సాక్షి, న్యూఢిల్లీ: గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా ఓ చర్చ జరుగుతోంది. కేంద్రం కార్మిక చట్టాలను మార్చి.. ఆరు రోజుల పని దినాలను నాలుగు రోజులకు కుదించనుంది అనేది ఈ చర్చల సారాంశం. ఇది ఇంకా ప్రతిపాదనలోనే ఉంది. అమలు కూడా అంత తేలక కాదు. పైగా ఈ నిర్ణయం తప్పకుండా అమలు చేయాలని ఒత్తిడి తేవడానికి వీలు లేదు. సంస్థల ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఇది జరగడానికి ఇంకా చాలా సమయం పడుతుంది. ఈ లోపు ప్రపంచ వ్యాప్తంగా ఏ ఏ దేశాల్లో ఇలాంటి నిర్ణయం అమల్లో ఉంది.. అక్కడ వచ్చిన మార్పులు ఏంటి.. దీని వల్ల వచ్చే నష్టాలు ఏంటనే తదితర అంశాల మీద ఓ లుక్కేయండి..
ఐదు రోజుల పని.. 2 రోజుల రెస్ట్
ప్రస్తుతం మన దేశంలో ఎక్కువగా ఐటీ రంగంలో ఈ విధానం అమల్లో ఉంది. వారానికి ఐదు రోజులు పని చేస్తే.. రెండు రోజులు వీకెండ్. బ్యాంక్ ఉద్యోగులకు నెలలో రెండు సార్లు ఇలాంటి అవకాశం లభిస్తుంది. అయితే తొలత ఈ విధానాన్ని ఓ అమెరికన్ ఫ్యాక్టరీ అమల్లోకి తెచ్చింది. మతపరమైన కారణాల వల్ల 1908లో అమెరికన్ ఫ్యాక్టరీ అయిన న్యూ ఇంగ్లాండ్ మిల్లు ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. వారంలో ఐదు రోజులు పని చేస్తే.. శని, ఆదివారాలు రెస్ట్. కార్మికులు చర్చికి వెళ్లడానికి వీలుగా ఉంటుందని ఈ నిర్ణయం తీసుకుంది.
పని గంటలు తగ్గించిన దేశాలు
ఫ్రాన్స్:
20 ఏళ్ల క్రితం ఫ్రాన్స్ పని గంటలు తగ్గిస్తూ విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. దేశ పౌరులు పని-వ్యక్తిగత జీవితాన్ని సరిగ్గా బ్యాలెన్స్ చేసుకుంటారనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. అయితే విమర్శకులు ఈ నిర్ణయాన్ని తప్పు పట్టారు. పని గంటలు తగ్గించడం వల్ల ఫ్రెంచ్ కంపెనీల్లో పోటీతత్వం తగ్గిందని విమర్శించారు.
నెదర్లాండ్స్:
నెదర్లాండ్స్ పని గంటలను భారీగా తగ్గించింది. ఈ మేరకు 2000 సంవత్సరంలో ఓ చట్టం చేసింది. దీని ప్రకారం నెదర్లాండ్స్‌లో వారానికి 29 గంటలు మాత్రమే పని చేస్తే చాలు.
న్యూజిలాండ్, ఫిన్లాండ్:
ఇరువురు దేశాధ్యక్షులు తక్కువ పని గంటల చట్టాన్ని తీసుకురావాలని భావిస్తున్నారు.
మన దగ్గర పరిస్థితి
మన దేశంలో వారానికి 48 గంటలు పని చేయాలి. దీని ప్రకారం వారానికి ఆరు రోజుల పని చేస్తే.. రోజుకు 8 గంటలు వర్క్ చేయాలి. ఒకవేళ కేంద్రం వారానికి నాలుగు పని దినాల చట్టం అమలు చేస్తే.. అప్పుడు రోజుకు 9.6 గంటలు పని చేయాల్సి ఉంటుంది.
వారానికి నాలుగు పని దినాలు-ప్రయోజనాలు
పని దినాలను తగ్గించి.. వర్క్ అవర్స్‌ను పెంచే అంశం మీద అనేక పరిశోధనలు జరిగాయి. దీని వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయని సదరు సర్వేలు వెల్లడించాయి. తక్కువ పని దినాల వల్ల ఉత్పత్తి పెరగుతుంది.. ఉద్యోగుల ఆరోగ్యం బాగుంటుంది.. కంపెనీకి- ఎంప్లాయికి మధ్య బంధం బలపడుతుంది.. ఫలితంగా ఎక్కువ రోజులు ఒకే కంపెనీలో కొనసాగే అవకాశం ఉంటుందని సర్వేలు వెల్లడించాయి. ఇక విద్యుత్ వినియోగం 23 శాతం, పేపర్ ప్రింటింగ్ 59శాతం తగ్గుతుందని సర్వే తెలిపింది.
నష్టాలు
- పని రోజులు తగ్గుతాయి.. కానీ వర్కింగ్ అవర్స్ పెరుగుతాయి. దీని వల్ల స్ట్రెస్ పెరుగుతుంది.
- ఇది అన్ని వ్యాపారాలకు వర్తించదు.
- రెస్టారెంట్, మీడియా వంటివి రోజు నడవాల్సిందే. అలాంటప్పుడు వీటిల్లో పని చేసే వారికి వారానికి మూడు రోజులు సెలవు ఇవ్వాలంటే ఎక్కువ మంది ఉద్యోగులను నియమించుకోవాలి.. షిఫ్ట్‌లు కేటాయించడం కూడా కష్టం అవుతుంది.
నగరాల వారిగా సంవత్సరానికి సగటు పని గంటలు
ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే భారతీయులు సంవత్సరంలో అత్యధిక గంటలు పని చేస్తున్నారని సర్వేలు తెలుపుతున్నాయి. మన దగ్గర ఓ ఉద్యోగి ఏడాదికి సగటున 2,117 గంటలు పని చేస్తున్నాడు. దుబాయ్‌లో ఇది 2,323 గంటలు, లండన్‌లో 2,003 గంటలు, టోక్యోలో 1,997 గంటలు, పారిస్‌లో 1,663 గంటలుగా ఉంది. చైనాలో కూడా ఏడాదికి సగటు పని గంటలు మన కన్నా తక్కువే. బీజింగ్‌లో ఒక ఉద్యోగి ఏడాదికి సగటున 2,096 గంటలు పని చేస్తున్నాడు. ఇక మనదగ్గర ముంబైలో ఓ ఉద్యోగి సగటున ఏడాదికి 2,691 గంటలు పని చేస్తుండగా.. ఢిల్లీలో 2,511 గంటలు వర్క్ చేస్తున్నాడు.
చదవండి: ఇక ‘ఓవర్‌టైమ్’కి వేతనం..
ఈ సడలింపులు ఎవరికి ప్రయోజనకరం?
Comments
Please login to add a commentAdd a comment