ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, న్యూఢిల్లీ : ఉద్యోగులను ఇష్టానుసారంగా నియమించుకుని..ఎప్పటికప్పుడు వదిలించుకునే హైర్ అండ్ ఫైర్ పద్ధతికి చెక్ పెట్టాలని కేంద్రం యోచిస్తోంది. అన్ని రకాల ఉద్యోగాలకు నిర్ణీత వ్యవధి కాంట్రాక్టులపై ఉద్యోగుల నియామకాలకు బడ్జెట్‌లో ఇచ్చిన వెసులుబాటుపై కేంద్రం పునరాలోచనలో పడింది. ఇష్టానుసారం ఉద్యోగులను తొలగించేందుకు ఈ వెసులుబాటు ఉపకరిస్తుందని కార్మిక సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన క్రమంలో సర్కార్ మెత్తబడింది. ఫిక్స్‌డ్ టర్మ్ కాంట్రాక్టుపై ఉద్యోగుల నియామకాలను టెక్స్‌టైల్స్ నుంచి అన్ని రంగాలకూ వర్తింపచేస్తున్నట్టు బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను ప్రోత్సహించేందుకు ఈ చర్య ఉపకరిస్తుందని కేంద్రం భావిస్తోంది.
దీనిపై కార్మిక సంఘాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసినా కార్మిక మంత్రిత్వ శాఖ దీనికి సంబంధించి ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది. ట్రేడ్ యూనియన్లు ఈ ప్రతిపాదనపై పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టడంతో ప్రభుత్వం దిగివచ్చింది. ఫిక్స్‌డ్ టర్మ్ కాంట్రాక్టు నోటిఫికేషన్‌పై ప్రభుత్వం తొందరపాటుతో లేదని..దీన్ని తిరిగి రీడ్రాఫ్ట్ చేస్తామని కార్మిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. హైర్ అండ్ ఫైర్ పద్ధతిని ప్రోత్సహించే ఈ ప్రతిపాదనపై ప్రస్తుతం ప్రభుత్వం సీరియస్‌గా లేదని అధికార వర్గాలు పేర్కొన్నాయి. గతంలో కేవలం టెక్స్‌టైల్స్ రంగంలో మాత్రమే ఫిక్స్‌డ్ టర్మ్ కాంట్రాక్టుపై ఉద్యోగుల నియామకానికి వెసులుబాటు ఉంది.
ప్రస్తుతం కాంట్రాక్టు కార్మిక చట్టం ప్రకారం కేవలం అనుబంధ కార్యకలాపాలకే కాంట్రాక్టు ఉద్యోగులను తీసుకోవాలి..ప్రధాన వ్యాపార కార్యకలాపాల్లో శాశ్వత ఉద్యోగులనే నియమించుకోవాలి. శాశ్వత ప్రాతిపదిక ఉద్యోగాలకు కాంట్రాక్టు ఉద్యోగాలు ఎంతమాత్రం ప్రత్యామ్నాయం కాదని..తాము ఇలాంటి ప్రతిపాదనలను ఆమోదించబోమని ట్రేడ్ యూనియన్ నేతలు స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment