సాక్షి, హైదరాబాద్: పార్టీ అధిష్టానం ఆదేశిస్తే సీఎం కేసీఆర్‌పై గజ్వేల్‌లోనైనా పోటీకి సిద్ధమని మాజీమంత్రి, సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. శనివారంనాడిక్కడ విలేకరులతో ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌కు, మంత్రి కేటీఆర్‌కు ప్రజల సమస్యలు అర్థం కావడం లేదన్నారు, సచివాలయానికి వస్తే ప్రజా సమస్యలు తెలుస్తాయన్నారు. మంత్రి కేటీఆర్‌కు అవార్డులు ఇస్తున్నరా, కొనుక్కుంటున్నరా అని ప్రశ్నించారు.
మున్సిపల్ శాఖ మంత్రిగా నల్లగొండ, మిర్యాలగూడ సమస్యల గురించి ఎన్నిసార్లు చెప్పినా చేయలేని అసమర్థుడు కేటీఆర్ అని విమర్శించారు. కేవలం 30 కోట్ల పనులనే మంత్రిగా కేటీఆర్ చేయలేకపోతే అవార్డులు ఎందుకిస్తున్నారో, ఎవరు ఇస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. ఇలాంటి అసమర్థ ప్రభుత్వాన్ని తన రాజకీయ జీవితంలో ఇంతవరకు చూడలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కమీషన్ల కోసం కక్కుర్తి పడుతున్నారని ఆరోపించారు. ఇలాంటి మంత్రి కేటీఆర్‌కు అవార్డులు ఎలా వస్తున్నా యన్నారు.
మంచి పనులు చేస్తే ప్రజలే అవార్డులు ఇస్తారన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ రుణాన్ని ప్రజలు 2019 ఎన్నికల్లో తీర్చుకుంటారని చెప్పారు. జిల్లాకు చెందిన మంత్రి జగదీశ్వర్‌రెడ్డికి జిల్లా సమస్యలపై అవగాహన లేదని, సమస్యలే మంత్రికి పట్టవని అన్నారు. పీసీసీకి అధ్యక్షుడిగా ఎవరుండాలనేది అధిష్టానం నిర్ణయిస్తుందని, అదే ఫైనల్ అని కోమటిరెడ్డి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment