ప్రకాశ్ రాజ్(ఫైల్)
కాషాయీకరణ రాజకీయాలపై కత్తులఝుళిపిస్తోన్న సరికొత్త కంఠస్వరం కన్నడిగుడైన ప్రకాష్ రాజ్‌ది. తన వ్యాఖ్యల ద్వారా సోషల్ మీడియాలోనూ, చేష్టల ద్వారా కన్నడ రాజకీయాల్లోనూ ప్రకాష్ రాజ్ ప్రధానిమోడీపై జస్ట్ ఆస్కింగ్ పేరుతో ప్రశ్నల తూటాలను సంధిస్తున్నారు. ప్రకాష్‌రాజ్ సోషల్ మీడియాకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ గుక్కతిప్పుకోకుండా భారతీయ జనతాపార్టీపైనా, ఆ పార్టీ నాయకులపైనా విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
తాజాగా కతువా చిన్నారి ఆసిఫా పై అత్యాచారం విషయంలోనూ, ఉన్నావ్ అత్యాచారం సందర్భంలోనూ, అత్యాచారాలపైనా, స్త్రీలను కించపరిచే వ్యాఖ్యలు చేస్తోన్న బిజెపి మంత్రులు, ప్రజాప్రతినిధుల వ్యవహార శైలిపై స్పందిస్తూ బిజెపి నేతలను మాట్లాడకుండా ఉండమనీ, మీడియా మసాలాలకి దూరంగా ఉండమని ప్రధాని కోరుతున్నారు కానీ, మీరు మాట్లాడకపోతే మీ మనసు లోపల ఏముందో మేమెలా తెలుసుకోగలుగుతాం? అందుకే మాట్లాడండి.... అప్పుడే మీ గురించి మాకు స్పష్టత వస్తుందంటూ ట్వీట్ చేశారు ప్రకాష్.
మతం పునాదులపై పాలనా?
‘‘మతంపేరుతో ఓటర్లను విడగొట్టడం ద్వారా బిజెపి ప్రభుత్వం రాజ్యాంగాన్ని ధిక్కరించడమే కాకుండా సమాజాన్ని నిలువునా చీలుస్తోంది, అందుకే కర్నాటకలో బిజెపిని అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే తన తక్షణ కర్తవ్యం’’ అని నేషనల్ మీడియా ఎదుట తన రాజకీయ ఎజెండాని స్పష్టం చేశారు ప్రకాష్‌రాజ్. తొలినుంచి కాంగ్రెస్, బిజెపిలకు తాను వ్యతిరేకమేనని, అయితే ఓటు ఎవరికి వేయాలో నేను చెప్పను. కానీ మతోన్మాదులను అధికారంలోకి రానివ్వద్దని మాత్రం చెపుతానని తాజాగా ప్రకటించారు. ఇదే నేపథ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తలపెట్టిన ఫెడరల్ ఫ్రంట్‌కి సంపూర్ణమద్దతిస్తానని కూడా ప్రకటించారు. కెసిఆర్ ఫెడరల్ ఫ్రంట్‌కు జనతాదళ్ (ఎస్)నాయకులు దేవెగౌడ మద్దతు కోరడంలో ప్రకాష్‌రాజ్ పాత్రే కీలకమని కూడా వార్తలొచ్చాయి.
కర్నాటక ఎన్నికల అనంతరం బిజెపితో జతకట్టే ప్రస్తకేలేదని జెడిఎస్ తనకు హామీయిచ్చినట్టు కూడా ప్రకాష్‌రాజ్ ప్రకటించడం గమనార్హం. ఇంతదాకా మాట్లాడనందుకు సిగ్గుపడుతున్నాను. సరిగ్గా ఒక ఏడాది క్రితం వరకు ప్రాంతాలకతీతంగా తన నటనతో వివిధ రాష్ట్రాల ప్రజలను ఉర్రూతలూగించిన ప్రకాష్ రాజ్ ప్రముఖ కన్నడ జర్నలిస్టు గౌరీలంకేశ్ హత్యతరువాత కాషాయీకరణ రాజకీయాలను ధిక్కరిస్తూ బహిరంగంగా ముందుకొచ్చారు. ఇప్పుడే ఎందుకని ప్రశ్నించిన మీడియాకి ఇప్పుడు సైతం మాట్లాడకపోతే మానవత్వం బతికుండదని కుండబద్దలు కొట్టారు. ‘‘చావు నా యింటి గడపముందు కొచ్చినా మాట్లాడకపోవడం సిగ్గుచేటు, యింతకాలం మాట్లాడనందుకు సైతం సిగ్గుపడతున్నాను’’ అని పశ్చాత్తాప పడిన సందర్భం ప్రతిఒక్కరినీ కదలించింది.
జస్ట్ ఆస్కింగ్ క్యాంపెయిన్, ప్రశ్నల యుద్ధం ఆరంభం....
మూడు నాలుగు నెలలక్రితం జస్ట్ ఆస్కింగ్ పేరుతో క్యాంపెయిన్ ప్రారంభించిన ప్రకాష్‌రాజ్ త్వరలోనే భావసారూప్యత గలవారందరినీ ఈ వేదిక కింద సమీకరించే లక్ష్యంతో ఉన్నట్టు ప్రకటించారు. ఇప్పటికే కర్నాటకలోని ప్రతిజిల్లాలో జస్ట్ ఆస్కింగ్ టీం ఉంది. విశ్రాంత ఐఏఎస్, ఐఆర్‌ఎస్ అధికారులు, విద్యార్థులు, లెక్చరర్లు, రచయితలు, డాక్టర్లు లాంటి మేథోవర్గం తన జస్ట్ ఆస్కింగ్ అనే ఒకే వేదికపైకి తేగలిగాననీ, అయితే చేతులు ముడుచుకుని కూర్చోడానికిది సమయంకాదంటారాయన. ప్రతి ఒక్కరూ గొంతుకలపి నిశ్శబ్దాన్ని ఛేదించాలని ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
అంబేడ్కర్, లెనిన్, పెరియార్‌నీ వదలరా?
అంబేడ్కర్ మొదలు లెనిన్, పెరియార్‌నీ వదలరా అని కూడా ప్రకాష్‌రాజ్ జస్ట్‌ఆస్కింగ్ లో ప్రశ్నిస్తారు. మహానాయకుల విగ్రహాల విధ్వంసం మొదలుకొని ఉన్నావ్, కశ్మీర్ ఘటనల్లో బిజెపి మంత్రులు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం వరకు వేటినీ వదలకుండా తూర్పారపడుతోన్న ప్రకాష్‌రాజ్ ఒక్కసారి గెలిచినంత మాత్రాన అది శాశ్వతం అవుతుందని పొరబడొద్దనీ, ప్రతి ఐదేళ్ళకీ ప్రభుత్వాలను గద్దెదించే సత్తా ప్రజలకుందని గుర్తించాలంటారాయన.
బిజెపి క్యాన్సర్ లాంటిది, ముందు దాన్ని తొలగించాలి...
కాంగ్రెస్, జనతాదళ్(ఎస్) జలుబు, దగ్గులాంటి చిన్న వ్యాధులైతే, బిజెపి క్యాన్సర్ మహమ్మారి లాంటిదని ప్రకాష్‌రాజ్ తాజా వ్యాఖ్య. క్యాన్సర్‌ని వదిలి జలుబు, దగ్గులను మందేస్తే అసలు సమస్య పరిష్కారం కాదన్నది దానర్థం. ప్రకాష్ రాజ్ ప్రశ్నలతో సతమతమవుతోన్న బిజెపి ఇప్పుడు తాజాగా ఆయనపై ఎన్నికల కమిషన్‌కి ఫిర్యాదు చేసింది. ప్రధాని మోదీని, యడ్యూరప్పను, కించపరుస్తున్నారన్నది కర్నాటక బిజెపి ఫిర్యాదు సారాంశం. వ్యక్తిగా తన అభిప్రాయాలు స్వేచ్ఛగా వ్యక్తం చేసే హక్కు తనకు ఉందన్నది ప్రకాష్ సమాధానం.
- సాక్షి నాలెడ్జ్ సెంటర్.
Comments
Please login to add a commentAdd a comment