Highlights of Praja Sankalpa Yatra | YS Jagan Padayatra From Beginning To End - Sakshi
Sakshi News home page

ఘన చరితం 3648 కి.మీ.

Published Wed, Jan 9 2019 4:49 AM | Last Updated on Wed, Jan 9 2019 10:48 AM

PrajaSankalpaYatra Started in Idupulapaya and Ending in Ichchapuram - Sakshi

జనం మధ్యే నివాసం.. జనంతోనే సహవాసం.. జనం కష్టాలు తెలుసుకోవడమే లక్ష్యం.. జనం కన్నీళ్లు తుడవడమే కర్తవ్యం.. ఒక్క రోజు కాదు.. రెండు రోజులు కాదు.. ఏడాదికిపైగా ప్రజలతో మమేకమైన చారిత్రక ఘట్టమిది. ఏకంగా 3,648 కిలోమీటర్లు సాగిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, విపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజా సంకల్పమిది. మండుటెండైతేనేం..జోరువానైతేనేం.. ఎముకలు కొరికే చలైతేనేం.. లెక్క చేయలేదు.. తాడిత, పీడిత, బడుగు,బలహీన వర్గాల జనావళి గుండె గొంతుక వినాలన్న ఆయన కోరికను పరిపుష్టం చేసుకున్నారు..జన హృదయాల్లోంచి వెల్లువలా వచ్చిన కష్టాల ప్రవాహాన్ని ఒడిసి పట్టుకుని నేనున్నానంటూ భరోసా ఇచ్చారు.. నాలుగున్నరేళ్లుగా అనునిత్యం కష్ట నష్టాలతో అలసిన గుండెల్లో ధైర్యం నింపారు.. కొద్ది రోజుల్లో మంచి జరగనుందనే నమ్మకాన్ని కలిగించారు. అన్ని సమస్యలకూ పరిష్కార మార్గాన్ని అన్వేషించడమే ఆయన ఆశయం. ఈ ఆశయం మహోన్నతం. 

ప్రజాసేవలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా చిరునవ్వుతో ఎదుర్కొంటా.. గుండె నిబ్బరాన్ని కోల్పోవడం రాజనీతిజ్ఞత కాదు.. నమ్మిన సిద్ధాంతానికి అనుగుణంగా తొణుకుబెణుకు లేకుండా ముందుకు 
సాగడమే నేర్చుకున్నా.
  
 – డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి 

సాక్షి, అమరావతి: ఐదేళ్లకు పైగా రాష్ట్రాన్ని జన రంజకంగా శాసించిన ఓ పెను సంచలనం (డాక్టర్‌ వైఎస్సార్‌) అనూహ్యంగా ఆగిపోయింది. ప్రజల మనోభావాల పేరిట రాష్ట్రం అస్తవ్యస్తమైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రెండు ముక్కలైంది. అవశేష ఆంధ్రప్రదేశ్‌లో అధికారాన్ని చేపట్టిన పాలకులు జన జీవితంతో చెలగాటం ఆడడం మొదలుపెట్టి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న వేళ.. ‘మానవుడే నా సందేశం, మనుష్యుడే నా సంగీతం’.. అంటూ ఓ యువకెరటం జయకేతనాన్ని చేపట్టి ప్రజా సంకల్పయాత్రను చేపట్టింది. పేదవాడి కడుపునింపి.. తిండి, బట్ట, గూడు కల్పించాలన్న ఉదాత్తమైన ఆశయంతో.. చుట్టూ శేషాచలం కొండలు, మధ్యలో లోయ, ఆహ్లాదకరమైన వాతావరణంలో.. డాక్టర్‌ వైఎస్సార్‌కు అత్యంత ఇష్టమైన ఇడుపులపాయ ఎస్టేట్‌ నుంచి కదిలిన యాత్రికుడు ఈనెల 9న ఇచ్ఛాపురంలో తన పాదముద్రలకు విరామం ఇవ్వనున్నాడు. ఆ యాత్రికుడే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు. తొలి అడుగుతో ప్రారంభమైన యాత్ర మహాయాత్రగా ఎలా మారిందో అదేస్థాయిలో సభలు, సమావేశాలు జరిగాయి. ఇడుపులపాయ వద్ద ఏ స్థాయిలో జరిగిందో అంతకుమించి ప్రతిచోటా సభలు జరిగాయి. 

అక్కున చేర్చుకున్న జనం 
డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి తనయుడిగా జగన్‌కు ఉన్న పేరు ప్రతిష్టలు వేరు.. ప్రజాసంకల్ప యాత్ర ద్వారా జగన్‌ ఎదిగిన తీరు వేరు. ప్రజలలో విశ్వాసాన్ని ప్రోదిచేసిన ఆయన ప్రతిభ అనన్యం. గతానికి భిన్నంగా ఆయన పొందిన గుర్తింపు అద్భుతం. ఎదురులేని నేతగా జనం మదిలో నిలిచిపోయారు. తండ్రిని మించిన తనయుడయ్యారు. ప్రజలు ఆయన్ను ప్రేమించి అక్కున చేర్చుకున్నారు. ప్రేమాభిమానాలు చూపారు. అనురాగ ఆత్మీయతలను పంచారు. తాను ప్రసంగించిన సభల్లో చెప్పిన అంశాలు ప్రత్యేకించి నవరత్నాలు ప్రజల్ని ఆలోచింపజేశాయి. వ్యవసాయ సంక్షోభం, రైతుల ఆత్మహత్యలు, అవ్వాతాతల పింఛన్లు, వైఎస్సార్‌ చేయూత వంటి అంశాలను ఆయన జనంలోకి చొచ్చుకుపోయేలా చేయగలిగారు. జనం కోసం జనం మధ్య జనంతోనే అనే వాటికి సాక్షర రూపంగా నిలవగలిగారు. ఫలితంగా మహానేత వైఎస్సార్‌ను చూసిన కళ్లు జగన్‌ను చూడడం అలవర్చుకున్నాయి. సుదీర్ఘ యాత్రతో ఆయన అందరి వాడయ్యారు.  

జనవారధుల్లా కృష్ణా, గోదావరి వంతెనలు 
ప్రజా సంకల్పయాత్ర గుంటూరు జిల్లా దాటి కృష్ణమ్మ అంచులకు చేరినప్పుడు నదీతీరాన జన కెరటం ఎగిసిపడింది. కనకదుర్గమ్మ వారధి ప్రజల పదఘట్టనలతో ఊగిపోయిన తీరు, ఆ తర్వాత ఇంద్రకీలాద్రి దిగువన సభ జరిగిన వైనం బెజవాడ చరిత్రలో మరువలేనిది. ఇదేననుకుంటే దానికి మించి ఉభయ గోదావరి జిల్లాల వారధి అయిన గోదావరి వంతెన జనప్రభంజనమైంది. ఉభయ గోదావరి జిల్లాలలో జరిగిన ప్రతీ సభా దేనికదే సాటి అయింది. ఈ సభలకు కులాలు, మతాలు అడ్డుకాలేదు. చిన్నాపెద్దా తేడా లేకుండాపోయాయి. ప్రతి గుండే జగన్నినాదంతో ప్రతిధ్వనించింది. 

రొటీన్‌కు భిన్నంగా ప్రసంగం 
రాష్ట్ర రాజకీయ యవనికపై వైఎస్‌ జగన్‌ తనదైన ముద్ర వేసుకున్నారు. ఆప్యాయతకు, అనురాగానికి, స్నేహానికీ, రాష్ట్రాభివృద్ధికి, సంక్షేమానికి ప్రతీకగా నిలిచారు. జరిగిన ప్రతి సభలో తనదైన ముద్ర వేసుకున్నారు. అందరిలా మైకు పట్టుకోగానే సోదరీ సోదరులారా అనే దానికి బదులు ఒక చేత్తో మైకు పట్టుకుని మరో చేత్తో టక్‌ టక్‌ టక్‌మని మైక్‌తో శబ్ధం చేస్తూ.. ఏ ఊరులో సభ జరుగుతుందో ఆ ఊరి పేరు చెప్పడం జగన్‌ శైలి. ఆ ఊరితో సామీప్యతను, అనుబంధాన్ని తెలియజేసేందుకు ఇది ఉపయోగపడుతుందని గట్టిగా విశ్వసించే జగన్‌ ఆ పని చేసేవారు. సభ ముగింపులో ఆయన చేసే వినతి ప్రజల్ని ఆకట్టుకునేది. మీ బిడ్డగా వస్తున్న జగన్‌కు అండగా నిలవండి, ఆశీర్వదించండి, తోడుగా ఉండండని ఆయన చేసే వినతి ఎంతో వినయ వినమ్రతలను వ్యక్తం చేసేలా ఉండేది. మరోవైపు.. జగన్‌ మైకు పట్టుకున్నది మొదలు ముగించే వరకూ సభా ప్రాంగణాలు జగన్నినాదంతో మార్మోగేవి. కాబోయే సీఎం అంటూ యువత కేరింతలు కొట్టేది. అడుగడుగో మా పెద్దకొడుకు అని అవ్వాతాతలు మురిసిపోయేవారు. అన్నా, జగనన్నా, మేమంతా నీ వెంటే అంటూ అక్కచెల్లెమ్మలు జేజేలు పలికేవారు.  

ఇడుపులపాయ నుంచి మొదలై.. 
నవంబర్‌ 6, 2017.. 
చరిత్రాత్మక ప్రజాసంకల్ప యాత్రకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టిన రోజది. ప్రకృతి ఆశీర్వదిస్తున్నట్టు ఓ పక్క చిరుజల్లులు, మరోపక్క మాతృమూర్తి విజయమ్మ ఆశీస్సులు, అక్కచెల్లెమ్మల ఆత్మీయానురాగాలు, అశేష జనవాహిని మధ్య డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఘాట్‌ వద్ద నివాళులు అర్పించి ప్రజా సంకల్పయాత్ర మొదలు పెట్టింది మొదలు ఈనాటి వరకు వెనుదిరిగి చూడలేదు. వడలో, కడు జడిలో, పెను చలిలో, చివరకు విచ్చుకత్తులు కుత్తుకను తెగనరికేందుకు ప్రయత్నించినా అలుపు, సొలుపు లేకుండా అప్రతిహతంగా సాగిన యాత్ర ముగింపు దశకు వచ్చింది. నాడు ప్రారంభ సభ ఇడుపులపాయలో జరిగితే నేడు ముగింపు సభ ఇచ్ఛాపురంలో జరగనుంది. ప్రజల మనిషిగా వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఎంతటి కీర్తి గడించారో.. ఆయన కుమారునిగా జగన్‌ అంతే గుర్తింపు తెచ్చుకున్నారు. తనను నమ్ముకున్న వారికి, తాను నమ్మిన వారికి జగన్‌ అభయ ప్రదాతగా నిలిచారు. అందువల్లే ఆయన సభలకు అడుగడుగునా జనం పోటెత్తారు. నీరాజనాలు పలికారు. మాట తప్పడం మడమ తిప్పడం తన రక్తంలోనే లేదని గర్వంగా చెప్పుకోవడమే కాకుండా అఖిలాంధ్ర ప్రజానీకానికి ఆయన అన్నగా నిలిచారు. అక్కచెల్లెమ్మలకు తోబుట్టువయ్యారు. అన్నదమ్ములకు ఆత్మబంధువయ్యారు. 

ఏ సభకు ఆ సభే సాటి 
జగన్‌మోహన్‌రెడ్డి 134 నియోజకవర్గాలలో పర్యటిస్తే 124 బహిరంగ సభలలో ప్రసంగించారు. ఒక సభ బాగా జరిగింది మరొకటి బాగా జరగలేదనడానికి వీల్లేదు. దేనికదే సాటి. ప్రతీ సభా ఒక ప్రత్యేకతను చాటింది. సభకు గంట ముందు పెద్దగా అలికిడి లేని సభా ప్రాంతాలు జగన్‌ రాకకు సరిగ్గా అరగంటకు ముందు ఇసుకవేస్తే రాలనట్టుగా తయారయ్యేవి. కట్టలు తెగిన నదీ ప్రవాహం మాదిరి జనం పోటెత్తేవారు. మేడలు, మిద్దెలు, చెట్టు చేమలు జనంతో నిండిపోయేవి. సభ జరిగిన తర్వాత ఆయా ప్రాంగణాలన్నీ తెగిపోయిన చెప్పులు, చిరిగిపోయిన చొక్కాలు, చిందరవందరగా కాగితాలు, బెలూన్లతో నిండిపోయేవి. కాలాలతో నిమిత్తం లేకుండా సభలు జరిగిన తీరు ప్రముఖుల ప్రశంసలు, మన్ననలు పొందాయి. జడివాన కురుస్తున్నా తూర్పు గోదావరి, విశాఖ జిల్లాలలో పర్యటన, బహిరంగ సభలు ఆగలేదు. కుండపోతగా వర్షం పడుతున్నా యలమంచిలి, నర్సీపట్నంలో ప్రజలు జగన్‌ మాట్లాడేవరకు పోబోమని భీష్మించిన తీరు ఇప్పటికీ ఆ ప్రాంతాలలో చెప్పుకుంటుంటారు. ఎండలు మాడ్చేస్తున్నా, తుపాన్లతో ఊళ్లకు ఊళ్లను ఖాళీ చేస్తున్నా తాను మాత్రం తన సంకల్పాన్ని మరువక రేపటి గురించి ఆలోచించారే తప్ప తనకు ఏమవుతుందోనని భయపడలేదు.  

ఆకట్టుకున్న పిట్టకథలు 
ఏదైనా ప్రసంగం ఆకట్టుకోవాలంటే స్థానిక సామెతలు, పిట్టకథలు, పోలికలు అత్యంత అవశ్యం. వేయి పదాల్లో చెప్పలేని విషయాన్ని ఒక్క ఫొటోతో చెప్పినట్లే ఒక్క సామెతతో వంద విషయాలను చెప్పవచ్చు. రెయిన్‌గన్లతో కరువును జయించాను అని చంద్రబాబు పదేపదే చెప్పే విషయాన్ని పిట్టలదొర కథతో పోల్చి చెప్పిన తీరు సభికుల్ని విశేషంగా ఆకట్టుకుంది. కట్టె తుపాకీ పేలుతుందా? అనే అర్థం వచ్చేలా ప్రత్యక్ష సాక్షులతో విషయం చెప్పించారు. జగన్‌ చెప్పిన కొండచిలువ, రైతు కథ.. చంద్రబాబు చెప్పే అబద్ధాలకు, మోసాలకు అద్దంపట్టాయి. తిత్లీ తుపానుపై గోరంత సాయంచేసి కొండంత ప్రచారం చేసుకున్న వైనాన్ని శవాలపై చిల్లర ఏరుకునే సామెతతో పోల్చిన తీరు కూడా సభికుల ప్రశంసలందుకుంది. బీజేపీ, చంద్రబాబు కలిసి నాలుగేళ్లు చిలకా గోరింకల్లా కాపురం చేయడంపై జగన్‌ చేసిన వ్యాఖ్యలు ప్రజల హర్షామోదాలు పొందాయి. పురాణాలు, ఇతిహాసాల నుంచి తీసుకున్న అనేక అంశాలను ప్రస్తుత పరిస్థితులకు అన్వయిస్తూ చెప్పిన కథలు, సామెతలు జగన్‌ సభల్లో హైలెట్‌గా చెప్పవచ్చు. 

మరుగున పడిన అంశాలెన్నో కావాలిప్పుడు 
చరిత్ర మరుగున పడి కనిపించని ఎన్నో విషయాలను జగన్‌ తెరపైకి తెచ్చారు. బడుగు, బలహీన, అణగారిన వర్గాలకు ఈ సభలను వారి గొంతుకగా చేశారు. చట్టసభల్లో ప్రాతినిధ్యంలేని వివిధ వర్గాలకు చోటు కల్పిస్తానన్నారు. విస్మరించిన శ్రేణులను గుర్తిస్తానన్నారు. ప్రజాస్వామ్యాన్ని పట్టపగలు నడిబజార్లో ఖూనీ చేస్తున్న తీరుతో మనస్సు నొచ్చుకుని పాదయాత్ర చేపట్టిన జగన్‌.. ఆ బజార్లనే బహిరంగ వేదికలుగా మలిచారు. ప్రజల ప్రాతినిధ్యం ఉండేలా పీపుల్స్‌ అసెంబ్లీలను సృష్టించారు. అసెంబ్లీలో మాదిరి అడుగడుగునా ఆటంకాలు, మైక్‌ కట్లు లేకుండా తాను చెప్పాలనుకున్నది సూటిగా ప్రజలకే చెప్పి ఏది న్యాయమో, మరేది అన్యాయమో తరచి చూడండంటూ నిర్ణయాన్ని ప్రజలకే వదిలేశారు. 

జగన్‌ అనే నేను.. 
విషయాలపట్ల స్పష్టత, ముక్కుసూటితనంతో ప్రజల మదిని గెలిచారు. హామీలివ్వడం ఎవ్వరైనా చేస్తారు. వాటిని అమలుచేసినప్పుడే ఆ వ్యక్తి జీవితానికి సార్థకత లభిస్తుంది. సమకాలీన రాజకీయ చరిత్రలో డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆ పనిచేశారు. తాను చేసిన హామీలను అమలుచేసి చిరస్మరణీయునిగా నిలిచారు. సరిగ్గా జగన్‌ కూడా అదే బాటలో నడుస్తున్నారు. నాన్నగారు ఒక అడుగు ముందుకు వేస్తే.. ఆయన కొడుకుగా నేను రెండడుగులు వేస్తానని సగర్వంగా చెబుతూ వచ్చారు. ప్రజా జీవనంలో ఉన్నప్పుడు నిజాయితీ, విశ్వసనీయత ఉండాలని పదేపదే ఉద్భోదించారు. తాను అధికారంలోకి వస్తే.. అది ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అయినా, ఆరోగ్యశ్రీ అయినా, పేదలకు ఇళ్ల నిర్మాణమైనా, మరేదైనా సరే అమలుచేస్తానని చెప్పినప్పుడు, ‘జగన్‌ అనే నేను..’ అనే పదాన్ని ఉపయోగించారు. జగన్‌ నోటి నుంచి ఆ మాట వచ్చినప్పుడల్లా హర్షధ్వానాలతో సభా ప్రాంగణాలు హోరెత్తేవి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement