
శనివారం గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పిస్తున్న కోదండరాం
సాక్షి, హైదరాబాద్: ‘ఉద్యమాలతో సాధించిన తెలంగాణను అభివృద్ధిలో నడిపిస్తారని భావించాం. కాని అధికారం అడ్డుపెట్టుకుని ఉద్యమకారులను అణచివేసే ప్రయత్నం చేస్తున్నారు. సమస్యలు పరిష్కరిస్తారని అధికారం అప్పజెప్పితే దాన్ని తప్పుడు దారిలో ఉపయోగిస్తున్నారు’ అని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాంపల్లిలోని టీజేఎస్ కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు.
అనంతరం జరిగిన సభలో కోదండరాం మాట్లాడుతూ.. అధికార టీఆర్‌ఎస్ పార్టీతోపాటు సీఎం కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ ఉద్యమకారులను మరిచిపోయిందని, ఆంధ్రా కాంట్రాక్టర్లు, కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తోందని విమర్శించారు. ‘రాష్ట్రం వచ్చినందుకు ఈ రోజు పండుగ చేసుకోవాలా, లేక టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు అయినందుకు పండుగ జరుపుకోవాలా అని ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవం. ఉద్యమకారుల పండుగ. ప్రజల వేడుక’ అని వ్యాఖ్యానించారు.
అవినీతిలో రెండో స్థానం
ఆ రోజు ఉద్యమాలను విమర్షించి.. ‘తెలంగాణ లేదు.. ఏంలేదు.. దుకాణం’ అని మాట్లాడిన వాళ్లు ఇప్పుడు మంత్రులయ్యారని కోదండరాం విమర్శించారు. ‘రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా పత్రికలకు ఇచ్చిన ప్రకటనల్లో ఒక్కటైనా ఉద్యమాలకు సంబంధించిన ఫొటో గానీ, అక్షరం గానీ ఉందా? సకల జనుల సమ్మె, సాగరహారం, మిలియన్ మార్చ్, వంటావార్పు.. ఇలాంటి వాటికి సంబంధించిన ఒక్క ఫోటో కూడా లేదు. కేవలం టీఆర్‌ఎస్ వాళ్ల పథకాల ప్రచారం కోసం మాత్రమే ప్రకటనలు ఇచ్చుకున్నారు’ అని దుయ్యబట్టారు.
తెలంగాణ జాతిపితగా చెప్పుకోవాల్సిన ప్రొఫెసర్ జయశంకర్ ఫొటో ఒక్క ప్రకటనలో గానీ, ప్రభుత్వం పెట్టిన అంశాల్లో గానీ లేకపోవడం బాధకరమన్నారు. ‘టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశంలోనే నంబర్ వన్ స్థానంలో తెలంగాణ ఉందని ప్రకటించుకుంటున్నారు. మరి అవినీతిలో రెండో స్థానం, మద్యపానంలో రెండో స్థానం, అక్షరాస్యతలో చివరి నుంచి మూడో స్థానంలో ఉన్న విషయాలను కూడా ప్రకటనలో వెల్లడించాల్సింది’ అని ఎద్దేవా చేశారు.
మంత్రులకూ రైతుబంధు చెక్కులా?
‘రైతు బంధు కింద ఇచ్చిన రూ.4 వేలతో రైతన్నలు ఎంత పంట పండిస్తారు? ఆ డబ్బులతో ఏం చేయాలి. ఇదే పథకంలో సత్యం రామలింగరాజుకు, సచిన్ టెండూల్కర్‌కు కూడా చెక్కులు వచ్చాయి. కొంత మంది మంత్రులు కూడా రైతు బంధు కింద చెక్కులు పొందారు. కానీ 46 లక్షల మంది కౌలు రైతులను నిర్లక్ష్యం చేయడం ఏంటి?’ అని ఆయన ప్రశ్నించారు. భూమి లేకుండా వ్యవసాయం చేస్తున్న వాళ్లకు కనీసం కిసాన్ క్రెడిట్ కార్డయినా ఇవ్వాలన్నారు. ప్రజలు అధికారం అప్పజెపితే సేవ చేయాల్సింది పోయి.. తామేదో చక్రవర్తుల్లా వ్యవహరించడం ఏంటని విమర్శించారు.
పాలనను మార్చుకుంటాం..
‘ఈ పాలనను మార్చు కోగలుగుతాం. తెలంగాణనే తెచ్చు కున్న వాళ్లం.. ఈ ప్రభుత్వాన్ని, పాలనను మార్చ కోలేమా? ఉద్యమకారులుగా మాకు ఇది పెద్ద లెక్క కాదు. ఐక్యంగా ముందుకు సాగి, పాలనలో మార్పు తీసుకు వచ్చేందుకు కృషి చేస్తాం’ అని కోదండరాం అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు, కులవృత్తుల వారు, రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులు చేసిన పోరా టాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నా రు. ఉద్యమంలో కీలకమైన సకల జనుల సమ్మె, వంటావార్పు, సడక్ బంద్, మిలియన్ మార్చ్, సాగర హారం తదితర కార్యక్రమాల గురించి వివరించారు. తెలంగాణను అభివృద్ధి దిశలో తీసుకెళ్లేందుకు జయశంకర్ స్పూర్తితో ముందుకు సాగుతామని పేర్కొన్నారు. వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు యువత ముందుకు రావాలని, 2019 ఎన్నికల్లో అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో జన సమితి పోటీ చేసి ప్రజల గొంతు వినిపిస్తుందని మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌కుమార్ అన్నారు. కార్యక్రమంలో టీజేఎస్ నేతలు వెంకట్‌రెడ్డి, శ్రీశైల్‌రెడ్డి, ప్రొఫెసర్ విశ్వేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment