
ఆమె తిట్లు మాకు దీవెనలే : మోదీ
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు గుప్పించారు. తనను దేశ ప్రధానిగా అంగీకరించనని ఆమె చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగాన్ని అవమానించడమేనని వ్యాఖ్యానించారు. ప్రదాని మోదీ గురువారం బెంగాల్‌లోని బంకూరలో జరిగిన ప్రచార ర్యాలీలో మాట్లాడుతూ దీదీ తనను దేశ ప్రధానిగా అంగీకరించనని బాహాటంగా చెబుతున్నారని అయితే ఆమె పాకిస్తాన్ ప్రధానిని మాత్రం గుర్తిస్తారని చురకలు వేశారు.
లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి తప్పదనే ఆందోళనతో ఆమె రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఫొని తుపాన్ ప్రభావంపై తాను బెంగాల్ సీఎంతో మాట్లాడాలని ప్రయత్నించినా ఆమె నుంచి సమాధానం లేదని చెప్పుకొచ్చారు. బెంగాల్‌కు మేలు చేయడం పట్ల ఆమెకు ఆసక్తి లేదని ఆరోపించారు. దీదీ దుర్బాషలే తనకు దీవెనలుగా పనిచేస్తాయని అన్నారు. కాగా, ప్రధాని మోదీపై లోక్‌సభ ఎన్నికల ప్రచారం నేపథ్యంలో మమతా బెనర్జీ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే.