సాక్షి, విశాఖపట్నం: వైజాగ్ స్టీల్ ప్లాంట్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. కాంట్రాక్ట్ కార్మికులు ఈడీ వర్క్స్ బిల్డింగ్‌ను ముట్టడించారు. తమకు న్యాయం చేయాలని యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఈ క్రమంలో స్టీల్‌ప్లాంట్ వద్దకు భారీగా పోలీసులు చేరుకున్నారు.
విశాఖ స్టీల్‌ప్లాంట్ వద్ద కాంట్రాక్ట్ కార్మికులు నిరసనలు చేపట్టారు. మంగళవారం ఉదయం ఈడీ వర్క్స్ బిల్డింగ్‌ను కార్మికులు ముట్టడించారు. ఈ సందర్బంగా అక్కడకి భారీ సంఖ్యలో పోలీసులు, సీఐఎస్‌ఎఫ్ బలగాలు చేరుకున్నారు. పోలీసు ఉన్నతాధికారులు సైతం స్టీల్ ప్లాంట్ వద్దకు వచ్చారు. కాగా, 4200 మంది కాంట్రాక్ట్ కార్మికులు తొలగింపుపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమ ఉద్యమాన్ని అణిచివేసే ప్రయత్నం చేస్తోందని కార్మికులు మండిపడుతున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. శాంతియుతంగా నిరసన చేపడితే తమను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు.
మరోవైపు.. విశాఖ ఉక్కు కార్మికులు ఉద్యమాన్ని ఉధృతం చేశారు. ఆదివారం ఉదయం కూడా స్టీల్‌ప్లాంట్ బీసీ గేట్ ముందు కార్మికులు ఆందోళనకు దిగారు. కాంట్రాక్ట్ కార్మికులను తొలగిస్తే ఊరుకునేది లేదని కార్మిక నేతలు హచ్చరించారు. స్టీల్‌ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ కార్మికులను తొలగిస్తే ఊరుకునేది లేదంటూ హెచ్చరించారు.
ఇదిలా ఉండగా.. స్టీల్‌ప్లాంట్‌ను కాపాడతామని గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు ప్లాంట్ నిర్వీర్యం అవుతుంటే చేష్టలుడిగి చూస్తోంది. స్ట్రాటజిక్ సేల్ పేరిట ప్లాంట్‌ను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టేందుకు కేంద్రం వేస్తున్న అడుగులకు రాష్ట్ర ప్రభుత్వం మడుగులొత్తుతోంది. నాలుగు వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ రచ్చరచ్చ కావడంతో ఉక్కు యాజమాన్యం వెనక్కి తగ్గింది. ఈ నిర్ణయం తాత్కాలికమేనని, భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యోగ కోతలు జరగొచ్చనే ఆందోళన ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది.
ఇది కూడా చదవండి: చంద్రబాబు ‘కొవ్వు’ ప్రకటనకు 'ఎలాంటి ఆధారాల్లేవ్': సుప్రీంకోర్టు
Comments
Please login to add a commentAdd a comment