న్యూఢిల్లీ: కార్మిక చట్టాలను మెరుగుపర్చడం, ట్యాక్సేషన్‌ను సరళీకరించడం, టారిఫ్‌లపరంగా స్థిరమైన పరిస్థితులు కల్పించడం మొదలైన సంస్కరణలు .. ప్రపంచ దేశాలతో భారత్ జరిపే వాణిజ్య లావాదేవీలకు కీలకమని ఒక నివేదిక పేర్కొంది. అబ్జర్వర్వ్ రీసెర్చ్ ఔండేషన్ (ఓఆర్‌ఎఫ్), ఓఆర్‌ఎఫ్ అమెరికా సంయుక్తంగా దీన్ని రూపొందించాయి. కోవిడ్ అనంతరం నెలకొన్న పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయ వేల్యూ చెయిన్‌లోకి (జీవీసీ) భారత్ ఏ విధంగా అనుసంధానం కాగలదనే అంశంపై నిర్వహించిన అధ్యయనం ఆధారంగా దీన్ని తయారు చేశాయి.
నిర్దిష్ట ఉత్పత్తి తయారీలో వివిధ దేశాలు పాలుపంచుకునే ప్రక్రియను జీవీసీగా వ్యవహరిస్తారు. అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం, కోవిడ్-19 మహమ్మారి, రష్యా-ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలతో సరఫరా పరమైన సవాళ్లు గణనీయంగా పెరిగిపోయాయని నివేదిక పేర్కొంది. ఒకప్పుడు ఆర్థిక ప్రగతికి దివ్యౌషధంగా భావించిన జీవీసీ, ప్రస్తుతం ఒడిదుడుకులకు లోనవుతోందని వివరించింది. ఏరోస్పేస్, డిఫెన్స్, ఆటోమోటివ్, ఆటో విడిభాగాలు, భారీ యంత్రాలు, ఫార్మా, ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ డిజైన్ అండ్ మాన్యుఫాక్చరింగ్ తదితర రంగాల్లో దేశీయంగా కార్యకలాపాలు సాగిస్తున్న 200 పైచిలుకు దేశ, విదేశీ సంస్థలు ఈ సర్వేలో పాల్గొన్నాయి.
అయిదు సవాళ్లు..
‘భారత్‌లో వ్యాపార విస్తరణకు కంపెనీలు ప్రధానంగా ఐదుఅడ్డంకులు ఎదుర్కొంటున్నాయి. వీటిలో ట్యాక్సేషన్ నిబంధనలు .. పాలసీలు; మౌలిక సదుపాయాల నాణ్యత (లోపాలు); వాణిజ్య.. టారిఫ్ విధానంలో అనిశ్చితి; మూలధనం (అందుబాటులో లేకపోతుండటం); ముడి వస్తువులు (కొరత) ఉన్నాయి‘ అని నివేదిక వివరించింది. ఈ నేపథ్యంలో జీవీసీలో అను సంధానానికి తోడ్పడేందుకు అత్యవసరంగా మౌలిక సదుపాయాలను మెరుగుపర్చడంపై పెట్టుబడులు పెంచాల్సిన అవసరం ఉందని వివరించింది. అలాగే కీలకమైన సరఫరా వ్యవస్థల్లోని బలహీనతలను గుర్తించడం, నియంత్రణ పరంగా స్థిరమైన పరిస్థితులు కల్పించడం, లాజిస్టిక్స్.. రవాణా నిబంధనలను సమన్వయ తదితర అంశాలపై దృష్టి పెట్టాల్సి ఉంటుందని సూచించింది.
మరిన్ని విశేషాలు..
♦భారత వాణిజ్య భాగస్వామిగా అంతా ఏకగ్రీవంగా అమెరికాకే ప్రాధాన్యమిస్తున్నారు. బ్రిటన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య (ఆర్‌సీఈపీ) గ్రూప్‌నకు పెద్దగా మద్దతు లభించడం లేదు.
♦ జీవీసీలో భాగం కావడం తమకు చాలా కీలకమని సర్వేలో పాల్గొన్న సంస్థల్లో 87 శాతం కంపెనీలు తెలిపాయి. మహమ్మారి అనంతరం జీవీసీల విషయంలో తమ అభిప్రాయాలు మారినట్లు 89 శాతం సంస్థలు పేర్కొన్నాయి.
♦ ఎక్కువగా ఇతరులపై ఆధారపడే తయారీ విధానాల వల్ల పరిశ్రమకు రిస్కులు పెరుగుతాయి. వ్యాపార పరిస్థితుల్లో అనిశ్చితి నెలకొంటుంది. ఫలితంగా వ్యాపార విస్తరణ, పెట్టుబడులకు సంబంధించి స్వల్ప, దీర్ఘకాలిక ప్రణాళికలపై ప్రత్యక్షంగా ప్రభావం పడుతుంది.
♦ దేశీ విధానాలు తమ పెట్టుబడులను ప్రభావితం చేస్తాయని ఆటో కంపెనీలు తెలిపాయి. అంతర్జాతీయంగా స్థూలఆర్థిక పరిస్థితులు తమపై ప్రభావం చూపుతాయని మిగతా రంగాల కంపెనీలు తెలిపాయి.
♦ జీవీసీతో అనుసంధానమయ్యేందుకు భారత్ వాణిజ్య విధానాలు చాలా ముఖ్యమని 70 శాతం సంస్థలు తెలిపాయి. వైద్య పరికరాలు, ఫార్మా పరిశ్రమలో ఈ ధోరణి మరింత స్పష్టంగా (93 శాతం) కనిపించింది.
♦ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిర్ణయాలను ప్రభావితం చేయడంలో ’ముడి వస్తువుల లభ్యత’ కీలకంగా ఉంటోందని 74 శాతం సంస్థలు వివరించాయి. నిపుణులైన సిబ్బంది అంశం తర్వాత స్థానంలో (70 శాతం కంపెనీలు) ఉంది.
Comments
Please login to add a commentAdd a comment