భర్తకు ప్రేమతో.. గెలుపు బాధ్యత | Priyadarshini Raje Campaign For Her Husband Jyotiraditya Sicidiya In Guna | Sakshi
Sakshi News home page

భర్తకు ప్రేమతో.. గెలుపు బాధ్యత

Published Fri, May 10 2019 2:52 PM | Last Updated on Fri, May 10 2019 3:45 PM

Priyadarshini Raje Campaign For Her Husband Jyotiraditya Sicidiya In Guna - Sakshi

భోపాల్‌: ప్రతి పురుషుడి విజయం వెనుక ఓ మహిళ ఉంటుందనేది ఎంత వరకు నిజమో తెలీదు కానీ.. ప్రతి భర్త విజయం వెనుక భార్య శ్రమ ఉంటుందని రుజువు చేస్తున్నారు మధ్యప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి జ్యోతిరాదిత్య సింథియా భార్య.. ప్రియదర్శినీ రాజే. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి ఎంతో కీలకమైన రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్‌ ఒకటి. ఆ రాష్ట్రంలో పార్టీ విజయానికి ప్రియదర్శిని ఎంతో కష్టపడుతున్నారు. భర్త జ్యోతిరాదిత్య జాతీయ రాజకీయాల్లో బిజీగా ఉండడంతో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న గుణ లోక్‌సభ నియోజకవర్గ గెలుపు బాధ్యతను ఆమె మోస్తున్నారు. మధ్యప్రదేశ్‌లో గత  ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించిన రెండు స్థానాల్లో గుణ ఒకటి. గత ఏడాది హోరాహోరీగా జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం వెనుక జ్యోతిరాదిత్యా కృషి అందరికీ తెలిసిందే.

సీనియర్‌ నేత కమల్‌నాథ్‌ను పక్కన పెట్టి సీఎంగా కుర్చి కూడా అయననే వరిస్తుందని ఓ వర్గం నేతలు ఎంతో ధీమా వ్యక్తం చేశారు. కానీ ఫలితాల అనంతరం లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కమల్‌నాథ్‌కు సీఎం పీఠం అప్పగించి.. జ్యోతిరాదిత్యకు ఉప ముఖ్యమంత్రి పదవి అప్పగించారు. ఆ తరువాత దేశంలో పెద్ద రాష్ట్రమైన యూపీలో పార్టీ పుర్వవైభవం కోసం కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ..  సింథియా, ప్రియాంక గాంధీను యూపీ బాధ్యులుగా నియమించారు.  యూపీలో విజయం కోసం ప్రియాంకతో పాటు సింథియా విశ్వప్రయత్నలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన సొంత నియోజకవర్గమైన గుణ ప్రచారానికి దూరమైయారు జ్యోతిరాదిత్య. గుణలో సింథియా కుటుంబానికి మంచి ఆదరణ ఉంది. 1967 నుంచి వరసగా వారి కుటింబికులే ఇక్కడ విజయం సాధిస్తూ వస్తున్నారు. దీంతో ఈసారి గెలుపు బాధ్యతను ఆయన భార్య ప్రియదర్శినీ రాజేపే మోపారు.

లోక్‌సభ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలైన దగ్గర నుంచి గుణ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో విస్రృతంగా పర్యటిస్తూ..  ప్రజల అవసరాల గురించి ఆరాతీస్తూ.. ఓట్లు అభ్యర్థిస్తున్నారు. మరాఠా గైక్వాడ్‌ రాజవంశానికి చెందిన ప్రియదర్శినీ రాజే.. ప్రత్యర్థి అభ్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ప్రచారంలో దూసుకుపోతున్నారు. అయితే జ్యోతిరాదిత్య ఉప ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం గుణ స్థానంలో ఆయన భార్యను నిలపాలనే అనుకున్నారు. చివరి వరకూ ఇదే ప్రచారం జరిగినా.. కీలక ఎన్నికలు కావడంతో సింథియానే బరిలో నిలిపింది కాంగ్రెస్‌ అధిష్టానం.  2002లో తండ్రి మరణంతో ఈ స్థానం ఖాళీ కావడంతో తొలిసారి ఉప ఎన్నికల్లో గుణ ఎంపీగా గెలుపొందారు. ఇప్పటి వరకు నాలుగు సార్లు సింథియా విజయం సాధించారు. గత ఎన్నికల్లో లక్షన్నర ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థిపై గెలుపొందారు. మరోసారి తన భార్యపై ఉన్న నమ్మకంతో విజయంపై ధీమాగా ఉన్నారు. కాగా మరాఠా గైక్వాడ్‌ రాజవంశానికి చెందిన ప్రియదర్శినీ రాజేను 1994లో జ్యోతిరాదిత్యా సింథియా వివాహమాడిన విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement