న్యూఢిల్లీ: కార్మిక చట్టాల పరిధిలోకి వచ్చే వేతన జీవులు, కార్మికులు చేస్తున్న 8 గంటల పని ఇక నుంచి 9 గంటలుగా మారనుంది. ఇప్పటికే పలు ఫ్యాక్టరీలు కార్మికులతో 9 గంటల పని చేయిస్తున్నాయి. దేశంలో 9 గంటల పని దినాన్ని ప్రవేశపెట్టే క్రమంలో భాగంగా కేంద్రం నిబంధనలు జారీ చేసింది. భారత ప్రభుత్వం వారంలో ఒక రోజు సెలవు దినంతో రోజుకు 9 పని గంటలు చేయాలనే ప్రతిపాదనను డ్రాఫ్ట్ వేజ్ రూల్స్‌లో తీసుకొచ్చింది. అయితే.. కనీస వేతనం ఎంత ఉండాలనేదానిపై మాత్రం నిర్ణయం తీసుకోలేదు. భవిష్యత్తులో వేతనాలు నిర్ణయించడానికి ఆరు ప్రమాణాలను సూచించడం మినహా చాలా వరకు పాత నిబంధనలను ముసాయిదా పునరుద్ఘాటించింది.
కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ఉద్యోగులు, కార్మికులు తమ అభిప్రాయాల్ని తెలిపేందుకు ఓ వీలు ఉంది. ఈ నెలాఖరులోగా rajiv.ranja76@gov.in, malick.bikash@gov.in ఈ-మెయిళ్లకు తమ అభిప్రాయాలు పంపొచ్చు. పని గంటలు పెంచినంత మాత్రాన శాలరీలు పెరుగుతాయన్న గ్యారెంటీ లేదు. అందువల్ల కేంద్రం నిర్ణయాన్ని ఉద్యోగులు, కార్మికులు వ్యతిరేకించే అవకాశాలున్నాయి. వారి అభిప్రాయాల్ని లెక్కలోకి తీసుకొని కేంద్రం ఫైనల్ నిర్ణయం తీసుకునే వీలుంది.
ఒక కుటుంబంలో నలుగురు సభ్యులకు కలిపి రోజుకు కనీసం 2700 కేలరీల ఆహారం, ఏడాదికి 66 మీటర్ల వస్త్రం ప్రామాణికంగా నిర్ణయించనుంది. ఈ రెండిటికీ అయ్యే ఖర్చులో 10 శాతాన్ని ఇంటి అద్దెగా, 20 శాతాన్ని ఇంధనం, విద్యుత్తు ఇతర ఖర్చులుగా లెక్కించనుంది. కనీస వేతనంలో 25 శాతం పిల్లల విద్య, వైద్యం, వినోదం, ఇతర ఖర్చుల కింద తీసుకుని నిర్ణయించాలని నిబంధనల్లో కార్మికశాఖ పేర్కోంది. కాగా, 1957 తొలిసారి కనీసం వేతనం లెక్కించిన విధానమే ఇప్పటికీ అమలు చేస్తుండటం గమనార్హం. అయితే, ఈ లెక్కలను ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పెంచాలనే అంతర్గత కమిటీ సూచించింది. వర్కర్, భాగస్వామి, ఇద్దరు పిల్లలు, తల్లిదండ్రులు మొత్తం ఆరుగురిని యూనిట్‌గా పరిగణలోకి తీసుకోవాలని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment