ అందరికీ అండగా నేనుంటానని భరోసా కల్పించారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్పయాత్ర ఆదివారం కైకలూరు నియోజకవర్గంలో కొనసాగింది.. జననేతకు దారిపొడవునా వేలాది మంది ప్రజలు ఎదురేగి స్వాగతం పలికారు. కైకలూరు మండలంలోని కాకతీయ నగర్ వద్ద ఆదివారం ఉదయం పాదయాత్ర ప్రారంభించారు. వేలాది మంది జనసందోహం నడుమ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర దెయ్యంపాడు, చింతపాడు, కొవ్వడలంక, మనుగులూరు మీదగా కొనసాగింది.
కృష్ణా జిల్లా ప్రజాసంకల్పయాత్రలో టీడీపీకి చెందిన కీలక నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో చేరారు. మాజీ ఎమ్మెల్యేలు యలమంచిలి రవి, బీవీ రమణమూర్తి రాజు (కన్నబాబు–విశాఖ), కాటసాని రాంభూపాల్ రెడ్డి (కర్నూలు) మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వరరావు, ఆయన కుమారుడు కృష్ణ ప్రసాద్‌లతో పాటు పలువురు నేతలు , కార్యకర్తలు వైఎస్సార్ సీపీ చేరారు. కృష్ణా జిల్లాలో పాదయాత్ర విజయవంతం కావడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలెత్తుతోంది.
Comments
Please login to add a commentAdd a comment