సాక్షి, చెన్నై : ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మరో కొత్త రాజకీయ పార్టీతో జట్టుకట్టారు. తమిళనాడు ప్రతిపక్ష నేత, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌కు రాజకీయ సలహాదారుడిగా ఆయన వ్యవహరించనున్నారు. తమిళనాట 2021లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికలపై అనుసరించాల్సి వ్యూహాలు, సలహాలపై స్టాలిన్‌కు సూచనలు ఇవ్వనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే విజయమే లక్ష్యంగా ప్రశాంత్ కిషోర్ పనిచేయనున్నారు. అయితే ఈ విషయాలపై గత కొంతకాలంగా వార్తలు వస్తున్నప్పటికీ అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. తాజాగా ప్రశాంత్ కిషోర్‌తో ఒప్పందంపై స్టాలిన్ కీలక ప్రకటన విడుదల చేశారు.
‘తమిళనాడు ప్రజల భవిష్యత్తు కొరకు ప్రశాంత్ కిషోర్‌తో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాం. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయానికి కావాల్సిన సహకారాలు ఆయన అందిస్తారు. పీకేతో ఒప్పందం కుదుర్చుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎంతో ఆనందంగా మీతో ఈ విషయాన్ని పంచుకుంటున్నా’ అని సోషల్ మీడియా వేదికగా స్టాలిన్ ప్రకటించారు. దీనిపై ప్రశాంత్ కిషోర్ కూడా స్పందించారు. ‘మీతో (స్టాలిన్)తో కలిసి పనిచేసే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీ విజయానికి మావంతు కృషి తప్పక చేస్తాం.’ అని అన్నారు.
ఎన్నికల వ్యూహకర్తగా మంచి గుర్తింపు పొందిన ప్రశాంత్ కిషోర్‌ను తమ పార్టీకి సలహాదారుడిగా వ్యవహరించాలంటూ దేశంలోని ప్రముఖ నేతలంతా అభ్యర్థిస్తున్నారు. ఎన్నికలు వస్తున్నాయంటే చాలు.. ప్రశాంత్ అపాయింట్‌మెంట్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీని తొలిసారి పీఎం పీఠంపై కూర్చోబెట్టడంలో ప్రశాంత్ అద్భుతమైన విజయం సాధించారు. దీంతో 2014 సార్వత్రిక ఎన్నికలు ఆయనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఆ తరువాత బిహార్‌లో నితీష్ కుమార్ కూటమి విజయం, పంజాబ్‌లో అమరిందర్ సింగ్ గెలుపుకోసం విశేషంగా కృషి చేసి విజయం సాధించారు. ఆ తరువాత ఆయన క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. మరోవైపు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో ఇప్పటికే కలిసి పనిచేస్తున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment