Labour Act
-
కరోనా సాకుతో ఇంత అన్యాయమా?
న్యూఢిల్లీ: కరోనా సంక్షోభాన్ని అడ్డం పెట్టుకుని కార్మిక చట్టాలను కాలరాయాలని కొన్ని రాష్ట్రాలు చేస్తున్న ప్రయత్నాలను కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ తప్పుబట్టారు. లక్షలాది మంది కార్మికుల హక్కులను దెబ్బతీసేలా కార్మిక చట్టాలను సవరించడం సరికాదని అన్నారు. ‘కార్మిక చట్టాలను చాలా రాష్ట్రాలు సవరిస్తున్నాయి. కరోనా [వైరస్] కి వ్యతిరేకంగా మనమంతా పోరాడుతున్నాం. కాని ఇది మానవ హక్కులను కాలరాయడానికి, అసురక్షిత కార్యాలయాలను అనుమతించడానికి, కార్మికులను దోపిడీ చేయడానికి, వారి గళాలను అణచివేయడానికి ఒక సాకు కాదు. మేము ప్రాథమిక సూత్రాలపై (కార్మికుల హక్కులను కాపాడటం) రాజీపడబోమ’ని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. (ప్రత్యేక రైళ్లు: ఎక్కువ మందిని తరలించేలా..) కరోనా సంక్షోభంతో ఆర్థిక వ్యవస్థ కుదేలైన నేపథ్యంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్ ప్రభుత్వాలు కార్మిక చట్టాల నుంచి పరిశ్రమలకు తాత్కాలిక మినహాయింపులు కల్పించాయి. ఉద్యోగులను నియమించుకోవడం, తొలగించడంలో యాజమాన్యాలకు పూర్తి అధికారాన్ని కట్టబెట్టాయి. పనివేళలను సైతం 8 నుంచి 12 గంటలకు పెంచుకునేందుకు అనుమతిచ్చాయి. తనిఖీల నుంచి కూడా మినహాయింపునిచ్చాయి. ప్రస్తుతం ఉన్న పరిశ్రమలతోపాటు కొత్త పరిశ్రమలకూ ఈ నిబంధనలు వర్తిస్తాయి. దీనిపై పరిశ్రమల వర్గాల నుంచి సానుకూలత వ్యక్తం కాగా, కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. (54 రోజులుగా ఎయిర్‌పోర్ట్‌లో ఒక్కడే!) -
ఐటీ కంపెనీలకు ఆ చట్టం వర్తించదు
సాక్షి, హైదరాబాద్: ఐటీ పాలసీ ప్రకారం నెలకొల్పే కంపెనీలు షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ చట్ట పరిధిలోకి రావని రాష్ట్ర హైకోర్టు స్పష్టం చేసింది. ఐటీ కంపెనీ ఉద్యోగుల తొలగింపు వ్యవహారాలపై కార్మిక శాఖకు ఉత్తర్వులు జారీ చేసే అధికారం తమకు లేదని పేర్కొంది. ఐటీ కంపెనీలకు షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం వర్తించదని రాష్ట్ర ప్రభుత్వం 2002లోనే ఉత్తర్వులు జారీ చేసిందని న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావు గుర్తు చేశారు. హైదరాబాద్‌లోని కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ దాఖలు చేసిన కేసులో ఇటీవల కోర్టు తీర్పు వెలువరించింది. తనను అన్యాయంగా ఉద్యోగం నుంచి తొలగించారని పేర్కొంటూ కాగ్నిజెంట్‌లో ప్రాజెక్టు మేనేజర్‌గా పని చేసిన పి.అప్పలనాయుడు వికారాబాద్‌లోని కార్మిక శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. 2011లో ఉద్యోగంలో చేరితే 2013లో ఆ కంపెనీ తన వివరణ కోరకుండా తొలగించిందంటూ 48 (1) కింద ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును విచారించిన కార్మిక శాఖ.. అప్పలనాయుడుకు 2017 ఏప్రిల్ వరకు జీతం చెల్లించాలని ఆ కంపెనీని ఆదేశించింది. దీంతో రిట్ పిటిషన్ దాఖలు చేసిన సదరు కంపెనీ వాదనతో హైకోర్టు న్యాయమూర్తి ఏకీభవించారు. -
రోజుకు 9 పనిగంటలు.. కనీసవేతనం మాత్రం?
న్యూఢిల్లీ: కార్మిక చట్టాల పరిధిలోకి వచ్చే వేతన జీవులు, కార్మికులు చేస్తున్న 8 గంటల పని ఇక నుంచి 9 గంటలుగా మారనుంది. ఇప్పటికే పలు ఫ్యాక్టరీలు కార్మికులతో 9 గంటల పని చేయిస్తున్నాయి. దేశంలో 9 గంటల పని దినాన్ని ప్రవేశపెట్టే క్రమంలో భాగంగా కేంద్రం నిబంధనలు జారీ చేసింది. భారత ప్రభుత్వం వారంలో ఒక రోజు సెలవు దినంతో రోజుకు 9 పని గంటలు చేయాలనే ప్రతిపాదనను డ్రాఫ్ట్ వేజ్ రూల్స్‌లో తీసుకొచ్చింది. అయితే.. కనీస వేతనం ఎంత ఉండాలనేదానిపై మాత్రం నిర్ణయం తీసుకోలేదు. భవిష్యత్తులో వేతనాలు నిర్ణయించడానికి ఆరు ప్రమాణాలను సూచించడం మినహా చాలా వరకు పాత నిబంధనలను ముసాయిదా పునరుద్ఘాటించింది. కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ఉద్యోగులు, కార్మికులు తమ అభిప్రాయాల్ని తెలిపేందుకు ఓ వీలు ఉంది. ఈ నెలాఖరులోగా rajiv.ranja76@gov.in, malick.bikash@gov.in ఈ-మెయిళ్లకు తమ అభిప్రాయాలు పంపొచ్చు. పని గంటలు పెంచినంత మాత్రాన శాలరీలు పెరుగుతాయన్న గ్యారెంటీ లేదు. అందువల్ల కేంద్రం నిర్ణయాన్ని ఉద్యోగులు, కార్మికులు వ్యతిరేకించే అవకాశాలున్నాయి. వారి అభిప్రాయాల్ని లెక్కలోకి తీసుకొని కేంద్రం ఫైనల్ నిర్ణయం తీసుకునే వీలుంది. ఒక కుటుంబంలో నలుగురు సభ్యులకు కలిపి రోజుకు కనీసం 2700 కేలరీల ఆహారం, ఏడాదికి 66 మీటర్ల వస్త్రం ప్రామాణికంగా నిర్ణయించనుంది. ఈ రెండిటికీ అయ్యే ఖర్చులో 10 శాతాన్ని ఇంటి అద్దెగా, 20 శాతాన్ని ఇంధనం, విద్యుత్తు ఇతర ఖర్చులుగా లెక్కించనుంది. కనీస వేతనంలో 25 శాతం పిల్లల విద్య, వైద్యం, వినోదం, ఇతర ఖర్చుల కింద తీసుకుని నిర్ణయించాలని నిబంధనల్లో కార్మికశాఖ పేర్కోంది. కాగా, 1957 తొలిసారి కనీసం వేతనం లెక్కించిన విధానమే ఇప్పటికీ అమలు చేస్తుండటం గమనార్హం. అయితే, ఈ లెక్కలను ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పెంచాలనే అంతర్గత కమిటీ సూచించింది. వర్కర్, భాగస్వామి, ఇద్దరు పిల్లలు, తల్లిదండ్రులు మొత్తం ఆరుగురిని యూనిట్‌గా పరిగణలోకి తీసుకోవాలని స్పష్టం చేశారు. -
కాంట్రాక్ట్ నియామకాలపై పునరాలోచన
సాక్షి, న్యూఢిల్లీ : ఉద్యోగులను ఇష్టానుసారంగా నియమించుకుని..ఎప్పటికప్పుడు వదిలించుకునే హైర్ అండ్ ఫైర్ పద్ధతికి చెక్ పెట్టాలని కేంద్రం యోచిస్తోంది. అన్ని రకాల ఉద్యోగాలకు నిర్ణీత వ్యవధి కాంట్రాక్టులపై ఉద్యోగుల నియామకాలకు బడ్జెట్లో ఇచ్చిన వెసులుబాటుపై కేంద్రం పునరాలోచనలో పడింది. ఇష్టానుసారం ఉద్యోగులను తొలగించేందుకు ఈ వెసులుబాటు ఉపకరిస్తుందని కార్మిక సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన క్రమంలో సర్కార్ మెత్తబడింది. ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్టుపై ఉద్యోగుల నియామకాలను టెక్స్టైల్స్ నుంచి అన్ని రంగాలకూ వర్తింపచేస్తున్నట్టు బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను ప్రోత్సహించేందుకు ఈ చర్య ఉపకరిస్తుందని కేంద్రం భావిస్తోంది. దీనిపై కార్మిక సంఘాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసినా కార్మిక మంత్రిత్వ శాఖ దీనికి సంబంధించి ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది. ట్రేడ్ యూనియన్లు ఈ ప్రతిపాదనపై పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టడంతో ప్రభుత్వం దిగివచ్చింది. ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్టు నోటిఫికేషన్‌పై ప్రభుత్వం తొందరపాటుతో లేదని..దీన్ని తిరిగి రీడ్రాఫ్ట్ చేస్తామని కార్మిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. హైర్ అండ్ ఫైర్ పద్ధతిని ప్రోత్సహించే ఈ ప్రతిపాదనపై ప్రస్తుతం ప్రభుత్వం సీరియస్‌గా లేదని అధికార వర్గాలు పేర్కొన్నాయి. గతంలో కేవలం టెక్స్టైల్స్ రంగంలో మాత్రమే ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్టుపై ఉద్యోగుల నియామకానికి వెసులుబాటు ఉంది. ప్రస్తుతం కాంట్రాక్టు కార్మిక చట్టం ప్రకారం కేవలం అనుబంధ కార్యకలాపాలకే కాంట్రాక్టు ఉద్యోగులను తీసుకోవాలి..ప్రధాన వ్యాపార కార్యకలాపాల్లో శాశ్వత ఉద్యోగులనే నియమించుకోవాలి. శాశ్వత ప్రాతిపదిక ఉద్యోగాలకు కాంట్రాక్టు ఉద్యోగాలు ఎంతమాత్రం ప్రత్యామ్నాయం కాదని..తాము ఇలాంటి ప్రతిపాదనలను ఆమోదించబోమని ట్రేడ్ యూనియన్ నేతలు స్పష్టం చేశారు. -
వేతనాలు చెల్లించకపోతే సమ్మెకు దిగుతాం
యాజమాన్యం అగ్రిమెంట్ ప్రకారం వేతనాలను చెల్లించకపోతే.. సమ్మెకు సైతం వెనుకాడేది లేదని హెచ్ఎంఎస్ కార్మిక నేత, హోంమత్రి నాయిని నర్సింహ్మారెడ్డి అన్నారు. హెచ్ఎంటీ కాలనీలోని హెచ్ఎంటి ఆఫీసర్స్ క్లబ్ ఆవరణలో సోమవారం ఏర్పాటు చేసిన హెచ్ఎంఎస్ పరిశ్రమ కార్మికులు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హజరై మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికులకు సరైన వేతనాలు చెల్లించడం లేదని ఆరోపించారు. సంవత్సరాల తరబడి పనిచేస్తున్న కార్మికులను రెగ్యలరైజ్ చేయడం లేదని, రైగ్యులరైజ్ చేయాలని అడిగిన వారిని విధుల్లో నుండి తొలగిస్తే సహించేది లేదని హెచ్చరించారు. వేతన ఒప్పందం ప్రకారం సమాన వేతనాలతో పాటు, కార్మికులందరిని రైగ్యులరైజ్ చేయనట్లయితే లేబర్ యాక్ట్ 303 ప్రకారం సమ్మెకు సిద్దంగా ఉండాలని కార్మికులను కోరారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం నేతలు ప్రధాన కార్యదర్శి పిఎస్ఆర్ మూర్తి, కార్మికులు పాల్గొన్నారు.