labour laws
-
భారత్ వాణిజ్యానికి సంస్కరణలు కీలకం
న్యూఢిల్లీ: కార్మిక చట్టాలను మెరుగుపర్చడం, ట్యాక్సేషన్‌ను సరళీకరించడం, టారిఫ్‌లపరంగా స్థిరమైన పరిస్థితులు కల్పించడం మొదలైన సంస్కరణలు .. ప్రపంచ దేశాలతో భారత్ జరిపే వాణిజ్య లావాదేవీలకు కీలకమని ఒక నివేదిక పేర్కొంది. అబ్జర్వర్వ్ రీసెర్చ్ ఔండేషన్ (ఓఆర్ఎఫ్), ఓఆర్ఎఫ్ అమెరికా సంయుక్తంగా దీన్ని రూపొందించాయి. కోవిడ్ అనంతరం నెలకొన్న పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయ వేల్యూ చెయిన్‌లోకి (జీవీసీ) భారత్ ఏ విధంగా అనుసంధానం కాగలదనే అంశంపై నిర్వహించిన అధ్యయనం ఆధారంగా దీన్ని తయారు చేశాయి. నిర్దిష్ట ఉత్పత్తి తయారీలో వివిధ దేశాలు పాలుపంచుకునే ప్రక్రియను జీవీసీగా వ్యవహరిస్తారు. అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం, కోవిడ్-19 మహమ్మారి, రష్యా-ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలతో సరఫరా పరమైన సవాళ్లు గణనీయంగా పెరిగిపోయాయని నివేదిక పేర్కొంది. ఒకప్పుడు ఆర్థిక ప్రగతికి దివ్యౌషధంగా భావించిన జీవీసీ, ప్రస్తుతం ఒడిదుడుకులకు లోనవుతోందని వివరించింది. ఏరోస్పేస్, డిఫెన్స్, ఆటోమోటివ్, ఆటో విడిభాగాలు, భారీ యంత్రాలు, ఫార్మా, ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ డిజైన్ అండ్ మాన్యుఫాక్చరింగ్ తదితర రంగాల్లో దేశీయంగా కార్యకలాపాలు సాగిస్తున్న 200 పైచిలుకు దేశ, విదేశీ సంస్థలు ఈ సర్వేలో పాల్గొన్నాయి. అయిదు సవాళ్లు.. ‘భారత్‌లో వ్యాపార విస్తరణకు కంపెనీలు ప్రధానంగా ఐదుఅడ్డంకులు ఎదుర్కొంటున్నాయి. వీటిలో ట్యాక్సేషన్ నిబంధనలు .. పాలసీలు; మౌలిక సదుపాయాల నాణ్యత (లోపాలు); వాణిజ్య.. టారిఫ్ విధానంలో అనిశ్చితి; మూలధనం (అందుబాటులో లేకపోతుండటం); ముడి వస్తువులు (కొరత) ఉన్నాయి‘ అని నివేదిక వివరించింది. ఈ నేపథ్యంలో జీవీసీలో అను సంధానానికి తోడ్పడేందుకు అత్యవసరంగా మౌలిక సదుపాయాలను మెరుగుపర్చడంపై పెట్టుబడులు పెంచాల్సిన అవసరం ఉందని వివరించింది. అలాగే కీలకమైన సరఫరా వ్యవస్థల్లోని బలహీనతలను గుర్తించడం, నియంత్రణ పరంగా స్థిరమైన పరిస్థితులు కల్పించడం, లాజిస్టిక్స్.. రవాణా నిబంధనలను సమన్వయ తదితర అంశాలపై దృష్టి పెట్టాల్సి ఉంటుందని సూచించింది. మరిన్ని విశేషాలు.. ♦భారత వాణిజ్య భాగస్వామిగా అంతా ఏకగ్రీవంగా అమెరికాకే ప్రాధాన్యమిస్తున్నారు. బ్రిటన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య (ఆర్సీఈపీ) గ్రూప్‌నకు పెద్దగా మద్దతు లభించడం లేదు. ♦ జీవీసీలో భాగం కావడం తమకు చాలా కీలకమని సర్వేలో పాల్గొన్న సంస్థల్లో 87 శాతం కంపెనీలు తెలిపాయి. మహమ్మారి అనంతరం జీవీసీల విషయంలో తమ అభిప్రాయాలు మారినట్లు 89 శాతం సంస్థలు పేర్కొన్నాయి. ♦ ఎక్కువగా ఇతరులపై ఆధారపడే తయారీ విధానాల వల్ల పరిశ్రమకు రిస్కులు పెరుగుతాయి. వ్యాపార పరిస్థితుల్లో అనిశ్చితి నెలకొంటుంది. ఫలితంగా వ్యాపార విస్తరణ, పెట్టుబడులకు సంబంధించి స్వల్ప, దీర్ఘకాలిక ప్రణాళికలపై ప్రత్యక్షంగా ప్రభావం పడుతుంది. ♦ దేశీ విధానాలు తమ పెట్టుబడులను ప్రభావితం చేస్తాయని ఆటో కంపెనీలు తెలిపాయి. అంతర్జాతీయంగా స్థూలఆర్థిక పరిస్థితులు తమపై ప్రభావం చూపుతాయని మిగతా రంగాల కంపెనీలు తెలిపాయి. ♦ జీవీసీతో అనుసంధానమయ్యేందుకు భారత్ వాణిజ్య విధానాలు చాలా ముఖ్యమని 70 శాతం సంస్థలు తెలిపాయి. వైద్య పరికరాలు, ఫార్మా పరిశ్రమలో ఈ ధోరణి మరింత స్పష్టంగా (93 శాతం) కనిపించింది. ♦ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిర్ణయాలను ప్రభావితం చేయడంలో ’ముడి వస్తువుల లభ్యత’ కీలకంగా ఉంటోందని 74 శాతం సంస్థలు వివరించాయి. నిపుణులైన సిబ్బంది అంశం తర్వాత స్థానంలో (70 శాతం కంపెనీలు) ఉంది. -
ఇకపై అందరికీ వారానికి నాలుగు రోజులపాటే పని...!
కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ విషయంలో కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఈ నాలుగు లేబర్ కోడ్స్ అమల్లోకి రానున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచే లేబర్ కోడ్స్ అమల్లోకి రావాల్సి ఉండగా.. కొత్త విధివిధానాలను రూపొందించడంలో జాప్యం జరగడంతో లేబర్ కోడ్స్ అమలు నిలిచిపోయింది. వివిధ కార్మిక చట్టాలను సవరించిన వేతనాలు, సామాజిక భద్రత, పారిశ్రామిక సంబంధాలు, వృత్తి భద్రత; ఆరోగ్యం, పని పరిస్థితులు పేరిట నాలుగు లేబర్ కోడ్లను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ లేబర్ కోడ్స్‌కు సంబంధించిన నియమ నిబంధనలను కేంద్రం రూపొందించింది. ఉమ్మడి జాబితాలో... కేంద్రం తీసుకొచ్చిన కొత్త లేబర్ కోడ్స్ ఉమ్మడి జాబితాలో ఉన్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు కూడా విధివిధానాలను ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. ఇప్పటికే 18 రాష్ట్రాలు లేబర్ కోడ్స్ డ్రాఫ్ట్‌ను ప్రచురించాయి. ఈ 18 రాష్ట్రాలు నియమ నిబంధనలను ఖరారు చేసినట్లు ఇటీవల కార్మిక శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ రాజ్యసభలో వెల్లడించారు. అన్ని రాష్ట్రాలూ నిబంధనలను ఖరారు చేశాక వచ్చే ఏడాది నుంచి ఈ లేబర్ కోడ్లు అమల్లోకి రానున్నాయని కార్మిక శాఖ సీనియర్ అధికారి వెల్లడించారు. లేబర్ కోడ్స్ అమలులోకి వస్తే..! ఈ కొత్త లేబర్ కోడ్స్ అమల్లోకి వస్తే ఉద్యోగుల ప్రాథమిక వేతనం, ప్రావిడెంట్ ఫండ్ లెక్కించే విధానంలో గణనీయమైన మార్పులు రానున్నాయి. ప్రస్తుతానికి పలు కంపెనీలు బేసిక్‌ను తక్కువగా చూపి అలవెన్సుల రూపంలో ఎక్కువ మొత్తం ఇచ్చేవి. కొత్త వేతనాల కోడ్ ప్రకారం.. ఉద్యోగి స్థూల వేతనం 50 శాతం, అలవెన్సులు 50 శాతం చొప్పున ఉండాలి. అంటే ఉద్యోగులు టెక్ హోమ్ శాలరీ తగ్గి, ఆయా కంపెనీలు పీఎఫ్ వాటాలు గణనీయంగా పెరగనున్నాయి. అంతేకాకుండా దేశవ్యాప్తంగా ఉద్యోగుల పనిదినాలు కూడా మారనున్నాయి. ప్రస్తుతం అమలులో ఉన్న వారానికి ఐదు రోజుల పాలసీకు బదులుగా, వచ్చే ఏడాది నుంచి నాలుగు రోజుల పాటు పనిచేసే అవకాశం ఉద్యోగులకు రానుంది. ఒకవేళ ఈ ప్రతిపాదన వస్తే..ఆ నాలుగు రోజుల్లో ఉద్యోగులు 12 గంటలపాటు పని చేయాల్సి ఉంటుందని కార్మిక శాఖ వెల్లడించింది. చదవండి: క్రిప్టోకరెన్సీ చట్టం: ముగియనున్న సమావేశాలు! క్రిప్టో బిల్లుపై జాప్యానికి కారణాలు ఏంటంటే.. -
వర్క్ ఫ్రం హోం: ఎక్స్ ట్రా వర్క్‌కి చెక్ పెట్టేలా కొత్త చట్టం
పోర్చుగల్: ఈ కరోనా మహమ్మారి కారణంగా అందరూ వర్క్ ఫ్రం హోంకి పరిమితమయ్యారు. దీంతో కాన్ఫరెన్స్‌లు వంటివి వర్కింగ్ అవర్స్ అయిపోయిన తర్వాత పెట్టేవారు. అందువల్ల చాలామంది ఉద్యోగులు ఒత్తిడికి గురయ్యేవారు. అయినప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో ఆఫీస్‌కి దూరంగా పనిచేయడంతో వేరే గత్యంతరం లేని పరిస్థితుల్లో పనిచేశారు. కానీ ఇప్పుడూ అలాంటి పనులు చేస్తే జరిమాను విధిస్తాను అంటోంది పోర్చుగల్ ప్రభుత్వం. (చదవండి: టీ అమ్మే వ్యక్తి.. నేడు రైలు ఇంజిన్ తయారు చేసే స్థాయికి!) అసుల విషయంలోకెళ్లితే...కోవిడ్ -19 దృష్ట్యా 18 నెలలుగా ప్రజలు ఇంటి నుండి పని చేయడం ప్రారంభించారు. దీంతో ఆఫీస్ కాల్లు, గ్రూప్ కాల్లు, జూమ్ మీటింగ్‌లు, కాన్ఫరెన్స్ కాల్లు వంటివి ఇటీవలకాలంలో ఎక్కువయ్యాయి. సహోద్యోగులతో మాట్లాడాలంటే ఆఫీస్‌కి రాలేరు కాబట్టి డిజిటల్ కమ్యూనికేషన్ ఒక్కటే పరిష్కారం. దీంతో తాము మానసిక ఒత్తిడి తట్టుకోలేకపోతున్నామంటూ పోర్చుగల్ ప్రభుత్వానికి ఫిర్యాదులు రావడంతో కొత్త కార్మిక చట్టాలను ఆమోదించింది. దీంతో బాస్‌లు, టీమ్ లీడర్లు పని గంటలు అయిపోయిన తర్వాత సిబ్బందికి కాల్ చేసి ఇబ్బంది పెట్టడానికి వీల్లేదు. ఒకరకరంగా చెప్పాలంటే పనిగంటలు అయిపోయిన తర్వాత బాస్‌లు ఎటువంటి సందేశాలు గానీ, పోన్‌లుగానీ చేయకూడదు, అలాగే ఎక్స్ట్రా వర్క్ చేయమని బలవంతం చేయకూడదు అంటూ పోర్చుగల్ ప్రభుత్వం కొత్త లేబర్ చట్టాలను తీసుకువచ్చింది. ఒక వేళ నియమాలను ఉల్లంఘిస్తే జరిమానాలు ఎదుర్కొవలసి వస్తుందని హెచ్చరించింది. (చదవండి: పువ్వుల్లొ దాగున్న ఇల్లు... కానీ అవి మొక్కలకు పూయని పూలు!) -
వారానికి 3 రోజులు సెలవులిస్తే..
సాక్షి, న్యూఢిల్లీ: గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా ఓ చర్చ జరుగుతోంది. కేంద్రం కార్మిక చట్టాలను మార్చి.. ఆరు రోజుల పని దినాలను నాలుగు రోజులకు కుదించనుంది అనేది ఈ చర్చల సారాంశం. ఇది ఇంకా ప్రతిపాదనలోనే ఉంది. అమలు కూడా అంత తేలక కాదు. పైగా ఈ నిర్ణయం తప్పకుండా అమలు చేయాలని ఒత్తిడి తేవడానికి వీలు లేదు. సంస్థల ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఇది జరగడానికి ఇంకా చాలా సమయం పడుతుంది. ఈ లోపు ప్రపంచ వ్యాప్తంగా ఏ ఏ దేశాల్లో ఇలాంటి నిర్ణయం అమల్లో ఉంది.. అక్కడ వచ్చిన మార్పులు ఏంటి.. దీని వల్ల వచ్చే నష్టాలు ఏంటనే తదితర అంశాల మీద ఓ లుక్కేయండి.. ఐదు రోజుల పని.. 2 రోజుల రెస్ట్ ప్రస్తుతం మన దేశంలో ఎక్కువగా ఐటీ రంగంలో ఈ విధానం అమల్లో ఉంది. వారానికి ఐదు రోజులు పని చేస్తే.. రెండు రోజులు వీకెండ్. బ్యాంక్ ఉద్యోగులకు నెలలో రెండు సార్లు ఇలాంటి అవకాశం లభిస్తుంది. అయితే తొలత ఈ విధానాన్ని ఓ అమెరికన్ ఫ్యాక్టరీ అమల్లోకి తెచ్చింది. మతపరమైన కారణాల వల్ల 1908లో అమెరికన్ ఫ్యాక్టరీ అయిన న్యూ ఇంగ్లాండ్ మిల్లు ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. వారంలో ఐదు రోజులు పని చేస్తే.. శని, ఆదివారాలు రెస్ట్. కార్మికులు చర్చికి వెళ్లడానికి వీలుగా ఉంటుందని ఈ నిర్ణయం తీసుకుంది. పని గంటలు తగ్గించిన దేశాలు ఫ్రాన్స్: 20 ఏళ్ల క్రితం ఫ్రాన్స్ పని గంటలు తగ్గిస్తూ విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. దేశ పౌరులు పని-వ్యక్తిగత జీవితాన్ని సరిగ్గా బ్యాలెన్స్ చేసుకుంటారనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. అయితే విమర్శకులు ఈ నిర్ణయాన్ని తప్పు పట్టారు. పని గంటలు తగ్గించడం వల్ల ఫ్రెంచ్ కంపెనీల్లో పోటీతత్వం తగ్గిందని విమర్శించారు. నెదర్లాండ్స్: నెదర్లాండ్స్ పని గంటలను భారీగా తగ్గించింది. ఈ మేరకు 2000 సంవత్సరంలో ఓ చట్టం చేసింది. దీని ప్రకారం నెదర్లాండ్స్‌లో వారానికి 29 గంటలు మాత్రమే పని చేస్తే చాలు. న్యూజిలాండ్, ఫిన్లాండ్: ఇరువురు దేశాధ్యక్షులు తక్కువ పని గంటల చట్టాన్ని తీసుకురావాలని భావిస్తున్నారు. మన దగ్గర పరిస్థితి మన దేశంలో వారానికి 48 గంటలు పని చేయాలి. దీని ప్రకారం వారానికి ఆరు రోజుల పని చేస్తే.. రోజుకు 8 గంటలు వర్క్ చేయాలి. ఒకవేళ కేంద్రం వారానికి నాలుగు పని దినాల చట్టం అమలు చేస్తే.. అప్పుడు రోజుకు 9.6 గంటలు పని చేయాల్సి ఉంటుంది. వారానికి నాలుగు పని దినాలు-ప్రయోజనాలు పని దినాలను తగ్గించి.. వర్క్ అవర్స్‌ను పెంచే అంశం మీద అనేక పరిశోధనలు జరిగాయి. దీని వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయని సదరు సర్వేలు వెల్లడించాయి. తక్కువ పని దినాల వల్ల ఉత్పత్తి పెరగుతుంది.. ఉద్యోగుల ఆరోగ్యం బాగుంటుంది.. కంపెనీకి- ఎంప్లాయికి మధ్య బంధం బలపడుతుంది.. ఫలితంగా ఎక్కువ రోజులు ఒకే కంపెనీలో కొనసాగే అవకాశం ఉంటుందని సర్వేలు వెల్లడించాయి. ఇక విద్యుత్ వినియోగం 23 శాతం, పేపర్ ప్రింటింగ్ 59శాతం తగ్గుతుందని సర్వే తెలిపింది. నష్టాలు పని రోజులు తగ్గుతాయి.. కానీ వర్కింగ్ అవర్స్ పెరుగుతాయి. దీని వల్ల స్ట్రెస్ పెరుగుతుంది. ఇది అన్ని వ్యాపారాలకు వర్తించదు. రెస్టారెంట్, మీడియా వంటివి రోజు నడవాల్సిందే. అలాంటప్పుడు వీటిల్లో పని చేసే వారికి వారానికి మూడు రోజులు సెలవు ఇవ్వాలంటే ఎక్కువ మంది ఉద్యోగులను నియమించుకోవాలి.. షిఫ్ట్‌లు కేటాయించడం కూడా కష్టం అవుతుంది. నగరాల వారిగా సంవత్సరానికి సగటు పని గంటలు ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే భారతీయులు సంవత్సరంలో అత్యధిక గంటలు పని చేస్తున్నారని సర్వేలు తెలుపుతున్నాయి. మన దగ్గర ఓ ఉద్యోగి ఏడాదికి సగటున 2,117 గంటలు పని చేస్తున్నాడు. దుబాయ్‌లో ఇది 2,323 గంటలు, లండన్‌లో 2,003 గంటలు, టోక్యోలో 1,997 గంటలు, పారిస్‌లో 1,663 గంటలుగా ఉంది. చైనాలో కూడా ఏడాదికి సగటు పని గంటలు మన కన్నా తక్కువే. బీజింగ్‌లో ఒక ఉద్యోగి ఏడాదికి సగటున 2,096 గంటలు పని చేస్తున్నాడు. ఇక మనదగ్గర ముంబైలో ఓ ఉద్యోగి సగటున ఏడాదికి 2,691 గంటలు పని చేస్తుండగా.. ఢిల్లీలో 2,511 గంటలు వర్క్ చేస్తున్నాడు. చదవండి: ఇక ‘ఓవర్‌టైమ్’కి వేతనం.. ఈ సడలింపులు ఎవరికి ప్రయోజనకరం? -
ఇక ‘ఓవర్‌టైమ్’కి వేతనం..
న్యూఢిల్లీ: ఇక మీదట వారానికి నాలుగు రోజులే పని దినాలుగా తీసుకురావాలని భావిస్తోన్న కేంద్రం కార్మిక శాఖ మరో నూతన చట్టం తీసుకురానుంది. దీని ప్రకారం కార్మికులు కంపెనీలో పనివేళలకు అదనంగా(ఓటీ) పని చేస్తే.. అందుకు వేతనం చెల్లించాలనే కొత్త నిబంధనను పరిశీలిస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి దీని అమలుకు సన్నాహాలు చేస్తోంది. హిందూస్తాన్ టైమ్స్ తాజా రిపోర్టు ప్రకారం సామాన్యంగా పనివేళలు ముగిసిన తర్వాత ఒక కార్మికుడు 15 నిముషాలు అదనంగా పనిచేస్తే దానికి కూడా సదరు కంపెనీ వేతనం చెల్లించాలని ఈ చట్టం చెబుతోంది. ఈ విధంగా కేంద్రం కొత్త నిబంధనలు, చట్టాల ద్వారా కార్మికులకు కొంత పని ఒత్తిడి తగ్గించడంతోపాటు, ఉత్పాదకత పెరిగే దిశగా ప్రోత్సహించాలని చూస్తోంది. (చదవండి: ఇక వారానికి నాలుగే పనిరోజులు!) -
ర్యాపర్‌పై రూ.218 కోట్లకు దావా..!
వాషింగ్టన్: అమెరికన్ ర్యాపర్ కాన్యే వెస్ట్‌ని లీగల్ వివాదాలు ఇప్పట్లో వదిలేలా లేవు. ఇప్పటికే విడాకులు తీసుకోవాలని భావించి కోర్టు మెట్లు ఎక్కిన కాన్యే వెస్ట్ తాజాగా తన సండే సర్విసెస్ నుంచి లీగల్ నోటీసులు అందుకున్నారు. కార్మిక చట్టాలను ఉల్లంఘించారనే నేపంతో.. ఆయన మీద 30 మిలియన్ డాలర్లకు(దాదాపు 218 కోట్ల రూపాయలు) దావా వేశారు. సన్ అండ్ ది డైలీ మెయిల్ ప్రకారం, కాన్యే తన సండే సర్వీసెస్, ఇతర ప్రదర్శనలకు సంబంధించిన క్లాస్-యాక్షన్ సూట్లను ఎదుర్కొంటున్నారు. గత సంవత్సరం లాస్ ఏంజిల్స్‌లో ఈ దావాలు దాఖలు చేశారు. ఇక వీటిలో వందలాది వర్కర్స్, స్టాఫ్ కాన్యే చెల్లింపులో చాలా ఆలస్యం చేస్తాడని, వాటిలో ఊహించని కోతలు, ఉద్యోగంలో దుర్వినియోగం వంటి వాటి గురించి వెల్లడించారు. ఇక కాన్యే మీద రెండు వ్యాజ్యాలు దాఖలు కాగా.. మొదటిది 500 మంది వర్కర్స్ తరఫున దాఖలైంది. డైలీ మెయిల్ యూఎస్ ప్రకారం కాన్యే వెస్ట్ వారికి కనీసం భోజనం చేయడానికి సమయం ఇవ్వకుండా, విరామం లేకుండా రెండు రోజులు ఏకధాటిగా పని చేయించడాని ఆరోపించారు. (చదవండి: ‘విడాకులు తీసుకోబోతున్న స్టార్ కపుల్’) దావా దాఖలు చేసిన వారిలో ఒకరైన మైఖేల్ పియర్సన్ మాట్లాడుతూ, ‘‘కాన్యే వెస్ట్ నిబంధనలకు మించి మాతో అధిక సమయం పని చేయించుకుంటారు. ఓవర్‌టైం పని చేసినా కేవలం 500 డాలర్ల మాత్రమే చెల్లిస్తారు’’ అని తెలిపాడు. అంతేకాక మిగతా వర్కర్స్ మాదిరిగానే నేను రోజంతా నిలబడి పని చేశాను. లంచ్, బాత్రూం బ్రేక్స్ కూడా తీసుకోనివ్వలేదు. ఇంత చేస్తే.. కనీసం ఇంటికి వెళ్లడానికి వెహికల్ కూడా ఏర్పాటు చేయలేదు’’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. అలానే కాన్యే వెస్ట్ 2019 ఒపెరా "నెబుచాడ్నెజ్జార్" ప్రదర్శనలో పని చేసిన వారు కూడా ఇదే రకమైన ఆరోపణలు చేశారు. ఇక తాము కోల్పోయిన బ్రేక్ టైం, పని చేసిన ఓవర్ టైంకు సంబంధించి నష్ట పరిహారం పొందేందుకు గాను దావా దాఖలు చేస్తున్నట్లు వెల్లడించారు. కాన్యే సండే సర్వీసులకు సంబంధించిన మరో దావాను టెక్ కంపెనీ మైచానెల్ ఇంక్ దాఖలు చేసినట్లు డైలీ మెయిల్ నివేదించింది. ఆ దావాలో వర్కర్స్ ఆరు నెలలుగా తమకు వేతనం ఇవ్వలేదని ఆరోపించారు. ఈ రెండు దావాల వల్ల కాన్యే సుమారు 30 మిలియన్ డాలర్ల నష్టపరిహారాన్ని చెల్లించాలి -
ఈ సడలింపులు ఎవరికి ప్రయోజనకరం?
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని గుజరాత్ సహా దాదాపు పది పారిశ్రామిక రాష్ట్రాలు ఇటీవల పలు కార్మిక చట్టాలను సడలించాయి. దీనిపట్ల ‘సెంటర్ ఫర్ ఇండియన్ ట్రేడ్ యూనియన్లు సహా పలు కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ సడలింపులు ఎవరికి ప్రయోజనకరం? యజమానులకా, కార్మికులకా? ప్రభుత్వం ఆశిస్తున్నట్లుగా అధిక పెట్టుబడులు వచ్చి పడతాయా? (లాక్డౌన్: ఆగని విషాదాలు) ఈ విషయంలో జంషెడ్పూర్ బిజినెస్ స్కూల్లో మానవ వనరుల విభాగంలో పని చేస్తోన్న ప్రొఫెసర్ కేఆర్ శ్యామ సుందర్, దేశంలోనే సిబ్బందిని సరఫరా చేసే అతిపెద్ద కంపెనీ ‘టీమ్ లీజ్’ కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్‌ప్రెసిడెంట్ రితుపర్ణ చక్రవర్తి తమ అభిప్రాయాలను మీడియాతో పంచుకున్నారు. ‘కార్మిక చట్టాల్లో అనూహ్య మార్పులు తీసుకొచ్చారు. ఆ దిగ్భ్రాంతి నుంచి నేను ఇంకా కోరుకోలేదు. ఈ మార్పులను కంపెనీల యాజమానులు కూడా కలగనలేదు. ఆశించనూ లేదు. మూడు చట్టాలు మినహా మిగతా అన్ని చట్టాల్లో భారీ మార్పులను తీసుకరావడం ద్వారా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అందరికన్నా అన్ని రాష్ట్రాలకన్నా అత్యుత్సాహం చూపింది. యూపీతో పోలిస్తే మధ్యప్రదేశ్ రాష్ట్రం కొంచెం సంకుచితంగా వ్యవహరించిందని చెప్పవచ్చు. అయితే ఈ మార్పులు కంపెనీ యజమానులకుగానీ, కార్మికులకుగానీ దోహదం చేసేవిలాగా లేవన్నది నా అభిప్రాయం’ అని శ్యామ్ సుందర్ తెలిపారు. కార్మికులకు, యజమానులకు మధ్య తలెత్తే వివాదాలను చట్టపరమైన ప్రమాణాలు లేకుండా కేవలం ఇరువర్గాల కమిటీలతో ఎలా పరిష్కారం అవుతాయో తనకు అర్థం కావడం లేదని ఆయన అన్నారు. ఈ సవరణలోతోని చైనా కంపెనీలు ఉత్పత్తి చేస్తున్న వస్తువులను ఇక నుంచి భారత్ కంపెనీలు ఉత్పత్తి చేస్తాయని ఆశించడం అత్యాశే అవుతుందని అన్నారు. పైగా చైనా కార్మిక శక్తితో భారత కార్మిక శక్తిని పోల్చలేమని చెప్పారు. రాష్ట్రాల స్థాయిలో చట్టాలను మార్చడం వల్ల ఆశించిన ప్రయోజనం ఉండదని, కేంద్ర చట్టాల పరిధి మార్పులు చేసి, వాటి పరిధిలోకి రాష్ట్రస్థాయి చట్టాలను తీసుకరావడం వల్ల ప్రయోజనం ఉంటుందని రితిపర్ణ చక్రవర్తి అభిప్రాయపడ్డారు. ఇప్పుడిప్పుడు కార్మిక చట్టాల ప్రయోజనాలను కార్మికులు పొందుతున్నారని, యాజమాన్యాలు కూడా కార్మిక చట్టాలకు అనుగుణంగా నడుచుకునేందుకు ప్రయత్తిస్తున్నాయని, ఈ తరుణంలో చట్టాలను ఎత్తివేయడం మంచిది కాదని ఆయన సూచించారు. కార్మికుల్లో, తద్వారా ప్రజల్లో అభద్రతాభావం పెరుగుతుందని, అది ఉత్పాదన శక్తిపై ప్రభావం చూపిస్తుందని ఆయన హెచ్చరించారు. (అదే వరస..ఆగని కరోనా కేసులు..) -
కరోనా సాకుతో ఇంత అన్యాయమా?
న్యూఢిల్లీ: కరోనా సంక్షోభాన్ని అడ్డం పెట్టుకుని కార్మిక చట్టాలను కాలరాయాలని కొన్ని రాష్ట్రాలు చేస్తున్న ప్రయత్నాలను కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ తప్పుబట్టారు. లక్షలాది మంది కార్మికుల హక్కులను దెబ్బతీసేలా కార్మిక చట్టాలను సవరించడం సరికాదని అన్నారు. ‘కార్మిక చట్టాలను చాలా రాష్ట్రాలు సవరిస్తున్నాయి. కరోనా [వైరస్] కి వ్యతిరేకంగా మనమంతా పోరాడుతున్నాం. కాని ఇది మానవ హక్కులను కాలరాయడానికి, అసురక్షిత కార్యాలయాలను అనుమతించడానికి, కార్మికులను దోపిడీ చేయడానికి, వారి గళాలను అణచివేయడానికి ఒక సాకు కాదు. మేము ప్రాథమిక సూత్రాలపై (కార్మికుల హక్కులను కాపాడటం) రాజీపడబోమ’ని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. (ప్రత్యేక రైళ్లు: ఎక్కువ మందిని తరలించేలా..) కరోనా సంక్షోభంతో ఆర్థిక వ్యవస్థ కుదేలైన నేపథ్యంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్ ప్రభుత్వాలు కార్మిక చట్టాల నుంచి పరిశ్రమలకు తాత్కాలిక మినహాయింపులు కల్పించాయి. ఉద్యోగులను నియమించుకోవడం, తొలగించడంలో యాజమాన్యాలకు పూర్తి అధికారాన్ని కట్టబెట్టాయి. పనివేళలను సైతం 8 నుంచి 12 గంటలకు పెంచుకునేందుకు అనుమతిచ్చాయి. తనిఖీల నుంచి కూడా మినహాయింపునిచ్చాయి. ప్రస్తుతం ఉన్న పరిశ్రమలతోపాటు కొత్త పరిశ్రమలకూ ఈ నిబంధనలు వర్తిస్తాయి. దీనిపై పరిశ్రమల వర్గాల నుంచి సానుకూలత వ్యక్తం కాగా, కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. (54 రోజులుగా ఎయిర్‌పోర్ట్‌లో ఒక్కడే!) -
ఈఫిల్ టవర్ మూసివేత!
ప్రపంచ ఏడు వింతల్లో ఒకటైన ఈఫిల్ టవర్ మంగళవారం మూతపడింది. ప్రతిరోజు వేలమంది సందర్శకులు ఇక్కడికి వస్తుంటారు. గతేడాది 70 లక్షలకు పైగా పర్యాటకులు ఈ అద్భుతాన్ని సందర్శించగా ఇందులో 80 శాతానికి పైగా విదేశీయులు ఉన్నారు. అయితే ఫ్రాన్స్ కార్మిక చట్టాలు తమకు అడ్డుగా నిలుస్తున్నాయని, దీంతో తాము అధిక ఒత్తిడికి గురవుతున్నాయని కార్మికులు ధర్నా చేశారు. ఈ కారణంగా ఈఫిల్ టవర్ ను మంగళవారం మూసివేసినట్లు అధికారికంగా ప్రకటించారు. ఈఫిల్ టవర్ కు వచ్చే సందర్శకులను రిసీవ్ చేసుకోవడం, సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం, టవర్ వద్ద పనిచేయడం, మొదలైన పనులు నిర్వహించడం తమకు చాలా కష్టమవుతుందని ధర్నా చేస్తున్నారు. ప్రతిరోజూ 15 నుంచి 20 వేల మంది ఇక్కడకి వస్తుంటారని, తగిన స్టాప్ లేకపోవడంతో ఒక కార్మికుడు రెండు, మూడు డిపార్ట్ మెంట్స్ పనులు నిర్వహించాల్సి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మిక చట్టాల కారణంగానే నిరుద్యోగిత సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని కార్మికులు వాపోయారు. వర్కర్స్ ఎవరూ రాకపోవడంతో ఈఫిల్ టవర్ ను తాత్కాలికంగా మూసివేసినట్లు అధికారులు వెల్లడించారు.