
న్యూఢిల్లీ: కరోనా సంక్షోభాన్ని అడ్డం పెట్టుకుని కార్మిక చట్టాలను కాలరాయాలని కొన్ని రాష్ట్రాలు చేస్తున్న ప్రయత్నాలను కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ తప్పుబట్టారు. లక్షలాది మంది కార్మికుల హక్కులను దెబ్బతీసేలా కార్మిక చట్టాలను సవరించడం సరికాదని అన్నారు. ‘కార్మిక చట్టాలను చాలా రాష్ట్రాలు సవరిస్తున్నాయి. కరోనా [వైరస్] కి వ్యతిరేకంగా మనమంతా పోరాడుతున్నాం. కాని ఇది మానవ హక్కులను కాలరాయడానికి, అసురక్షిత కార్యాలయాలను అనుమతించడానికి, కార్మికులను దోపిడీ చేయడానికి, వారి గళాలను అణచివేయడానికి ఒక సాకు కాదు. మేము ప్రాథమిక సూత్రాలపై (కార్మికుల హక్కులను కాపాడటం) రాజీపడబోమ’ని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. (ప్రత్యేక రైళ్లు: ఎక్కువ మందిని తరలించేలా..)
కరోనా సంక్షోభంతో ఆర్థిక వ్యవస్థ కుదేలైన నేపథ్యంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్ ప్రభుత్వాలు కార్మిక చట్టాల నుంచి పరిశ్రమలకు తాత్కాలిక మినహాయింపులు కల్పించాయి. ఉద్యోగులను నియమించుకోవడం, తొలగించడంలో యాజమాన్యాలకు పూర్తి అధికారాన్ని కట్టబెట్టాయి. పనివేళలను సైతం 8 నుంచి 12 గంటలకు పెంచుకునేందుకు అనుమతిచ్చాయి. తనిఖీల నుంచి కూడా మినహాయింపునిచ్చాయి. ప్రస్తుతం ఉన్న పరిశ్రమలతోపాటు కొత్త పరిశ్రమలకూ ఈ నిబంధనలు వర్తిస్తాయి. దీనిపై పరిశ్రమల వర్గాల నుంచి సానుకూలత వ్యక్తం కాగా, కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. (54 రోజులుగా ఎయిర్‌పోర్ట్‌లో ఒక్కడే!)
Comments
Please login to add a commentAdd a comment