న్యూఢిల్లీ: తన భవిష్యత్ ప్రణాళికల గురించి ఫిబ్రవరి 11న పట్నాలో మాట్లాడతానని ప్రముఖ ఎన్నికల ప్రచార వ్యూహకర్త, జనతాదళ్(యూ) బహిష్కృత నేత ప్రశాంత్ కిషోర్ అన్నారు. అంతవరకు తాను ఎవరితోనూ ఏమీ మాట్లానబోనని స్పష్టం చేశారు. నరేంద్ర మోదీ సర్కారు తీసుకవచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ జనాభా రిజిస్టర్(ఎన్‌పీఆర్) విషయంలో జేడీయూ పార్టీ వైఖరిని ప్రశ్నించినందుకు పార్టీ ఉపాధ్యక్షుడుగా ఉన్న ప్రశాంత్ కిషోర్‌ను జనతాదళ్(యూ) బహిష్కరించిన విషయం తెలిసిందే. సీఏఏ, ఎన్‌పీఆర్ విషయంలో ప్రశాంత్ కిషోర్, జేడీయూ చీఫ్, బిహార్ సీఎం నితీశ్ కుమార్‌ల వాగ్యుద్ధం తారస్థాయికి చేరిన నేపథ్యంలో.. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారంటూ పీకేపై పార్టీ వేటు వేసింది. ఈ నేపథ్యంలో.. బిహార్ సీఎంగా నితీశ్ పగ్గాలు చేపట్టడంలో కీలక పాత్ర పోషించిన పీకే.. తనను బహిష్కరించినందుకు నితీశ్‌కు ధన్యవాదాలు తెలుపుతూనే.. మరోసారి సీఎం కావాలంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఇక ఫిబ్రవరి 11న నిర్ణయం చెబుతానంటూ ఆసక్తికర చర్చకు తెరతీశారు.(అసలు పీకే ఎవరు.. దిమ్మతిరిగే కౌంటర్!)
కాగా సీఏఏకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో తీవ్రస్థాయిలో ఆందోళనలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 8న ఎన్నికలు జరుగనున్నాయి. ఇక ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. పీకే టీంతో జట్టుకట్టి.. బీజేపీని విమర్శించడాన్ని పక్కనపెట్టి.. తమ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి చెబుతూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో ఎన్నికల ఫలితాలు వెలువడే రోజైన ఫిబ్రవరి 11న తన నిర్ణయం ప్రకటిస్తానంటూ ప్రశాంత్ కిషోర్ తనదైన శైలిలో స్పందించారు. తన వ్యూహాలతో ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీకి, ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న జేడీయూకు చెక్ పెడతానని చెప్పకనే చెప్పారు. ఇదిలా ఉండగా.. ప్రశాంత్ కిషోర్‌ను తమ పార్టీలో చేరాల్సిందిగా ఆర్జేడీ నేత, బిహార్ మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ ఆహ్వానించారు. ఆయన కోసం తామెప్పుడూ ఎదురుచూస్తూ ఉంటామని పేర్కొన్నారు.(పీకే బహిష్కరణ.. మీరు మళ్లీ సీఎం కావాలి!)
Comments
Please login to add a commentAdd a comment