
హైదరాబాద్: ఎన్నికలు రావటానికి ముందే కాంగ్రెస్‌తో వామపక్షాల పొత్తు సాధ్యం కాకపోవచ్చని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... కాంగ్రెస్ అధికారంలో ఉన్న చోట వామపక్షాలు... కమ్యూనిస్టులు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రతిపక్షాలుగా ఉన్నందున ముందుగానే సయోధ్య కుదరదని అభిప్రాయపడ్డారు. అయితే, బీజేపీపై పోరు వంటి ఉమ్మడి ఎజెండా ఉన్న సందర్భాల్లో కాంగ్రెస్‌తో కలిసి పోరాడుతామని చెప్పారు. కొన్ని రాష్ట్రాల్లో పోటీగా అభ్యర్థులను నిలబెట్టకపోవటం వంటిది సాధ్యం కావచ్చన్నారు.
వామపక్షాలు మరీ బలహీనంగా ఉన్న కొన్ని రాష్ట్రాల్లో వేదికను పంచుకునేందుకు కాంగ్రెస్ ముందుకు రాకపోవచ్చని చెప్పారు. వామపక్షాలు అధికారంలో ఉన్న కేరళలో బీజేపీ తలపెట్టిన జనరక్షాయాత్ర ప్రభావం దక్షిణాది రాష్ట్రాల్లో ఉండబోదన్నారు. బీజేపీ ఓటు బ్యాంకు తగ్గిపోతోందనటానికి కేరళలోని వెంగర అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక ఫలితమే నిదర్శనమన్నారు. పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలో తేవాలని తాము ప్రారంభం నుంచీ కోరుతున్నామని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.