చంఢీగడ్: ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మోదీని దుర్యోధనుడితో పోల్చారు. దుర్యోధనుడిలా మోదీ దురహంకారి అని, ఆయన అహంకారమే ఈ ఎన్నికల్లో ఓటమికి కారణమవుతుందని ధ్వజమెత్తారు. హర్యానాలోని అంబాలాలో మంగళవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రియాంక పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడుతూ.. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీపై మోదీ చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు గురించి బీజేపీ నేతలు ఎక్కడా కూడా ప్రస్తావించట్లేదన్నారు. కేవలం అమరవీరుల పేరుతోనో, లేక మా కుటుంబంపై విమర్శలు, ఆరోపణలతోనో బీజేపీ నేతలు ఓట్లడుగుతున్నారని ఎద్దేవా చేశారు.
రైతుల బాధలు వినే ఓపిక మోదీకి లేదని, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన రాజీవ్‌పై అనవసర ఆరోపణలు చేసి ఓట్లు కోరుతున్నారని అన్నారు. ఈ ఎన్నికలు కేవలం ఒక కుటుంబానికి చెందిన ఎన్నికలు కావని, మోదీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలకు సంబంధించిన ఎన్నికలని ప్రియాంక అభిప్రాయపడ్డారు. కాగా మే 4న యూఈలో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో నరేంద్రమోదీ మాట్లాడుతూ ‘‘ రాజీవ్ గాంధీ మిస్టర్ క్లీన్‌గా దేశ రాజకీయాల్లో వచ్చారు. కానీ నంబర్ వన్ అవినీతి పరుడిగా జీవితం ముగించారు’’ అని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment